రాష్ట్రీయం

గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూలై 17: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతిదేవి పుణ్యక్షేత్రంలో ఆదివారం గురుపౌర్ణమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాడ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు మూడు రోజులపాటు గురుపౌర్ణమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళవాయిద్యాలతో ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఈవో వెంకటేశ్వర్లు ఊరేగింపుగా కలశపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగ మండపంలో గణపతిపూజ, పుణ్యహవచనం, రుత్విక్‌ధారణ, కలశ స్థాపనతో గురుపౌర్ణమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఈవో వెంకటేశ్వర్లచే వేద పండితులు దేవతాస్థాపన, కలశస్థాపన పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసం ముగిసి ఏకాదశి శుభముహూర్తాలు ఉండడంతో గురుపౌర్ణమి ఉత్సవాలు తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గోదావరి నది సైతం జలకళను సంతరించుకోవడంతో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి తమ చిన్నారులకు అక్షర స్వీకార పూజలు నిర్వహించారు. అనంతరం వేదవ్యాస ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంగళవారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని వేదవ్యాస ఆలయంలో రుద్రాభిషేకం, వేద స్వస్తి, ఉపనిషత్తుల పఠనం, తదితర పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని విశిష్ట పండితుల సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని అధికారులు పిలుపునిచ్చారు.