రాష్ట్రీయం

బుక్ ఫెయిర్‌తో పెరుగుతున్న పఠనాసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడంతోపాటు ప్రచురణకర్తలకు ఊపిరిపోస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ కృషి శ్లాఘనీయమైనదని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ఆదివారం హెదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలోని రచయిత సుద్దాల హన్మంతు వేదికపై ‘ఎడిటర్స్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దినపత్రికలకు చెందిన సంపాదకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమయ్యే పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మాత్రమే అమ్ముడవుతున్న సమయంలో అన్నిరకాల పుస్తకాలను విక్రయించుకునే వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ఫెయిర్‌ల వల్ల ఎంతోమంది రచయితలకు, పబ్లిషర్స్‌కు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ విక్రయాలు అధికమైన వేళ పుస్తకాలను చదివే అతికొద్దిమంది ఆన్‌లైన్‌లో చాలాసేపువెతికి వాటిని తెప్పించుకుంటున్నారని తెలిపారు. కాగా అపురూపమైన పుస్తకాలు ఎంత వెతికినా ఆన్‌లైన్‌లో కనిపించవని, అలాంటి పుస్తకాలు కేవలం ప్రదర్శనలలోనే లభిస్తాయన్నారు. పుస్తక పఠనంపై అమితమైన ఆసక్తి కలిగిన తాను స్వయంగా ప్రదర్శనలో అద్భుతమైన పుస్తకాలను వెతికి కొనుగోలు చేసుకొంటానని పేర్కొన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహణ గతంలో కంటే ఎంతో అద్భుతంగా ఉందని, జర్నలిస్ట్ గౌరీశంకర్ కృషివల్లే ఇది సాధ్యమైందని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతుండటంతో పుస్తకం బతకదని భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. రోజురోజుకు పుస్తకాలకు ఆదరణ పెరుగుతూనే ఉందని, ఇతర భాషల్లో పాఠకుల మన్ననలు పొందిన అద్భుత పుస్తకాలను మాతృభాషలో అనువదిస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులు, కవులు, రచయితలు బుక్‌ఫెయిర్లకు రావడం సాధారణమైన విషయమని, ప్రజలను పాలిస్తున్న వారు, అధికారులు ఇలాంటి బుక్ ఫెయిర్లకు వచ్చి మంచి పుస్తకాలను ఎంపిక చేసుకొని చదివితే మరింత పరిపాలనా సామర్ధ్యాన్ని పొందవచ్చునని అన్నారు. కేవలం వ్యాపార ధోరణితోనే కాకుండా మంచిపుస్తకాలను ప్రజలకు అందించాలనే తపనతో ఎంతో మంది పబ్లిషర్స్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయాన్ని మరవొద్దని అన్నారు.
పుస్తకాలు ఎన్ని చదివితే అంత జ్ఞానం పెరుగుతుందని, ఎంత సంపాదించినా జ్ఞానాభివృద్ధి లేకపోతే వృథానే అని ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ అన్నారు. జ్ఞాన పటంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావాలంటే పుస్తక పఠనంతో ఆసక్తిని పెంచాలని సూచించారు. జనంలో చైతన్యం రగిల్చేది పుస్తకమని, చైతన్యాన్ని రగిల్చే పుస్తకాలను రానివ్వకుండా ప్రయత్నిస్తున్నారని నవతెలంగాణ సంపాదకులు వీరయ్య అన్నారు. ప్రజల్లో చైతన్య జ్వాలలు నింపే పుస్తకాలు మరిన్ని రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంపాదకులను బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మెమొంటోలతో సత్కరించారు.

చిత్రం... హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఆదివారం జరిగిన ఎడిటర్స్ మీట్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తి. చిత్రంలో సీనియర్ జర్నలిస్టులు కె. రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, బుక్‌ఫెయర్ అధ్యక్షుడు గౌరీశంకర్