రాష్ట్రీయం

ముంచేసిన మూడోవిడత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిసొచ్చిన వానలు, సర్కారు ప్రకటనలు.. వెరసి ఈ ఖరీఫ్‌తో నిరుటి కరవు కష్టాల నుంచి గట్టెక్కేస్తామని ఆశించిన రైతుకు అడియాసలే మిగిలాయ. మూడో విడత రుణ మాఫీ బ్యాంకు ఖాతాల్లో జమ అయతే, ఖరీఫ్‌కు పెట్టుబడి కష్టం లేకుండా పోతుందని ఆశించిన రైతు చివరకు భంగపడ్డాడు. బడ్జెట్‌లో నిధులు కేటాయంచినా బ్యాంకులకు మూడో విడత మాఫీ మొత్తాన్ని సర్కారు జమ చేయకపోవడంతో, రైతుకు పంట రుణాలు అందకుండాపోయాయ. చివరకు పెట్టుబడుల కోసం ప్రయవేట్ ఫైనాన్షియర్ల వద్దకు పరుగులు తీసిన రైతు, మాఫీ మొత్తం ఇప్పటికీ అందకపోవడంతో వడ్డీలు ఎలా చెల్లించాలంటూ లబోదిబోమంటున్నాడు. మూడో విడత మాఫీ మొత్తంగా ముంచేసిందని గగ్గోలు పెడుతున్నాడు.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: నిరుడు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల నుంచి ఈ ఖరీఫ్ సీజన్‌లో సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల గట్టెక్కవచ్చని ఆశ పడిన రైతన్నను ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా సకాలంలో పంట రుణాలు అందకపోవడం, రుణ మాఫీ మూడో విడతపై సర్కారు ముందడుగు వేయకపోవడంతో.. పెట్టుబడికి డబ్బులు లేక రైతన్న దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఖరీఫ్‌లో సాగులో వేసిన పంటల పెట్టుబడికి తాము విడుదల చేసిన పంట రుణ మాఫీ మూడో విడత మొత్తం ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇంతవరకు ఏ జిల్లాలోనూ రుణ మాఫీ మూడో విడత రైతుల ఖాతాల్లో జమకాలేదని రైతులు, రైతు సంఘాలు వాపోతున్నాయి. అంతెందుకు మూడో విడత రుణ మాఫీని వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సొంత జిల్లాలోనూ రైతులు రోడ్డెక్కారంటే ఇక ఇతర జిల్లాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రుణ మాఫీ మూడో విడత మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేయడంతో పాటు కొత్తగా పంట రుణాలు మంజురు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జూన్ నెలాఖరులో జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనే ఆదేశించారు. ఇది జరిగి మూడు నెలలు గడుస్తున్నా మూడో విడత రైతులు ఖాతాల్లో జమ చేయలేదు. మూడో విడత పంట రుణ మాఫీ కోసం మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రూ.4040 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా దీనిలో సగం రూ.2020 కోట్లను జూన్ చివరివారంలో ఆర్థికశాఖ విడుదల చేసింది. రుణ మాఫీ పొందిన రైతులు తమ ఖాతాలను రీ-షెడ్యూల్డ్ చేసుకోకపోవడం వల్ల 50శాతాన్ని మాత్రమే మొదట విడుదల చేసినట్టు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అయితే బ్యాంకర్ల మాత్రం మంత్రి చేసిన ప్రకటనతో ఏకీభవించడం లేదు. బ్యాంకర్లతో కుదిరిన ఒప్పందం మేరకు మూడో విడతలో చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేస్తే తప్ప రైతుల ఖాతాల్లో జమ చేయలేమని బ్యాంకర్లు చేతులెత్తేశారు. మూడో విడతగా రూ.4040 కోట్లు చెల్లించాల్సి ఉండగా దీనిలో సగం రూ.2020 కోట్లు మాత్రమే చెల్లించడంతో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయలేదని బ్యాంకర్ల వాదన. వాస్తవానికి పంట రుణ మాఫీకి అర్హులైన 36 లక్షల మంది రైతులకు నాలుగు విడతల్లో రూ. 4250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.17000 కోట్లను బ్యాంకర్లకు చెల్లించే విధంగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు రెండు విడతలుగా రూ.8500 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా, వీటిని రైతుల ఖాతాల్లో బ్యాంకర్లు జమ చేశారు. మూడో విడతను ఈ ఖరీఫ్ సీజన్ పెట్టుబడికి ఉపయోగపడేలా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఆమేరకు బడ్జెట్‌లోనూ నిధులను కేటాయించింది. రుణ మాఫీ పొందిన రైతులు తమ రుణాలను రీ-షెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల వాయిదా మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేమని వ్యవసాయ శాఖ కొర్రి పెట్టింది. దీంతో సగం మొత్తాన్ని మాత్రమే మూడు నెలల కిందట బ్యాంకర్లకు ఆర్థికశాఖ చెల్లించింది. ఒప్పందం మేరకు రూ.4250 కోట్లు ఒకేసారి విడుదల చేస్తే తప్ప రైతుల ఖాతాల్లో జమ చేయడం కుదరదని బ్యాంకర్లు మొండికేయడంతో ఖరీఫ్‌లో వేసిన పంటల పెట్టుబడుల కోసం రైతులు ప్రయివేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణ మాఫీ మూడో విడత అందగానే తిరిగి చెల్లిస్తామన్న పూచితో వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో అప్పులు చేసిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో దిక్కుతోచక రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.