తెలంగాణ

మల్లన్నసాగర్‌కు పల్లెపహాడ్ ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 27: మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన మెదక్ జిల్లా పల్లెపహాడ్ రైతులు మంత్రి హరీష్‌రావుతో బుధవారం గజ్వేల్‌లో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. పట్టణంలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు పల్లెపహడ్ నుండి వచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు, యువకులతో గంటకుపైగా చర్చలు జరిపారు. అయితే రూ. 6లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, తమ గ్రామాన్ని సిఎం కెసిఅర్ దత్తత తీసుకొని పూర్తి సహకారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా వారి డిమాండ్‌లకు మంత్రి హరీశ్‌రావు ఒప్పుకోవడంతోపాటు వీలైనంత మేర అధిక పరిహారం, ప్రభుత్వ సహాయం అందించేందుకు అభ్యంతరంలేదని వారితో స్పష్టం చేశారు. అయితే మల్లన్నసాగర్ కింద ఉన్న 6 గ్రామాల రైతులు ఇప్పటికే తమ భూములు అప్పగించేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మిగతా గ్రామాల రైతులతో చర్చలు జరిపి ఒప్పిస్తామని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ముఖ్యంగా సిఎం కెసిఆర్‌పై నమ్మకంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్లెపహడ్ రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని, వారికి తలవంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామమైన పల్లెపహాడ్ రైతులు సంసిద్ధత వ్యక్తం చేయడం ప్రశంసనీయమని, వీలైనంత త్వరలో మిగితా గ్రామాల రైతుల అంగీకారంతో ప్రాజెక్ట్ పనుల ప్రారంభ దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జెసి వెంకట్‌రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, నేతలు మడుపు బూంరెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పొంగిన మూసీ
నల్లగొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జూలై 27: నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడం ఖరీఫ్ రైతాంగానికి ఊరటనిస్తోంది. బుధవారం జిల్లావ్యాప్తంగా 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పోచంపల్లిలో 69.2 మి.మీ రామన్నపేటలో 65.6, నార్కట్‌పల్లిలో 65.8, మునుగోడులో 58.4, చండూర్‌లో 55, వలిగొండలో 54.2, నల్లగొండలో 45 మి.మీ వర్షపాతం నమోదైంది. జంటనగరాల్లో కురిసిన వర్షాలు, వరదలతో మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది. భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల్లో మక్తానంతారం, భీమలింగం, అసఫ్‌నహర్, ధర్మారెడ్డిపల్లి కత్వ మీదుగా మూసీ నది పొంగి ప్రవహించింది. నది వరద ఉధృతితో కాలువలు, చెరువులు నిండిపోగా భూదాన్‌పోచంపల్లి మండలం రేవన్‌పల్లి చెరువు అలుగురాళ్లు కొట్టుకుపోయి వరద దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తింది. 50 ఎకరాల మేరకు వరి పంటలు నీటి మునిగాయి. చెరువులో పెంచిన 15 లక్షల విలువైన చేపలు వరదలో కొట్టుకుపోగా పంట పరిసర గ్రామాల ప్రజలు వాటిని పట్టుకునేందుకు పోటీలు పడ్డారు. రామన్నపేట మండలంలో మూసీ ధర్మారెడ్డి పల్లి కాలువకు గండి పడింది.
అవినీతి అధికారికి
రెండేళ్ళ జైలుశిక్ష
కరీంనగర్ ఎసిబి కోర్టు తొలి తీర్పు
కరీంనగర్ లీగల్, జూలై 27: నేత కార్మికుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌శాఖ ఇంజనీర్‌కు రెండేళ్ళ జైలుశిక్షతో పాటు పదివేల జరిమాన విధిస్తూ అవినీతి నిరోధకశాఖ స్పెషల్‌కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. గంగాధర మండలానికి చెందిన నేత కార్మికుడు అండెం శంకరయ్య జీవనభృతి కోసం పంచాయతీ అనుమతితో పవర్‌లూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి 5హెచ్‌పి మోటార్ బిగించేందుకు విద్యుత్ కనెక్షన్ కోసం నగరంలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. శంకరయ్య డిడిలను సంబంధిత కార్యాలయానికి తీసుకెళ్ళగా అసిస్టెంట్ ఇంజనీర్ బండారి అజయ్‌కుమార్ రూ.15వేలు లంచమిస్తేనే విద్యుత్ మీటర్ అమర్చుతానని డిమాండ్ చేశాడు. చివరకు ఆరువేలు ఇవ్వాలంటూ చెప్పటంతో బాధితుడు శంకరయ్య ఎసిబిని సంప్రదించాడు. 2008 జనవరి 18న శంకరయ్య గంగాధరలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఇంజనీర్ అజయ్‌కుమార్‌కు 6వేలు అందజేస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఈ కేసును ఎసిబి ఇన్స్‌పెక్టర్ చాంద్‌పాషా దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్‌రావు నిందితుడైన అజయ్‌కుమార్‌కు రెండేళ్ళ జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు. అవినీతి నిరోధకశాఖకు సంబంధించిన కేసులు విచారించేందుకు నగరంలో కోర్టును ఏర్పాటుచేయగా, ఈ తీర్పు మొట్టమొదటిది కావటం గమనార్హం.
విద్యుత్ లైన్‌మెన్ సర్వీసు క్రమబద్ధీకరణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 27: తెలంగాణ విద్యుత్ సంస్ధల్లో పనిచేస్తున్న 1175 మంది కాంట్రాక్టు లైన్‌మెన్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం ఒక లెటర్‌ను జారీ చేయడంపై స్టే ఇవ్వాలన్న అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన టి సైదులు మరో 13 మంది రాష్ట్రప్రభుత్వం లైన్‌మెన్ల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయమై లెటర్ ఇవ్వడంపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు డిస్మిస్ చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఎదుట పెండింగ్‌లో ఉన్న కేసులపై వెలువడే తీర్పులకు లోబడి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖ అమలు ఆధారపడి ఉంటుందన్నారు.

