జాతీయ వార్తలు

గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మంచినీటి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ సానుకూలత వ్యక్తం చేశారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్, బాపట్ల ఎంపీ మల్యాద్రి శ్రీరాం, శ్రీకాకుళం ఎంపీ కింజరాపురామ్మోహన్‌నాయు,రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సీనియర్ అధికారులు మంగళవారం మంత్రిని కలిసి పథకాలపై చర్చించారు. రాష్ట్ర గ్రామీణ మంచినీటి పథకాలకు ఈ సంవత్సరం 160 కోట్ల రూపాయలు ఇస్తామని, 101 కోట్ల రూపాయలను ఇదివరకే విడుదల చేశామని బీరేంద్ర సింగ్ చెప్పారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక పథకాలు చేపడతామని కేశినేని బృందానికి హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణం పథకం కింద రాష్టల్రోని గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణం చేపడతామని బీరేంద్ర సింగ్ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ఈ పథకం కింద 218 కోట్లు ఇస్తామన్నారు.

గుంటూరు జిల్లా పంచాయతీ
అధికారిపై ఏసిబి దాడులు

గుంటూరు, డిసెంబర్ 22: జిల్లా పంచాయతీ శాఖాధికారి గోరంట్ల వీరయ్యచౌదరిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు అభియోగాలు రావడంతో ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుంటూరులోని రాజేంద్రనగర్ రెండవ లైన్‌లో నివాసం ఉంటున్న అధికారి వీరయ్యచౌదరి ఇంటిపై మంగళవారం ఉదయం దాడులు చేపట్టారు. అధికారి బంధువుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగాయి. నరసరావుపేట, చీరాల ప్రాంతాల్లో కూడా ఎసిబి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ఆపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. చీరాలలో 3 గృహాలు, రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో 1 ఎకరం పొలం, వీరన్నపాలెంలో 7 ఎకరాలు, కిలో బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాడులపై డిఎస్‌పి దేవానంద్ మాట్లాడుతూ 1.5 కోట్ల రూపాయల మార్కెట్ విలువ చేసే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, అదనపు సమాచారం రావాల్సి ఉందన్నారు.

సీతానగరం రామకృష్ణ మిషన్
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హైదరాబాద్, డిసెంబర్ 22: గుంటూరు జిల్లా సీతానగరంలో రామకృష్ణ మిషన్ హైస్కూల్ స్థాపించి 50 సంవత్సరాలు (1965-2015) నిండిన సందర్భంగా ఈ నెల 27వ తేదీన స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్టు పాఠశాల కార్యదర్శి స్వామి శశికాంతానంద ఒక క్రపకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ప్రథమ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులతో పాటు, విశ్రాంత ఉపాధ్యాయులు హాజరుకావాల్సిందిగా శశికాంతానంద పిలుపునిచ్చారు. ఇతర వివరాల కోసం 9290535995, 9299305339 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

టాస్క్ఫోర్స్ దళంపై
రాళ్ళు రువ్విన కూలీలు

తిరుపతి, డిసెంబర్ 22: చంద్రగిరి మండలం అంజాలకోన వద్ద కార్యదళ సిబ్బంది, ఎర్రకూలీల మధ్య మంగళవారం ఉదయం యుద్ధవాతావరణం నెలకొంది. కూంబింగ్ చేస్తున్న టాక్స్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్రకూలీలు రాళ్ళతో దాడులకు దిగారు. ఈక్రమంలో ప్రాణరక్షణకోసం పోలీసు సిబ్బంది రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భీతిల్లిన కూలీలు పారిపోయారు. వారిని వెంటాడిన పోలీసులు ఓ కూలిని పట్టుకోగలిగారు. అంతేకాకుండా సుమారు రూ.2కోట్లు విలువైన 77ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కూంబింగ్ చేస్తున్న సమయంలో పారిపోయిన కూలీల కోసం మంగళవారం మళ్లీ కూంబింగ్ చేస్తుండగా అంజలకోన వద్ద 80మంది కూలీలు తారసపడ్డారు. పోలీసుల రాకను గమనించిన కూలీలు వీరిపై రాళ్ళ వర్షం కురింపించారు. పోలీసులు అప్రమత్తమై గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు తలోదిక్కూ పరారయ్యారు. వెంటాడిన పోలీసులకు ఓ కూలి దొరికిపోయాడు. ఈసందదర్భంగా సుమారు రూ.2కోట్లు విలువైన 77 ఎర్రదుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీలకోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలావుండగా రవాణాకు సిద్ధంగా ఉన్న రూ.70 లక్షల విలువగల ఎర్రచందనం దుంగల్ని పోలీసులు రేణిగుంట వద్ద స్వాధీనం చేసుకున్నారు.

