ఆంధ్రప్రదేశ్‌

బిజెపిపై బాబు ద్విముఖ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29:ప్రత్యేక హోదా అంశంలో ఏపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బిజెపిపై ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తుతున్నారు. రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలకు హోదాతో బ్రేకులు వేసి ఆ పార్టీని బలహీనపరచడం, తాము మిత్రపక్షమైనా కేంద్రంతో పోరాడుతున్నామన్న సంకేతాలివ్వడం ద్వారా పూర్తి రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరించాలని టిడిపి నిర్ణయించుకుంది. అందుకే తరచూ మీడియా ముందుకొచ్చే పార్టీ అధికార ప్రతినిధులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు హోదా అంశంలో బిజెపిపై విమర్శలు చేసేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా జరిగిన సమావేశంతోపాటు కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా హోదాపై చర్చ జరిగింది. కేంద్రాన్ని మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, మన సహనానికీ హద్దు ఉందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. హోదాపై మనకు పోరాడే హక్కు ఉన్నప్పుడు మొహమాటం అవసరం లేదని, స్నేహం వేరు రాజకీయాలు వేరని స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కూడా బిజెపిపై తన అసంతృప్తిని ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాతనే తెదేపా ఎంపిలు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు బిజెపిపై స్వరం పెరగడం గమనార్హం.
నిజానికి హోదాపై బిజెపి వైఖరిని జీర్ణించుకోలేని బాబు కొంతకాలం వ్యూహాత్మక వౌనం వహించారు. ఆ తర్వాత ఆ అంశంపై పోరాడే వ్యక్తులు, సంస్థలకు పరోక్ష మద్దతునిచ్చారు. కెవిపి ప్రైవేట్ మెంబర్ బిల్లుపై బాబు అనేకసార్లు సీనియర్లతో భేటీ అయ్యారు. కొందరు వ్యతిరేకించినా కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో ఆ పార్టీ కోలుకోవటం కష్టమని, మనం బిజెపితో నేరుగా యుద్ధం చేయలేని పరిస్థితి ఉన్నందున, రాజకీయంగా ప్రజలకు సానుకూల సంకేతాలు పంపాలంటే కెవిపి బిల్లుకు మద్దతు ప్రకటించడమే సరైన వ్యూహమని బాబు సీనియర్లకు నచ్చచెప్పారు.
బిజెపిలో కూడా బాబు వైఖరిపై అసంతృప్తి కనిపిస్తోంది. మేధావుల ఫోరంతోపాటు, కెవిపి ప్రైవేటు బిల్లు వెనుక బాబు ఉన్నారని, ఆయనే తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని బిజెపి నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తొలుత కెవిపి ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చిన సమయంలో బిజెపికి చెందిన ఓ ప్రముఖుడు ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మీడియాను సింగపూర్‌కు తీసుకువెళ్లిన బృందంలో ప్రస్తుతం హోదాపై పోరాడుతున్న నేతను కూడా చేర్చారని, ఢిల్లీలో ఆ బృందం తరచూ చేసే హడావిడి వెనుక, రాష్ట్రంలో చేస్తున్న ఆందోళన వెనక బాబు ఉన్నారంటూ ఆ బిజెపి ప్రముఖుడు తమ నాయకత్వానికి లేఖ కూడా రాశారు. కెవిపి బిల్లు వెనుక ఉన్న వ్యక్తులపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
హోదా సెంటిమెంటుగా మారితే పార్టీ నష్టపోతుందని గ్రహించిన బాబు, ఆ సెగ పార్టీకి తగలకుండా సురక్షితంగా బయటపడేందుకు బిజెపిని ముద్దాయిగా నిలబెట్టే వ్యూహానికి తెరలేపినట్లు పార్టీ ఎంపిల వ్యవహారశైలి, విమర్శల ధోరణి స్పష్టం చేస్తోంది.
శుక్రవారం ఎంపిలంతా బిజెపికి వ్యతిరేకంగానే మాట్లాడటం బాబు వ్యూహాత్మక నిర్ణయాలను స్పష్టం చేస్తోంది. చంద్రబాబు నేరుగా బిజెపిని విమర్శించకుండా ప్రభుత్వాధినేతగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానన్నారు. మరోవైపు తన పార్టీ నేతలతో బిజెపిపై రాజకీయంగా విమర్శలు చేయిస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా హోదా సహా అన్ని అంశాలపై చర్చించామని మీడియాకు చెబుతున్నారు. ఇవన్నీ కూడా హోదాపై తెదాపా తప్పిదం లేదన్న సంకేతాలే ఇస్తున్నాయి.
హోదా అంశం భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరిగినా టిడిపి నష్టపోకుండా రక్షణాత్మక రాజకీయ వ్యూహం అమలుచేస్తున్న చంద్రబాబు ప్రస్తుతానికి సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్లు కనిపిస్తోంది.