3జి కాయిన్ స్కాం సూత్రధారి అరెస్టు
కోర్టులో హాజరుపరిచిన
సైబరాబాద్ పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 27: పెట్టుబడి పెట్టండి, రెండేళ్లలో మీ సొమ్ము 180 రెట్లవుతుందని ఆకర్షణీయమైన ఆఫర్‌కు భ్రమపడి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ. 18 లక్షలను పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. చివరకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఢిల్లీకి చెందిన 3జికాయిన్.ఇయు పేరిట వెబ్‌సైట్‌ను తెరిచి సొమ్మును రాబట్టుకుంటున్న బిఎం జగదీషా అనే వ్యక్తిని బెంగళూరులో అరెస్టు చేశారు. క్రిప్టోగ్రఫీ, కిలోబైట్స్‌కు బార్‌కోడ్స్, మెగాబైట్స్, గిగా బైట్స్ ద్వారా సమాచారాన్ని నిక్షిప్తం చేయడం, పంపిణీ చేయడాన్ని క్రిప్టోగ్రఫీ అంటారు. ఈ ఐటి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే రెండేళ్లలో 180రెట్లు పెరుగుతుందని నిందితుడు జగదీషా ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్లకు ఆశచూపేవాడు. జగదీషా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా ఘారానా మోసాలకు పాల్పడి 2.89 కోట్ల రూపాయలను సంపాదించాడు. ఒన్ కాయిన్, వావ్ కాయిన్, రిచ్‌కాయిన్, లిట్ కాయిన్ ఇంకా అనేక పేర్లతో వెబ్‌సైట్లను తెరిచి ఆన్‌లైన్ ద్వారా నిందితులు మోసానికి పాల్పడుతున్నట్లు సిఐ రియాజుద్దీన్ తెలిపారు. నిందితుడు జగదీషాను ఇక్కడ మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రియాజుద్దీన్ తెలిపారు.

