రాష్ట్రీయం

వద్దన్నా వినని విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: వద్దు వద్దని చెప్పినా అమెరికా చదువులపై ఉత్సాహం పెంచుకుంటున్న భారతీయ విద్యార్ధులు వర్శిటీలకు చేరకుండానే మధ్యలో చిక్కుకుపోతున్నారు. నేరుగా అమెరికా వెళ్లే విమానాల్లో కాకుండా అబుదాబి మీదుగా వెళ్తున్న వారిని అక్కడి విమానాశ్రయాల్లోని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్ధులను అడ్డుకుంటున్నారు. అమెరికాలో బ్లాక్ లిస్టు కాకున్నా నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా నాశిరకం యూనివర్శిటీలను ఎంపిక చేసుకున్న విద్యార్ధులను ఇమిగ్రేషన్ అధికారులు అబుదాబి విమానాశ్రయంలో తరచి తరచి ప్రశ్నించడంతో తెలుగు విద్యార్ధులు సమాధానాలు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. అమెరికా వరకూ చేరుకుని శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోనే బందీగా ఉండిపోయి, 14 మంది తెలుగు విద్యార్ధులు వెనక్కు రాగా, మరో 19 మంది భారతీయ విద్యార్ధులను అబుదాబి విమానాశ్రయంలో అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఆధీనంలోని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
మరో 20 మంది విద్యార్ధులను మంగళవారం నాడు విమానం ఎక్కనీయకుండా హైదరాబాద్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. కాగా గురువారం నాడు నలుగురు విద్యార్ధులు వెళ్లగా వారిలో ఇద్దరిని స్థానికంగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్టు సమాచారం. శాన్ జోస్(కాలిఫోర్నియా)లోని సిలికాన్ వాలీ యూనివర్శిటీ , ఫ్రీమాంట్‌లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీకి వెళ్తున్న వారికి మాత్రమే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించినా, తాజాగా హూస్టన్‌లోని క్లీర్ లేక్ (టెక్సాస్), స్ట్రాట్‌ఫోర్టు యూనివర్శిటీ (వర్జీనియా), కెంట్ స్టేట్ యూనివర్శిటీ (ఒహియో స్టేట్)లకు వెళ్తున్న విద్యార్ధులు సైతం ఈ సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిసింది. అబుదాబి విమానాశ్రయంలో దాదాపు 8 గంటల పాటు విద్యార్ధులకు తమ భవితవ్యం ఏమిటో అర్ధం కాకుండా ఆగిపోవల్సి వచ్చింది. తీరా అమెరికా విమానం ఎక్కాలనుకున్న వారికి టిక్కెట్లు రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. విద్యార్ధులు వారిని నిలదీస్తే కొత్తగా టిక్కెట్ తీసుకుంటే పాత టిక్కెట్ మొత్తాన్ని వాపస్ ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. కొత్త టిక్కెట్‌కు సరిపడా డబ్బు వారి వద్ద లేకపోవడంతో విద్యార్ధులు నానా అగచాట్లూ పడ్డారు.