రాష్ట్రీయం

భారీగా గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఆగస్టు 28: విశాఖపట్టణం నుండి హైదరాబాద్‌కు ఐషర్ వ్యాన్‌లో రహస్యంగా తరలిస్తున్న 524 కిలోల గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల్లో ఒకరు ఎస్‌ఐపై దాడిచేసి, పరారవ్వడానికి ప్రయత్నించడంతో గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... ఐషర్ వ్యానులో గంజాయి తరలిస్తున్నట్టు దేవరపల్లి ఎస్‌ఐ సిహెచ్ ఆంజనేయులుకు సమాచారం అందింది. ఈమేరకు లక్ష్మీపురం రోడ్డువద్ద ఒక హోటల్ సమీపంలో తనిఖీలు జరిపారు. గంజాయి తరలిస్తున్న వ్యానును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వ్యానులోని ప్రత్యేక అరల్లో గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. రవాణాచేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుంటుండగా యాకోబ్ అనే వ్యక్తి కర్రలతో ఎస్‌ఐ దాడిచేసి పరారయ్యే ప్రయత్నంచేశాడు. దీనితో ఎస్‌ఐ గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం యాకోబుతో సహా ఆరుగురిని అరెస్టుచేశారు. అలాగే వ్యానుకు వెనుక ఎస్కార్ట్‌గా వస్తున్న ఇన్నోవా కారును తనిఖీ చేయగా దాంట్లో ఉన్న 24 కిలోల గంజాయిని గుర్తించారు. రూ.4.17 లక్షల నగదు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి దేవరపల్లి పోలీసు స్టేషన్లో కొవ్వూరు రూరల్ సిఐ ఎం సుబ్బారావు ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. గంజాయి తరలిస్తున్న అమ్మిరెడ్డి రమణ (విశాఖ), మానోతు సునీల్ (వరంగల్), కర్రి శ్రీశైలం (హైదరాబాద్), తేజేవత్తు సురేంద్ర (వరంగల్), తేతావత్తు శంకర్ (గుంటూరు), కానోతు యాకోబ్ (వరంగల్)లపై కేసు నమోదుచేసి, కోర్టుకు తరలించనున్నట్టు తెలిపారు. దేవరపల్లి తహసీల్దార్ అక్బర్ హుస్సేన్ సమక్షంలో గంజాయి, నగదు, ఐసర్ వ్యాను, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. వివిధ పోలీసు స్టేషన్లలో యాకోబ్, శ్రీశైలం, రమణలపై అనేక కేసులు ఉన్నాయని సిఐ చెప్పారు. దేవరపల్లి ఎస్‌ఐ ఆంజనేయులు, తాళ్లపూడి ఎస్‌ఐ సతీష్ విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం.. స్వాధీనం చేసుకున్న గంజాయి మూటలు, నిందితులతో
విలేఖరుల సమావేశంలో పాల్గొన్న సిఐ సుబ్బారావు, పోలీసులు