తెలంగాణ

బాలానగర్ బ్యాంకు దోపిడీలో ‘ఉగ్ర’హస్తం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ ఎపిజివిబి బ్యాంకు దోపిడీ కేసులో ఉగ్రవాదుల హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీస్ ఉన్నత స్థాయి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పలు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో గతంలో బ్యాంకు దోపిడీలు, ఎటిఎంలలో చోరీలకు పాల్పడిన వారిలో సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాలానగర్ మండల కేంద్రంలోని ఎపిజివిబి బ్యాంకులో కూడా సిమి ఉగ్రవాదులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2014 ఆగస్టు 11వ తేదిన ఎపిజివిబి బ్యాంకులో గ్యాస్ కట్టర్లతో తలుపులను తొలగించి బ్యాంకు లోపల ఉన్న లాకర్లను కూడా తొలగించారు. దోపిడీ దొంగల ముఠా 13 కిలోల బంగారం, 15 లక్షల రూపాయలను దోచుకువెళ్లారు. మొత్తం విలువ నాలుగు కోట్ల పైనే ఉంటుందని బ్యాంకు అధికారులు అప్పట్లో వెల్లడించారు. అయితే జాతీయ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ఈ బ్యాంకులో దోపిడీ దొంగల ముఠా చాకచక్యంగా భారీ దొంగతనానికి పాల్పడ్డారు. ముఠా సభ్యులు పక్కా ప్రణాళికలను రూపొందించి గ్యాస్ కట్టర్ల సహాయంతో దోపిడీ చేశారు. నాలుగు కోట్ల విలువైన బంగారం, నగదును దోచుకువెళ్లడంతోపాటు బ్యాంకులో ఉన్న సిసి కెమెరాలకు సంబంధించి హార్క్‌డిస్క్‌లను దోచుకెళ్లారు. అప్పటి డిఐజి శశిధర్‌రెడ్డి, ఎస్పీ నాగేంద్రకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తున్నా ఈ బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించలేదు. అయితే సిమి ఉగ్రవాదులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో దోపిడీలకు పాల్పడిన ముఠాలను విచారించడంతోపాటుగా సిమి ఉగ్రవాదులపై అనుమానాలు ఉండడంతో పోలీసులు వారికోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పోలీసులు బెంగుళూరు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు దోపిడీ ఉగ్రవాదుల ముఠా హస్తమున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాలలో పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.

380 జిలెటిన్ స్టిక్స్,
380 డిటోనేటర్ల పట్టివేత

నెల్లికుదురు, డిసెంబర్ 20: వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామంలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 380 జిలెటిన్ స్టిక్స్, 380 డిటోనేటర్లు, 50కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను తొర్రూరు సిఐ శ్రీ్ధర్‌రావు, నెల్లికుదురు ఎస్సై ఉపేందర్‌రావు శనివారం పోలీస్ సిబ్బందితో పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పేలుడు సామాగ్రితో పాటు నిందితుడు శివరాత్రి నర్సింహులు అరెస్టును చూపించారు. అనంతరం డిఎస్పీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. బావి పూడిక, బావుల్లో రాళ్లు పగలగొట్టడానికి సంబంధిత పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఉండడంతో సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు నల్గొండ జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడని, గత కొన్ని నెలలుగా గ్రామంలోని ఓ ఇంట్లో ఉంటూ బావుల పూడికకు అక్రమంగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. క్వారీలలో రాళ్లు పగులగొట్టడానికి అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు తెలిపారు. పేలుడు పదార్థాలు పట్టుకున్న సిఐ, ఎస్సైలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నలుగురు రైతుల ఆత్మహత్య

ఆదిలాబాద్/కరీంనగర్,డిసెంబర్ 20: ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన వెంకటస్వామి (40) అనే రైతు పొలంలోనే క్రిమిసంహారక మందు సేవించి ఎండ్లబండి నడుపుతూ ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన కర్రె నగేష్ (38) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా ఇదే జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి బుచ్చయ్య (60) అనే రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఇదే జిల్లా కోనరావుపేట మండలంలోని మర్రిమడ్ల గ్రామానికి చెందిన లక్కి నర్సయ్య (45) అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించి గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

ఇద్దరు పిల్లలకు ఉరేసిన కన్నతల్లి
మంగళ్‌హాట్‌లో దారుణం

హైదరాబాద్/నార్సింగ్, డిసెంబర్ 20: మద్యం ఓ గృహిణికి ఆగ్రహం తెప్పించింది. తాగొచ్చిన భర్తను చూసి తట్టుకోలేక పోయింది. క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. మంగళ్‌హాట్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రసాద్ పాండే, రోజా దంపతులు మంగళ్‌హాట్‌లో నివసిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి సువిధ (4) చింకి (2) ఇద్దరు అమ్మాయిలు. కాగా హోటల్‌లో పనిచేస్తున్న ప్రసాద్ పాండే తరచూ మద్యం సేవించి భార్యను వేధిస్తూ కొట్టేవాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు మద్యానికి బానిసైన భర్తలో మార్పు రాకపోవడంతో ఆదివారం తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త పనికి వెళ్లిన సమయంలో ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపింది. తాను కూడా ఉరి వేసుకునే ముందు భర్తకు ఫోన్ చేసింది. ఇద్దరు పిల్లలను చంపానని, తాను కూడా చచ్చిపోతున్నానడంతో వెంటనే భర్త ఇంటికి వచ్చాడు. ఉరి వేసుకోబోయిన భార్యను వద్దంటూ వారించాడు. మద్యం మత్తులో తనను రోజూ కొడుతుంటే పిల్లలను చంపానంటూ గృహిణి రోజా మంగళ్‌హాట్ పోలీసులకు లొంగిపోయింది. పోలీసులకు లొంగిపోయిన రోజాపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ రాంగోపాల్‌రావు తెలిపారు.