రాష్ట్రీయం

సడలింపు ఉత్తర్వులేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 25: పంట చేతికొస్తున్నా సడలింపు ఉత్తర్వులు రాక గోదావరి జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులే తీవ్ర ఆందోళన చెందుతుంటే, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తేమశాతం 20 నుండి 22 దాటిపోతున్న పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లలేక, దళారులపై ఆధారపడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే తాము కొనుగోలుచేస్తామని, 17శాతం కన్నా అదనంగా ఉన్న తేమ, రంగు మారిన ధాన్యాన్ని కొనేందుకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు చెబుతుండటంతో రైతులు ఎంతో కొంతకు అమ్ముకుని అప్పులు తీర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అందులోనూ బ్యాంకుల నుండి రుణాలు పొందలేక, ప్రయివేటు వ్యక్తుల నుండి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు ఎంత త్వరగా ధాన్యాన్ని అముకుందామా అని కంగారుపడుతున్నారు. తేమశాతం, రంగు మారిన ధాన్యం నిబంధనల సడలింపు ఉత్తర్వులు వచ్చే వరకు తమ వద్ద అమ్మకుండా ఆపుకుందామంటే, వడ్డీ పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులు తాము పండించిన ధాన్యాన్ని రూ.750 నుండి రూ.800కు అమ్ముకుని అప్పులు తీర్చుకుంటున్నారు. ఖరీఫ్ అప్పు వడ్డీతో సహా చెల్లిస్తేనే, రబీకి అప్పు దొరుకుతుంది. దాంతో కౌలు రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని, దళారులు మరీ తక్కువకు కొనుగోలుచేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నాగానీ రాష్ట్రప్రభుత్వంలో కనీస చలనం లేకుండా పోయింది. పరిస్థితి చూస్తుంటే చిన్న సన్నకారు రైతుల వద్ద ధాన్యం పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిన తరువాతగానీ, రాష్ట్రప్రభుత్వం సడలింపు ఉత్తర్వులు విడుదలచేసేలా లేదని కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లలేక, తీసుకెళ్లినా కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది లేదా మహిళా సంఘాల సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బాగున్న ధాన్యాన్ని కూడా తీసుకెళ్లేందుకు రైతులు ఇష్టపడటం లేదు. క్వింటాలుకు రూ.1057 దక్కాల్సిన ధాన్యాన్ని దళారులకు రూ.1000కే అమ్ముకునేందుకు రైతులు సిద్ధపడుతున్నారంటే, రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్ధంచేసుకోవచ్చు. రైతు వద్ద నుండి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన ధాన్యానికి రవాణా ఖర్చులు చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని కూడా దళారులు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

వివిఐటి విద్యార్థుల ప్రతిభ
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని నంబూరులో గల వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వివిఐటి) కళాశాల విద్యార్థులు ప్రజలకు నిత్యం ఉపయోగపడే స్మార్ట్‌గ్యాస్ మెజరింగ్ డివైజ్‌ను రూపొందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి చెప్పారు. బుధవారం కళాశాలలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా మన ఇంట్లోని గ్యాస్ సిలెండర్ సమాచారం మన మొబైల్‌కు ఎప్పటికప్పుడు అందుతుందని, సిలెండర్‌లో గ్యాస్ ఎంత ఉంది, ఎన్ని రోజులు వస్తుంది, కొత్త సిలెండర్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే సమాచారం ఎటువంటి ఖర్చులేకుండా మన మొబైల్‌కు అందుతుందన్నారు. అంతేకాకుండా వంటింట్లో ప్రమాదాలను నివారించేందుకు సిలెండర్‌లో గానీ, గ్యాస్ పైపులో గానీ ఏదైనా లీకేజీ ఉంటే పసిగట్టి సమాచారం అందించే సాంకేతికత ఈ ప్రాజెక్టులో ఉందన్నారు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి కేవలం 7 వేల రూపాయలు మాత్రమే ఖర్చైందన్నారు.ప్రాజెక్టు గైడ్ ప్రొఫెసర్ డివి శేషగిరిరావు, సమన్వయకర్త ప్రొఫెసర్ సోమశేఖర్, కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వివిధ విభాగాధిపతులు అభినందించారు.

భూమి లేకున్నా
పట్టాదారు పుస్తకం
తహశీల్దార్, మరో నలుగురి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 25: సెంటు భూమి లేకున్నా.... ఏకంగా ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు ఒక రైతు పేరిట పట్టాదారు పాసు పుస్తకం జారీ చేసిన తహశీల్దార్‌ను, ఆయనతో పాటు మరో నలుగురిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివరాంపురం గ్రామానికి చెందిన పట్నం కృష్ణమూర్తి అనే వ్యక్తికి అసలు భూమి లేకున్నా ఆయన పేరిట 2012 మే నెలలో పట్టాదారు పాసు పుస్తకం జారీ అయింది. ఈ పాసు పుస్తకం ఆధారంగా 2013 ఖరీఫ్ సీజన్‌లో ఆయన పార్వతీపురం సెంట్రల్ బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నాడు. ఇటీవల ఈ పాసు పుస్తకం నకిలీదని, కృష్ణమూర్తి పేరిట భూమి లేదనే విషయం బయటపడడంతో ప్రస్తుతం కొమరాడ తహశీల్దార్‌గా ఉన్న రమణమూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణలో కృష్ణమూర్తికి భూమి లేకుండానే అప్పటి తహశీల్దార్ యు కృష్ణకాంత్ పాడి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారని, ఈ విషయంలో శివరామపురం విఆర్వో శారద సహకరించినట్టు తేలింది. ఈ మేరకు తహశీల్దార్ రమణమూర్తి పార్వతీపురం ఆర్డీఓకు నివేదిక అందజేసారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తహశీల్దార్ రమణమూర్తి కొమరాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గతంలో కొమరాడలో తహశీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం గుర్ల తహశీల్దార్‌గా ఉన్న యుకె పాడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసారు. ఆయనతోపాటు విఆర్వో శారద, బోగస్ పాసు పుస్తకం పొందిన కృష్ణమూర్తితోపాటు ఈ వ్యవహారంలో సహకరించిన ప్రదీప్, మురళి అనే వ్యక్తులను అరెస్టు చేసారు.

బాబుకు బహిరంగ లేఖ
శే్వతపత్రంపై ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ 28-9-2012న ఎపిఎండిసికి ఇచ్చిన మైనింగ్ లీజు అనుమతులను రద్దు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఐదవ షెడ్యూల్‌లోని మూడవ అధికరణం ప్రకారం సంక్రమించిన విశేష అధికారాన్ని ఉపయోగించి దీన్ని రద్దు చేసిందన్నారు. రద్దయిన తరువాత మళ్లీ అనుమతులు ఎవరు.. ఎప్పుడు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 27-4-2012న గవర్నర్‌కు రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం ఎపిఎండిసితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని చంద్రబాబునాయుడు కోరారన్నారు. అంతేకాకుండా అటవీ హక్కుల చట్టాన్ని, గ్రామ సభల అభిప్రాయాన్ని, గిరిజన సలహా మండలి సలహాలను అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారని శర్మ వివరించారు.

ఉద్ధృతంగా బాహుదా
మదనపల్లె, నవంబర్ 25 : తుఫాన్ ప్రభావం లేకపోయినా ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని సిటిఎం రోడ్డు బాహుదా కాల్వ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన ఏకధాటి వర్షాలకు కాల్వ ప్రవాహం ఉద్ధృతమైంది. దీంతో పట్టణంలోని బుగ్గకాల్వ, చెంబకూరు రోడ్డు, బాకావానితోట, ఎంజిసి డౌన్, అనంతయ్యబంగ్లా, బాపనకాల్వ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. బాపనకాల్వ బ్రిడ్జి ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు రాత్రంతా భయాందోళనకు గురయ్యారు. అనంతయ్య బంగ్లావీధిలోని శ్రీ పంచలింగాల మల్లికార్జున స్వామి ఆలయం, గర్భగుడి, నందివిగ్రహం, నవగ్రహాలు సైతం నీటమునిగాయి. పట్టణంలోని దక్నీపేట జామియామసీదు సమీపంలో షెడ్డు కూలిపోవడంతో అందులో ఉన్న సుమారు 260 కోళ్లు మృత్యువాత పడ్డాయి.

ముంపు ప్రాంతాల్లో
జగన్ సుడిగాలి పర్యటన
చిల్లకూరు, నవంబర్ 25: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో వేలాది ఎకరాలు రొయ్యల గుంటలునీటి పాలయ్యాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కోట మీదుగా బుధవారం మధ్యాహ్నం మండలంలోని కడివేడుకు చేరుకొన్నారు. అక్కడ నుండి ప్రతి హరిజన, గిరిజన వాడల్లో జగన్ పర్యటించి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరద తాకిడికి గురైన ప్రాంతాలను పరిశీలించారు. నిధులు మంజూరు చేయకనే అధికారులపై స్వారీ చేయడం తెలుగుదేశం పార్టీకి తగదన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.