వెనక్కి తగ్గం
మల్లన్నసాగర్‌పై టి.కాంగ్రెస్ నిర్ణయం
రక్షణ కోసం నేడు డిజిపికి వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జులై 27: మల్లన్న సాగర్‌కు వెళ్ళకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అడ్డుకున్నందున, అంతటితో చేతులు ముడుచుకుని కూర్చోకుండా మళ్లీ ప్రయత్నించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం (28న) రాష్ట్ర డిజిపిని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కలిసి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరనున్నది. టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అధ్వర్యంలో పార్టీ నాయకులు రాష్ట్ర డిజిపిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు, ఇండ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించేందుకే తాము వెళ్ళాలనుకుంటున్నాం తప్ప అక్కడికి వెళ్ళి ఆందోళనలు చేయడానికో, రైతులను రెచ్చగొట్టేందుకు కాదని వారు డిజిపికి వివరించాలనుకుంటున్నారు. అందుకు డిజిపి సమ్మతించి పోలీసు ఎస్కార్టును ఇస్తే రైతులను పరామర్శించి వెనక్కి రావాలని భావిస్తున్నారు. ఒకవేళ డిజిపి అందుకు సమ్మతించకపోతే మళ్లీ అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో చలో మల్లన్నసాగర్ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నారు. ఈ దఫా అందరూ గాంధీ భవన్‌కు చేరుకోకుండా నేరుగా మల్లన్న సాగర్ బాట పట్టాలని అనుకుంటున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బయలుదేరి పోలీసులకు చిక్కకుండా మల్లన్న సాగర్‌కు చేరుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించే అవకాశం ఉంది కాబట్టి వేర్వేరు బృందాలుగా ఏర్పడి, వేర్వేరు రూట్లలో మల్లన్న సాగర్ బాట పట్టాలని వారు భావిస్తున్నారు. ఏదైనా గురువారం రాష్ట్ర డిజిపి స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్న సాగర్ వెళ్ళాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

అది నిషేధిత
ప్రాంతమా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భట్టి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 27: మల్లన్న సాగర్ నిషేధిత ప్రాంతమా? అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు, ఇండ్లు కోల్పోతాయని ఆందోళన చెందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్ళాలనుకున్న తమను పోలీసులతో అడ్డగించి, అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ నిషేధిత పార్టీనా? అని ఆయన ప్రశ్నించారు. చట్టంపై అవగాహన లేని వారు మంత్రులయ్యారని ఆయన విమర్శించారు. చట్టం అమలు చేయాలని అడిగితే జైల్లో పెడతామని మంత్రులు హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని మరిచిపోరాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప ప్రజలు కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి అన్నారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రసుగా మారిన నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రీ-డిజైన్ల పేరిట ఎత్తు పెంచడం, జనాన్ని ముంచడం, డబ్బులు దోచుకోవడమేనని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ నేతలను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

పతనం దిశగా
పత్తి ధరలు
జమ్మికుంట, జూలై 27: వారం రోజుల క్రితం పైకి ఎగబాకిన పత్తి ధరలు ప్రస్తుతం పతనం దిశగా సాగుతున్నాయి. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో విడిపత్తికి గరిష్ట ధర క్వింటాల్ ఒక్కంటికి రూ.6,280, కనిష్ట ధర 5,900, మోడల్ ధర 6,200 లుగా ఖరారైంది. బస్తాల్లో తెచ్చిన పత్తికి గరిష్ట ధర రూ.5,800, కనిష్ట ధర 3,800, మోడల్ ధర 5వేలుగా నమోదైంది. గడిచిన వారం రోజుల్లో పత్తి ధరలు క్షీణించి పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6280కి పడి పోయింది. ఈనెల 19న 6,650గా పలికిన పత్తి ధర 20వ తేదిన 6,500, 25న 6,250, 26, 27వ తేదీల్లో 6,280గా పలికింది. వారం రోజుల వ్యవధిలో విడి పత్తి ధర అమాంతంగా రూ.370 రూపాయల మేర పడిపోయింది. కొద్ది రోజులు మురిపించిన పత్తి ధరలు నేల చూపులు చూస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజలు, క్యాండీ ధరలు పడిపోవడంతో దాని ప్రభావం పత్తి కొనుగోళ్లపై చూపుతుందని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పేలిన మందుపాతర..
గాయపడిన జవాను
భద్రాచలం, జూలై 27: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బుధవారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి సిఆర్‌పిఎఫ్ జవాన్ రెండు కాళ్లు తెగిపోయిన దుర్ఘటన చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లా అరణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపారా అటవీప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతర వీరి సమీపంలో పేలడంతో ఆ ధాటికి సీఆర్‌పీఎఫ్ జవాన్ ఉమాశంకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతని రెండు కాళ్లు తునాతునకలయ్యాయి. వెంటనే అతన్ని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు ప్రత్యేక వైద్యం కోసం తీసుకెళ్లారు.