రాష్ట్రీయం

లీకేజీపై సిఐడి కూపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్/ కరీంనగర్ /వరంగల్, జూలై 28: ఎమ్సెట్ లీకేజీ బాగోతం ఉత్తర తెలంగాణను కుదిపేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సిఐడి బృందాలు గురువారం జరిపిన తనిఖీలు ప్రకంపనలు సృష్టించాయి. లీకేజీని అడ్డుపెట్టుకుని ర్యాంకులు పొందిన విద్యార్థుల వివరాలను బట్టబయలు చేసేందుకు సిఐడి బృందాలు అన్ని కోణాల్లోనూ ముమ్మర దర్యాప్తు జరుపుతున్నాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా, కష్టపడి చదివి ర్యాంకులు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అదే స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఎమ్సెట్‌ను రద్దుచేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? కారకులైన వారినే శిక్షిస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో విద్యార్థి లోకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అక్రమంగా ర్యాంకులు పొందిన వారినే శిక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. కష్టపడి చదివి ర్యాంకులు సాధించామని, కొందరివల్ల అందరికీ నష్టం కలిగే నిర్ణయం తీసుకోవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
భారీగా ముడుపులు చెల్లించి ఎమ్సెట్ ర్యాంకులు పొందిన వారి కూపీ లాగేందుకు సిఐడి బృందాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. హైదరాబాద్‌కు చెందిన సిఐడి పోలీసు అధికారి నరేష్ కుమార్ అధ్వర్యంలో పోలీసు బృందాలు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గుడిహత్నూర్ కేంద్రాల్లో తనిఖీలు జరిపాయి. ఎంసెట్2 ప్రశ్నపత్రంతో పాటు ఎంసెట్ 1 పేపర్‌కూడా లీకేజి అయినట్లు నిగ్గుతేలడంతో పోలీసులు లోతైన దర్యాప్తు గావిస్తూ ర్యాం కులు సాధించిన అభ్యర్థుల వివరాలను రాబట్టడమే గాక వారి కుటుంబాల ఆదాయం, ఆర్థిక స్థోమత, హైదరాబాద్‌లో ప్రముఖులతో ఉన్న సంబంధాలపై పోలీసులు కూపీలాగారు. అయితే కాగజ్‌నగర్‌లో ఎంసెట్ సీటు సాధించిన వ్యాపారవేత్త కుమారునికి ఎంసెట్2లో తక్కువ ర్యాంకు రాగా ఎంసెట్1 పరీక్ష ర్యాంకుకు భారీగా తేడా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా నిహార్ తండ్రికి ఫోన్‌చేసి ఇంటికి వస్తున్నామని చెప్పడంతో రమ్మని చెప్పిన కుటుంబ సభ్యులు తీరా సిఐడి పోలీసులు వచ్చేసరికి ఆ ఇంటికి అప్పటికే తాళం వేసి ఉండడంతో అనుమానించిన పోలీసులు వారి కుటుంబ స్థితిగతులు, ఆదాయం, వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు జరిపి వెనుదిరిగారు. ఇదిలా ఉంటే ఆసిఫాబాద్‌లో తాటికొండ శివాణి అనే విద్యార్థినికి 307 ర్యాంకు రాగా పోలీసులు వారి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించారు. అయితే కష్టపడి చదవడం వల్లే ర్యాంకు వచ్చిందని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని ఆ కుటుంబ సభ్యులు తెలుపడంతో పోలీసులు అక్కడ వివరాలు సేకరించిన అనంతరం మంచిర్యాలలోని రెండు కళాశాలలను తనిఖీ చేసి ర్యాంకు వచ్చిన అభ్యర్థుల వివరాలు సేకరించారు. నిర్మల్‌లో ఏఎన్ రెడ్డి, ఆదర్శ జూనియర్ కళాశాలలను సందర్శిస్తున్నట్లు పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వగా సాయంత్రం వరకు ఆ కళాశాలకు పోలీసులు రాలేదని తెలిసింది. అయితే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 42వ ర్యాంకు సాధించిన లక్ష్మణచాంద మండలం మునిపల్లికి చెందిన ఎన్.అఖిలేశ్వర్ రెడ్డికి ఎంసెట్2లో 47వ ర్యాంకు రావడంతో సిఐడి పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు ముమ్మరం చేశారు. 10వ తరగతి వరకు నిర్మల్‌లో చదివి ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కళాశాల నుండి ఎంసెట్‌లో 47వ ర్యాంకు సాధించడం వెనక లీకేజి సూత్రధారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. ఎంసెట్ లీకేజి వ్యవహారం ఆదిలాబాద్ జిల్లాలో అలజడి రేపుతుండగా రెండు రోజుల్లోనే ఈ కోణంలో ప్రమేయం ఉన్న వారి వివరాలు బయటపడే అవకాశం ఉంది.
వరంగల్‌లో గోప్యంగా విచారణ
వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లిలో కొందరు విద్యార్థులకు ఎంసెట్-2 లీక్‌తో సంబంధం ఉన్నట్లు సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక సిఐడి పోలీస్ టీం వరంగల్ చేరుకొని అనుమానం ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సిఐడి ఐజి సౌమ్యమిశ్రా ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎంసెట్-2లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల బయోడేటా, వారు గతంలో చదివిన పాఠశాల, కళాశాల వివరాలను సేకరిస్తున్నారు. ఎంసెట్-1 లో వచ్చిన ర్యాంకులు, ఎంసెట్-2లో వచ్చిన ర్యాంకులను పరిగణనలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరు విద్యార్థులను గుర్తించినట్లు సమాచారం. ఎంసెట్-2 పేపర్ ఎలా వచ్చింది దానికి సూత్రధారులు ఎవరనే కోణంలో సిఐడి పోలీసులు లోతుగా కూపీ లాగుతున్నారు. అయితే కొందరు విద్యార్థులు మాత్రం తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎంసెట్ రాశామని, కొందరు చేసిన తప్పుకు అందరిని బలి చేయవద్దంటూ పరకాల, భూపాలపల్లి ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎంసెట్-2పై హైదరాబాద్ సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్న మాట నిజమేనని వరంగల్ సిఐడి డిఎస్పీ రవికుమార్ తెలిపారు.
కరీంనగర్‌లో ఆ ఆరుగురు ఎవరు?
ఎమ్సెట్ -2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులకు సంబంధమున్నట్లు ప్రచారం జరుగుతుండటంపై జిల్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో ఆ ఆరుగురు విద్యార్థులు ఎవరనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేసి, దీనికి కారకులైన వారిని గుర్తించడంతోపాటు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. 50 నుంచి 80మంది విద్యార్థులకు ఈ వ్యవహారంలో సంబంధమున్నట్లు తెలుస్తుండగా, ఇందులో జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక సిఐడి అధికారులు గురువారం జిల్లాలో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, జగిత్యాలలో విచారణ జరిపినట్లు సమాచారం. 50 నుంచి 150 ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రశ్నించినట్లు, వారి సర్ట్ఫికెట్లు, గతంలో వారి పర్సంటేజీ తదితర వివరాలను సేకరించినట్లు సమాచారం. అయితే, దీనిని స్థానిక సిఐడి, పోలీసు అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. లీకేజీ వ్యవహారం కరీంనగర్‌కు తాకిన తరుణంలో ఎమ్సెట్-2లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన, అయోమయానికి గురవుతున్నారు.