రాష్ట్రీయం

సత్వర తీర్పులకు సాంకేతిక కోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: న్యాయస్థానాల్లో వేగంగా తీర్పులిచ్చేందుకు ఈ-కోర్టు ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ అభిప్రాయపడ్డారు. దేశంలో మొట్టమొదటి ఈ-కోర్టును హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టులో ఆదివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టులో ఈ-కమిటీకి లోకూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ-కోర్టుల వల్ల విచారణ వేగంగా జరుగుతుందని, అందువల్ల తీర్పులు కూడా వేగంగా వచ్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టెక్నాలజీ రంగంలో వేగంగా దూసుకెళ్తున్నాయని, అందువల్ల దేశంలో మొట్టమొదటి ఈ-కోర్టు ఇక్కడ ప్రారంభించేందుకు ఇదో కారణమని వివరించారు. ఈ-కోర్టువల్ల ‘సమీకృత నేర న్యాయ విధానం’ (ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టం-ఐసిజెఎస్) ప్రారంభించేందుకు వీలవుతోందన్నారు. కొత్త విధానంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైళ్లు, ఫోరెన్సిక్ లాబోరేటరీలను సమీకృతం చేస్తూ కేసుల విచారణ చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ఈ-కోర్టులో కాగితాల వాడకం ఉండదని, అంతా కంప్యూటర్లతోనే పని ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి నియమావళిని రూపొందించేందుకు ఈనెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కేస్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలో నియమావళి రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ-కోర్టుల వల్ల కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేందుకు వీలవుతుందని, తీర్పులు వేగంగా ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఈ-కోర్టు ప్రారంభించడం పట్ల తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ-కోర్టు విధానం అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుందని, తాను కూడా ఈ టెక్నాలజీని వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. వాస్తవం చెప్పాలంటే ఈ-కోర్టులను ఉపయోగించడం స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. జడ్జిలంతా ఈ విధానంలో పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ సహకారం పూర్తిగా కావాలని, న్యాయవాదులు కొత్త విధానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ-కోర్టులో అవసరమైన సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని, జడ్జీలు ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలన్నారు. వచ్చే వారంలో సుప్రీంకోర్టులోనూ ఈ-కోర్టు ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ప్రారంభించిన ఈ-కోర్టు తమకూ ఆదర్శంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవవల్ల కంప్యూటరైజేషన్ కోసం గత మూడు నాలుగేళ్లలో భారీ మొత్తంలో నిధులు వెచ్చించామని జస్టిస్ లోకూర్ పేర్కొన్నారు. వీడియో కాన్పరెన్స్ విధానంలో విచారణ చేపట్టడం వల్ల కేసులకు సంబంధించిన ఖర్చు తగ్గుతుందని, ఈ విధానం మహారాష్టల్రో విజయవంతంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. కేవలం ఆర్థికమైన అంశమే కాకుండా పోలీసు సిబ్బందిపై భారం తగ్గుతుందన్నారు. హైకోర్టులన్నింటినీ కంప్యూరైజ్ చేస్తున్నామని, అన్ని హైకోర్టుల్లో ఒకే విధానం ఉండేలా చూస్తున్నామన్నారు. హైకోర్టు ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, హైకోర్టుకు చెందిన ఇతర జడ్జిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుంటే, హైకోర్టులో కంప్యూటర్ కమిటీ సభ్యుల్లో ఒకరైన జస్టిస్ పి నవీన్‌రావు సోమవారం నుండి ఈ-కోర్టుకు నేతృత్వం వహిస్తారు.

చిత్రం...
ఉమ్మడి హైకోర్టులో ఈ-కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి లోకూర్