రాష్ట్రీయం

మోదీ మన్నిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులిద్దరినీ కలిపిన ఒకే అంశమైన నియోజకవర్గ పునర్విభజన అంశం మళ్లీ తెరపైకొచ్చింది. శనివారం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రతిపాదన చేయడంతో, నియోజకవర్గాల సంఖ్య పెంపు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమయింది.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, నియోజకవర్గ సంఖ్య పెంచాలని ఏపి సీయం చంద్రబాబు, తెలంగాణ సీయం కేసీఆర్ ఇద్దరూ తమ తమ అసెంబ్లీలలో ప్రభుత్వ పరంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం 175 నియోజకవర్గాలున్న ఏపిలో దానిని 225 స్థానాలకు పెంచాలని బాబు కోరుతున్నారు. తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలని కేసీఆర్ అభ్యర్థిస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం 2026 వరకూ దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెంచే అవకాశం లేదని విస్పష్టంగా ప్రకటించింది. దీంతో ఇద్దరు సీయంలు ఆశలు నెరవేరడం కష్టమన్న అభిప్రాయం ఏర్పడింది.
అయినాసరే ఇద్దరు సీఎంలు తమ లాబీయింగ్ ఉధృతం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్-బాబుకు అనేక అంశాల్లో విభేదాలున్నప్పటికీ, ఈ ఒక్క అంశంలో మాత్రం ఒకే అభిప్రాయం, ఒకే వాదనతో వెళుతుండటం విశేషం. ఇప్పటికే తెలంగాణలో టీఆర్‌ఎస్‌లో 21 మంది ఎమ్మెల్యేలు టిడిపి, కాంగ్రెస్, వైకాపా, సీపీఐ నుంచి చేరారు. అటు ఏపిలో కూడా వైకాపా నుంచి 20 మంది అధికార టిడిపిలో చేరారు.
అయితే భవిష్యత్తులో రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు లేకుండా చూసుకునేలా, మరికొందరు ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే త్వరలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, అప్పుడు మీరు పార్టీ మారినా మీ స్థానాలకు వచ్చిన భయమేమీలేదని, మీకు తప్పకుండా టికెట్లు ఇస్తామన్న ప్రతిపాదనతో తెదేపా- తెరా స నాయకత్వాలు, తమ రాష్ట్రాల్లోని ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆశ చూపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇద్దరు సీయంలు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా, తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకదశలో స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ను స్వయంగా కలిసిన వెంకయ్య, నియోజకవర్గ పునర్విభజన అంశంపై చర్చించారు. ఆ సందర్భంలో దాని సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతోనూ చర్చించారు. ఇద్దరు సీఎంల ప్రతిపాదన పట్ల కేంద్రం సానుకూలంగానే ఉందని ప్రకటించారు. అయితే, దానిని పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతామో ఇప్పుడే చెప్పలేమని మీడియాకు స్పష్టం చేశారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గ పునర్విభజన వల్ల తమ పార్టీకి అదనంగా వచ్చే లాభమేమిలేదని, రెండు రాష్ట్రాల బిజెపి నాయకత్వాలు తమ పార్టీ జాతీయ అధినేత అమిత్‌షాకు స్పష్టం చేశాయి. అందుకే ఈ విషయంలో మోదీ ఆసక్తి చూపించడం లేదన్న వ్యాఖ్యలు అటు పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన వైఖరిని నేరుగానే వ్యక్తం చేశారు. బాబు-కేసీఆర్ ఇద్దరూ తమ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి, ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే ఈ వాదన లేవనెత్తుతున్నారని, దానివల్ల రాజకీయంగా భాజపాకు వచ్చే అదనపు లాభమేమీ ఉండదని లక్ష్మణ్ తమ నాయకత్వానికి స్పష్టం చేశారు. నిజానికి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే స్థాయి ఉన్న అభ్యర్థులు కూడా దొరకడం కష్టమన్నది వారి అభిప్రాయం. దీనితో వెంకయ్యనాయుడు లాబీయింగ్ ఎంతవరకూ నెరవేరుతుంది? ఇద్దరు సీయంల మొర మోదీ మన్నిస్తారా? ఆ క్రమంలో ఆయన తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వాదన వైపు మొగ్గు చూపుతారా? చూడాలి.