రాష్ట్రీయం

కేంద్రానిదే తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 17: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగాక ఆరు నెలల్లో హైకోర్టు విభజన కూడా జరగాలని చట్టంలో స్పష్టంగా ఉంది’ అని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. కేంద్ర తప్పిదం వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జైరాం రమేశ్ రాసిన ‘గడిచిన చరిత్ర - తెరిచిన అధ్యాయం’ తెలుగు అనువాద పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత జైరాం రమేశ్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు, ఎందుకు ఇవ్వాలనుకున్నారన్న వివాదాస్పద అంశాలను తన పుస్తకంలో పేర్కొనలేదని అన్నారు. ప్రస్తుతం హైకోర్టు ఉన్న భవనాన్ని తెలంగాణకు వదిలేసి ఆంధ్ర విడిగా భవనం నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ఎంత ముఖ్యమో, తెలంగాణకు హైదరాబాద్ అంత ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన కొంతమంది ముఖ్య నాయకులు తనను కలిసి తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలన్నీ ఆంధ్రకేనా అని అడిగారని ఆయన చెప్పారు. అందుకే తెలంగాణకు భద్రాచలం కేటాయించి అక్కడి రెవెన్యూ డివిజన్‌లోని కొన్ని గ్రామాలను మాత్రమే ఆంధ్రకు కేటాయించడం జరిగిందని జైరాం రమేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు. కొంతమంది తనను తెలంగాణకు ప్రతినిధిగా భావిస్తుంటారని ఆయన నవ్వుతూ చెప్పారు.
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కోరా రు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పరోక్షంగా ప్రభుత్వాలకు హెచ్చరికగా అన్నారు. విభజన చరిత్రాత్మకంగా చూడకపోవడం పొరపాటు అవుతుందని ఆయన తెలిపారు.
వాయిస్ ఓటు
పాస్ కాలేదు: ఉండవల్లి
కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో వాయిస్ ఓటు పాస్ కాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన బిల్లు ఇప్పటికీ పాస్ కాలేదని ఆయన తెలిపారు. 2009లో చిదంబరం చేసిన ప్రకటనతోనే తెలంగాణ విడిపోయిందని అన్నారు. ఆ తర్వాత కె రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సమావేశం వల్ల ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. 2005లో తాను కెసిఆర్‌ను కలిసినప్పుడు విభజన వద్దనే చెప్పానని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన ఈ రెండేళ్ళలో హైదరాబాద్ తనది కాదని ఎప్పుడూ అనుకోలేదని ఉండవల్లి అన్నారు. తాను కాంగ్రెస్‌కు బలయ్యానని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనని తెలిపారు.
తెలంగాణ ఏకపక్ష
నిర్ణయం కాదు: కోదండరాం
తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం కాదని అన్నారు. కెసిఆర్ దీక్ష తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి రచయిత జైరాం తన పుస్తకంలో చక్కగా వివరించారని తెలిపారు. పుస్తకావిష్కరణ సభలో సీనియర్ పాత్రికేయులు కె రామచంద్ర మూర్తి, కె శ్రీనివాస్, గ్రంధ అనువాదకుడు కృష్ణారావు పాల్గొన్నారు.

‘గడిచిన చరిత్ర - తెరిచిన అధ్యాయం’ తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సుప్రీంకోర్టు
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, చిత్రంలో రచయత జైరాం రమేష్ ఇతర ప్రముఖలు