476 మంది ఆశా వర్కర్ల తొలగింపు

విజయవాడ, డిసెంబర్ 22: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లలో 476 మందిలో ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో గర్భిణీల, ఒక్క జననాన్ని కూడా నమోదు చేయనందుకు గాను వారినందరిని విధుల నుండి తొలగిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ మంగళవారం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 72 శాతం జననాలు జరుగుతుంటే ప్రభుత్వాసుపత్రిలో కేవలం 28 శాతం మాత్రమే జననాలు జరుగుతుండటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామాల్లో గర్భిణీలను గుర్తించడంలో ఆశా వర్కర్లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ వారందరిపై వేటు వేశారు. విధుల పట్ల అలక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై కూడా త్వరలో తగిన చర్యలు ఉండగలవంటూ కలెక్టర్ హెచ్చరించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి, జిల్లాలోని మరికొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయంటూ, వైద్యులు కేవలం వైద్యం చేయడమే కాక తగిన సమాచారాన్ని సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు, మండలాభివృద్ధి అధికారులకు అందజేయాలని ఆదేశించారు.

లూప్‌లైన్ బాధలు అన్నీఇన్నీ కావు!

కర్నూలు, డిసెంబర్ 22: పదోన్నతి పొంది నిబంధనల ప్రకారం లూప్‌లైన్‌లో పనిచేసినా ప్రాధాన్యత పోస్టులు దక్కడం లేదని రాయలసీమలోని పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లలో అసంతృప్తి రగులుతోంది. పలుకుబడి, ధనబలం ఉన్న వారికి ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమించి సమర్ధులను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీమలో గత నాలుగేళ్లుగా ఎస్సై నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన వారు సుమారు 220 మంది ఉన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పదోన్నతి పొందిన వారు తప్పనిసరిగా రెండేళ్లకు తక్కువ కాకుండా లూప్‌లైన్ పోస్టులుగా భావించే సిసిఎస్, విజిలెన్స్, స్పెషల్ బ్రాంచి, ఎసిబి, రైల్వే, ఆర్టీసీ, ట్రాన్స్‌కో వంటి సంస్థల్లో పనిచేయాల్సి ఉంటుంది. పదోన్నతి పొందిన ప్రతి అధికారికి మొదటి పోస్టింగ్ ఈ సంస్థల్లోనే ఇవ్వాల్సి ఉంటుందని, అప్పటి నుంచి రెండేళ్ల అనంతరమే వారిని లా అండ్ ఆర్డర్‌లో ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే పదోన్నతి పొందిన వారిలో 35 మంది ఇంతవరకు లూప్‌లైన్‌లో పని చేయకుండానే లా అండ్ ఆర్డర్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా కొనసాగుతుండగా మరి కొంతమంది ఆరు నుంచి ఏడాది లోపే లూప్‌లైన్ నుంచి లా అండ్ ఆర్డర్‌కు బదిలీ అవుతున్నారని పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 60 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో కొనసాగుతున్నారని ఆరోపిస్తున్నారు. రెండు నుంచి నాలుగేళ్లుగా లూప్‌లైన్‌లోనే కొనసాగుతున్న వారు సుమారు 110 మంది ఉన్నట్లు సమాచారం. రాజకీయ పలుకుబడి, ధనబలం, సిఫారసుల కారణంగా ప్రధాన పోస్టుల్లో కొనసాగుతున్న వారిలో తమ జూనియర్లు కూడా ఉండడం గమనార్హం.