రాష్ట్రీయం

‘ఎత్తు’కు పైఎత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తుపై జరుగుతున్న ఆరోపణలు సవాళ్ల స్థాయిని దాటి రాజీనామా వరకూ వెళ్లటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా తెలంగాణ అన్యాయానికి గురయిందని విపక్షాలు ధ్వజమెత్తుతుండగా, గతంలో జరిగిన ఒప్పందాలను బయటపెడితే రాజీనామా చేస్తానని కేసీఆర్ ముందుకు రావటంతో వ్యవహారం వేడెక్కింది. కేసీఆర్ విసిరిన సవాలుకు ఉత్తమ్‌కుమార్ నుంచి ఆ స్థాయి జవాబు లేకపోయినా, టిటిడిపి యువనేత రేవంత్ తెరపైకి తీసుకువచ్చిన డాక్యుమెంట్లు మాత్రం ఆసక్తికరంగా మారాయి. ఈ చర్చ చివరకు రాజకీయ ప్రచారానికి పరిమితమవుతుందా? లేక అన్ని అంశాల మాదిరిగా ఇదీ ఒక రచ్చగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది.
మహారాష్టత్రో కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు 152 కిలోమీటర్ల నుంచి 148కిలోమీటర్లకు తగ్గిపోయినా సంబరాలు చేసుకుంటున్నారంటూ విపక్షాలు మూకుమ్మడి దాడి ప్రారంభించాయి. దానితో స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్, తెలంగాణ పిసిసి చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సవాల్ విసిరి సంచలనం సృష్టించారు. గతంలో 152 మీటర్లకు ఒప్పందం జరిగినట్లు పత్రాలు చూపిస్తే రాజీనామా చేస్తానని, ఆరోపణలు మానుకోకపోతే కేసులు పెడతానని హెచ్చరించడంతో తుమ్మిడిహెట్టి అంశం సీరియస్‌గా మారింది. అయితే, కేసీఆర్ సవాలుకు ఉత్తమ్ ఆ స్థాయిలో స్పందించలేదు. చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని, ఉండాల్సిన ఎత్తు కంటే తగ్గించి ఒప్పందం చేసుకుంటే మహారాష్ట్ర వాళ్లు ఎందుకు అంగీకరించారని లాపాయింట్ తీశారు. గతంలో 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామంటే ఇదే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వద్దన్న విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు అదే వ్యక్తి మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారని కేసీఆర్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై తాము ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వందశాతం సత్యమని వాదించారు. ఇది కాంట్రాక్టర్లకు మేలు చేసే ఒప్పందమేనని, సైన్యంలో పనిచేసి వచ్చిన తనకు భయమన్నది తెలియదని ఎదురుదాడి చేశారు.
కేసీఆర్ సవాలుతో ఆయనకు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారంలో టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేరడంతో ప్రాజెక్టు ఎత్తు అంశం కొత్త మలుపు తిరిగింది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన 2012 నాటి డాక్యుమెంట్లను రేవంత్‌రెడ్డి బహిర్గతం చేసి, దీనికి జవాబు చెప్పాలని సవాల్ చేశారు. 2012లోనే ఉమ్మడి ఏపి-మహారాష్ట్ర మధ్య జరిగిన డాక్యుమెంట్లను ఆయన మీడియాకు చూపారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సాంకేతిక కమిటీ ఏర్పాటుచేశారని, వాడుకునే నీళ్లను బట్టి ఖర్చులు భరించాలని, ప్రాజెక్టు ఎత్తు అంశాన్ని కూడా ఒప్పందంలో చేర్చాలని అందులో పేర్కొన్నట్లు రేవంత్ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లతో వాదించారు. 160 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా బ్యారేజీ నిర్మించుకోవచ్చని ఒప్పందంలో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. 1975లో చేసుకున్న ఒప్పందాల కొనసాగింపుగా 2012లో కూడా రెండు ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయని, ఒప్పందాల సందర్భంగా అందులోక్రోడీకరించిన అంశాలను కాదని, వాటిని మార్చి 2016లో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని రేవంత్ తన డాక్యుమెంట్ల ఆధారంగా వెల్లడించారు. 2012 నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని బట్టబయలు చేయడం ఆసక్తికరంగా మారింది.నిజానికి ఈ మొత్తం అంశంలో అసలు సవాలు కేసీఆర్-ఉత్తమ్ మధ్య కాగా, ఇప్పుడు డాక్యుమెంట్లను బయటపెట్టడంతో అది కేసీఆర్-రేవంత్ మధ్య సవాల్‌గా మారింది. దమ్ముంటే తనపై క్రిమినల్ కేసులు పెట్టాలని సవాల్ చేయటం ద్వారా, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తులో ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో తెదేపా పైచేయి సాధించినట్టయింది. ఈ అంశంలో రేవంత్ వల్ల తెదేపా క్రెడిట్ సాధించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాగా, రేవంత్‌రెడ్డి కొత్తగా తెరమీదకు తీసుకువచ్చిన పాత డాక్యుమెంట్లు తెరాసను ఇరుకునపెట్టేవేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై చర్చకు సవాల్ విసిరిన కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డాక్యుమెంట్లు బయటపెట్టిన రేవంత్‌రెడ్డి ఇద్దరూ స్పందించిన నేపథ్యంలో.. ప్రభుత్వం-పార్టీ చర్చకు సిద్ధపడుతుందా? లేక యథావిధిగా రాజకీయపార్టీల మధ్య జరిగే ‘ఉత్తుత్తి చర్చల సవాళ్లు’గా మిగులుతుందో చూడాలి.

చిత్రాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి