రాష్ట్రీయం

ఆయకట్టుకు కరవుకాటు ( దుర్భిక్ష సాగర్-1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: అంతర్ రాష్ట్ర జల వివాదం.. ప్రకృతి శాపం.. రాజకీయ ప్రయోజనాలు... నాగార్జునసాగర్ ఆయకట్టుకు శాపంగా పరిణమించాయి. పదకొండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే కుడికాలువ ఎండిపోయింది. ఇది తాజా పరిణామం కాదు...గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. పదిహేనేళ్లనాటి దుర్భిక్ష పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి. దేశంలో మరెక్కడా పండనటువంటి బిపిటి రకం వరిని పండించే రైతులు మూడు సంవత్సరాలుగా పొలాల్లోకి అడుగు పెడితే ఒట్టు. మినుము, పెసర వంటి స్వల్పకాలిక పంటలను వేసుకుని జీవనం సాగిద్దామన్నా అవకాశం లేని దుర్భిక్షం దాపురించింది. సాగర్ కుడి కాలువ కింద దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో గత మూడేళ్లుగా దుక్కి దున్నలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయకట్టు పరిధిలో పంటలు కాదు సరికదా, కనీసం మూగజీవాలకు పనికొచ్చే పశుగ్రాసమూ మొలకెత్తడం లేదు. ఈ క్షామాన్ని తట్టుకోలేక పొలాలను తెగనమ్ముకోడానికి కూడా రైతులు వెనకాడటం లేదు. మూడేళ్ల కిందట ఎకరా 20 లక్షల వరకూ పలికింది. అదే పొలాన్ని ఇప్పుడు 12 లక్షలకు అమ్ముకుందామన్నా కొనేవారు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు తలెత్తుకుని ధైర్యంగా తిరిగిన సాగర్ రైతు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని అప్పుల కోసం వెంపర్లాడుతున్నాడు.
సాగర్ జలాశయం కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సుమారు 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ వరే ప్రధాన పంట. దేశంలో అత్యంత నాణ్యమైన బిపిటి సన్నాలు రకం పంట ఇక్కడే పండుతుంది. 2002-03లో సాగర్ జలాశయం మొత్తం ఎండిపోవడంతో ఆయకట్టులో కరవు కరాళ నృత్యం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది. సాగర్ ఆయకట్టు గరిష్ఠ నీటిమట్టం 580 అడుగులు. నీటి నిల్వ 268 టిఎంసిలు. ఏటా ఆగస్టు నెలలో 580 అడుగుల నీరు సాగర్ జలాశయంలో ఉండేది. కొనే్నళ్లుగా ఈ నీటి నిల్వ కనిష్ట స్థాయికి పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో పుష్కలంగా వర్షాలు కురియడం, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరడం.. ఆ నీరంతా శ్రీశైలం మీదుగా సాగర్‌లోకి వచ్చి చేరడంతో సాగర్ కుడికాలువ ఆయకట్టులో సమృద్ధిగా పంటలు పండుతూ వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కృష్ణా జల వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికితోడు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కర్ణాటక, మహారాష్టల్ర నుంచి నీటిని కిందకు విడుదల చేయడం లేదు. అయితే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం 874 అడుగులకు పెరిగింది. ఇందులో కొంత నీటిని సాగర్‌కు విడుదల చేసి పంటకు అవకాశం కల్పించవచ్చు. కానీ తెలంగాణ అందుకు ససేమిరా అనడంతో ప్రస్తుతం ఆ నీరు శ్రీశైలం జలాశయానికే పరిమితమైపోయింది. గత నెలలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం నుంచి 13 టిఎంసిల నీటిని విడుదల చేశారు. ఈ నీటిని తెలంగాణ, ఏపి సర్దుకోవలసి వచ్చింది.
రైపేరియన్ కండిషన్స్ మాటేంటి?
పరీవాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి కృష్ణా జలాలను పంపిణీ చేయాల్సి ఉంది. అంటే ముందు నిర్మించిన ప్రాజెక్ట్‌లకు ముందుగా నీరిచ్చి, అక్కడి అవసరాలు తీరిన తరువాతే, మిగిలిన జలాశయాలకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సాగర్ విషయంలో ఈ నిబంధనలను పాటించడం లేదు. సాగర్ జలాశయానికి నీరు విడుల చేసిన తరువాతే, తెలుగు గంగ, పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయాలి. అయితే, రాయలసీమలోని కరవు పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 5000 నుంచి 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం పట్ల సాగర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నీరు విడుదల కాకపోవడంతో ఏడు లక్షల ఎకరాల్లో మాగాణి పంటకు నష్టం వాటిల్లింది. దామాషా పద్ధతిన నీటి పంపకం చేయాలని ఏపి ప్రభుత్వం వత్తిడి తేకపోవడం ఈ పరిస్థితికి కారణం.

కెవిజి శ్రీనివాస్