ఆంధ్రప్రదేశ్‌

ఎందుకీ నాటకాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా రాష్ట్రానికి మీరు చేసిందేమిటి?
మీ మాటలకు చేతలకు పొంతనేదీ?
విపక్షాలన్నీ ఏకమై కోరినా హోదా ఇవ్వరా?
కేంద్రంపై మండిపడిన చంద్రబాబు
కాంగ్రెస్ వాకౌట్ ఓ డ్రామా
మాకు న్యాయం చేస్తామంటే ఏ కమిటీకైనా ఓకే
న్యాయం జరుగుతుందంటేనే ఇక ఢిల్లీకి
కుండబద్దలు కొట్టిన సిఎం

విజయవాడ, జూలై 29:కేంద్ర వైఖరిపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కేంద్రం, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరును ఆయన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని దేశంలోని 11 రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినా, కేంద్రం చేతులెత్తేయడం దారుణమన్నారు. శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం జరిగిన చర్చ తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలన్నీ కలిసి మరోసారి ఏపికి అన్యాయం చేసేందుకు నాటకాలాడుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. విభజన జరిగిన విధానాన్ని తాను ఎప్పటి నుంచో తప్పుపడుతున్నానన్నారు. విభజనను నిరసిస్తూ ఎనిమిది రోజులు నిరవధిక నిరాహారదీక్ష చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. విభజనను రాజకీయ కోణంలో చేపట్టినట్టు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేషే అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను అవమాన పరచడానికి, కుట్ర కుతంత్రాలతో విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనను చూసిన ఏపి ప్రజలు దేశంలో తాము ఎందుకు ఉండాలన్న నిరాశకు గురయ్యారని చెప్పారు. కోపాన్ని, కక్షను కష్టార్జితంగా మార్చుకుని పనిచేస్తున్నామన్నారు. ఏపికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో యుపిఎ ప్రభుత్వం చెప్పినప్పుడు, దాన్ని పదేళ్లకు పెంచాలని ప్రతిపక్ష బిజెపి కోరిందని చంద్రబాబు గుర్తు చేశారు. దానే్న ఇప్పుడు తాను అడుగుతున్నానన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌కు, హోదాకు కేంద్రం ఎందుకు లింకు పెడుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టి, రెండు రోజులు హంగామా చేసిందని అన్నారు. శుక్రవారం ప్రత్యేక చర్చ ప్రారంభించి, మధ్యలోనే ఎందుకు వాకౌట్ చేసిందని బాబు నిలదీశారు. విభజన సమయంలో చట్టంలో పొందుపరిచిన మిగిలిన విషయాల గురించి కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని బాబు ప్రశ్నించారు. సక్సెస్‌ఫుల్‌గా డ్రామాలాడుతున్నామని రాజకీయ పార్టీలు అనుకోవచ్చు. తన వంతు ప్రయత్నం తాను కూడా చేస్తానని చంద్రబాబు అన్నారు.
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుందన్న ఉద్దేశంతో తాను కేంద్రపట్ల వౌనంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. ‘మాది సంకీర్ణ ప్రభుత్వం కాకపోయినా, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే కేంద్రం మాట్లాడిన మాటలన్నీ బయటకు చెప్పలేదు. రాష్ట్రంలో నాకు మెజార్టీ ఉంది. నేను ఎవ్వరిపైనా ఆధారపడలేద’ని చంద్రబాబు ఒకింత ఆగ్రహంతో అన్నారు. రాజ్యాంగం ప్రకారం సిక్స్ పాయింట్ ఫార్ములా ఉంది. దాని ప్రకారం ఏపికి న్యాయం చేయమంటే, అటార్నీ జనరల్ కాదన్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అదే అటార్నీ జనరల్ చెపుతున్నారు. ఎందుకు ఈ నాటకాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపికి హోదా ఇవ్వడానికి సాంకేతిక సమస్యలేవీ అడ్డు రావని చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని సీతారాం ఏచూరి చేసిన ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. అది ఏ కమిటీ అయినా, తనకు అభ్యంతరం లేదని, ఏపికి మాత్రం న్యాయం జరగాలని ఆయన కోరారు.
‘రాష్ట్రానికి జాతీయ కళాశాలలు కేటాయించారు. కానీ నిధులు ఇవ్వలేదు. అవి ఎలా అభివృద్ధి చెందుతాయి. పోలవరానికి కేంద్రం ఏం చేసింది? అది ఆదరబాదరగా పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదని కేంద్రమే చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు ఎందుకూ పనికిరానివి. వాటిని ఒక్క పారిశ్రామికవేత్త కూడా వినియోగించుకోవడం లేద’ని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్రం ఇచ్చిన డబ్బులపై రకరకాల విచారణలు జరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తాను ప్రభుత్వ పథకాలను పునర్వ్యవస్థీకరించాననీ, అందుకే నిధులు ఇవ్వలేమని కేంద్రం చెప్పడం బాధాకరమనీ చంద్రబాబు అన్నారు. జాతీయ రహదారులను పిపిపి విధానంలో ఇచ్చారు. ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు కదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తమకు కేంద్రం ఎప్పుడైనా న్యాయం చేస్తుందని, రెండేళ్లపాటు ఓపిగ్గా ఉన్నాను. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అయినా, కేంద్రం ఏపికి అన్యాయమే చేసిందని చంద్రబాబు అన్నారు. దీనివలన పార్లమెంట్‌పైనా, రాజ్యాంగంపైనా ప్రజలు విశ్వాసం కోల్పోరా? అని ఆయన ప్రశ్నించారు. ‘అప్పట్లో నన్ను దెబ్బతీయాలని అన్ని రాజకీయ పార్టీలూ కుట్ర పన్నాయి. కానీ ప్రజా బలంతో అధికారంలోకి వచ్చాను. ఇప్పుడు కూడా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేర’ని చెప్పారు. స్నేహ హస్తాన్ని అందిస్తున్న ఏపి ప్రజల గురించి బిజెపి ఎందుకు ఆలోచించడం లేదని అన్నారు.
దేశంలోని టిఆర్‌ఎస్ సహా 11 రాజకీయ పార్టీలు హోదా ఇవ్వాలని కోరినా, కేంద్రం ఎందుకు దానిపట్ల మొగ్గు చూపడం లేదని బాబు ప్రశ్నించారు. హోదాకు సంబంధించి ఇంతకన్నా మద్దతు కూడగట్టలేమని అన్నారు. ఇంటింటికి వెళ్లి రాజకీయ పార్టీలను బతిమాలుకున్నా, ఇంతకన్నా న్యాయం జరిగేట్టు కనిపించడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ప్రజలు ఎవ్వరినీ క్షమించరని ఆయన అన్నారు. ‘ఇంత జరిగినా, న్యాయం చేయాలంటూ కేంద్రాన్ని మళ్లీ కోరతాను. లేఖ రాస్తాను. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు కలిగితే ఢిల్లీ వెళ్లి పెద్దల్ని కలుస్తాన’ని స్పష్టం చేశారు.