రాష్ట్రీయం

భార్యాభర్తల విభజన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27:తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన విభజన చట్టం... ఉద్యోగాలు చేసుకుంటున్న భార్యాభర్తలనూ విభజిస్తోంది. కుటుంబాలకు దూరం చేస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్న దంపతులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయితే ఇంకొకరు కేంద్రప్రభుత్వ ఉద్యోగి. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వారూ విడిపోయే పరిస్థితి. వచ్చే నెల మూడో తేదీకల్లా వెలగపూడికి వచ్చేయాలని ఏపి సర్కారు ఆదేశం. తెలంగాణ సర్కారేమో ఏపి వాళ్లను తీసుకునేది లేదంటోంది. వెళ్లకపోతే ఉద్యోగ సమస్య. వెళితే కుటుంబానికి దూరం కావలసిన పరిస్థితి. ఈ సమస్య తీరేది కాదని కమలనాథన్ ఎప్పుడో చేతులెత్తేశారు. విధివిధానాలు రూపొందించాల్సిన కేంద్రం అంటీముట్టనట్లుంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ సచివాలయం, కమిషనరేట్‌లలో పనిచేసే ఉద్యోగులు ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లిపోగా, కొందరు ఏపి ఉద్యోగులు తెలంగాణలో, మరికొందరు తెలంగాణ ఉద్యోగులు ఏపిలో కొనసాగుతున్నారు. వీరిలో చాలామంది ఎక్కడికక్కడ సెటిలయ్యారు. ఏపిలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులను తిరిగి సొంత రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితే దయనీయంగా ఉంది. భర్త కేంద్ర ప్రభుత్వంలో, భార్య ఏపి సచివాయలంలో పనిచేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య 70 వరకూ ఉంది. ఏపి సర్కారు ఇచ్చిన ఆదేశాలతో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు కుటుంబాలకు దూరం కావలసిన పరిస్థితి నెలకొంది. ఈనెల 3లోగా సచివాలయంలో పనిచేసే ఎస్‌ఓ, ఏఎస్‌ఓలను వెలగపూడిలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే, డిఆర్‌డిఎల్, బీహెచ్‌ఇఎల్, ఆర్మీ వంటి బదిలీలు లేని కేంద్రప్రభుత్వ శాఖల్లో పనిచేసే స్పౌజ్ కేసుల వారికి ఇది ఇబ్బందిగా పరిణమించింది.
భార్యాభర్తల్లో ఒకరు కేంద్రం, మరొకరు ఏపి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నేపధ్యంలో.. బదిలీల వ్యవహారం కుటుంబాలకు సమస్యగా మారింది. బీహెచ్‌ఇఎల్, డిఆర్‌డిఎల్ వంటి కేంద్రప్రభుత్వ శాఖలు హైదరాబాద్‌లో తప్ప ఏపిలో లేవు. విభజన చట్టంలో స్పౌజ్ కేసులకు సంబంధించిన ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించకపోవడం వీరికి శాపంగా పరిణమించింది. ఎల్‌ఐసి, రైల్వే, పోస్టల్, బ్యాంకుల వంటి మిగిలిన కేంద్రప్రభుత్వ శాఖలకయితే బదిలీలు చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ డిఆర్‌డిఎల్, బీహెచ్‌ఇఎల్ వంటి విభాగాల్లో పనిచేసే వారు ఇక్కడ తప్పితే ఢిల్లీకే బదిలీ కావలసి ఉంటుంది.
దీనిపై చాలామంది ఉద్యోగులు కమలనాథన్‌ను కలసి తమ సమస్యలు మొరపెట్టుకోగా, చట్టంలో లేనిది తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. కేంద్రం దీనిపై విధివిధానాలు రూపొందించాలని అభ్యర్ధించినా వినిపించుకోలేదు. ఏపి-తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కలిసినా ఫలితం లేదు. నిజానికి తెలంగాణలో 143 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఒక ముసాయిదా రూపొందించింది. ప్రస్తుతం ఆ ఫైలు ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు పరిశీలనలో ఉంది. దానిని ఖరారు చేసి, వెబ్‌సైట్‌లో పెట్టేందుకు ఎంతలేదన్నా రెండునెలల సమయం పడుతుంది. ఆ తర్వాత దరఖాస్తులు ఆహ్వానిస్తారు. అప్పుడు పోస్టింగులపై నిర్ణయం తీసుకుంటారు.
కానీ ఒక సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం కూడా స్థానికత ఆధారంగానే పోస్టింగులిచ్చే అవకాశం ఉందన్న ప్రచారం, ఏపి స్థానికత ఉన్న భార్యాభర్తలకు ఆందోళన కలిగిస్తోంది. అంటే భార్యాభర్తలిద్దరూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నా, వారిని ఏపి స్థానికత ఉంటే తీసుకోరన్నమాట. ఇద్దరిలో ఒకరికి స్థానికత ఉంటేనే తెలంగాణ సచివాలయంలో అవకాశం దక్కుతుంది.
దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించి, స్థానికతతో సంబంధం లేకుండా, స్పౌజ్ కేసులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేలా మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. లేకపోతే ఏపి ప్రభుత్వమే ఇలాంటి కేసులపై స్పందించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ఒప్పించాల్సి ఉంది. కాగా, అనారోగ్య కారణాలతో 101 మంది ఉద్యోగులు వెలగపూడికి వచ్చే పరిస్థితి లేనందున, తమకు మినహాయింపు ఇవ్వాలని ఏపి సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. అవి కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా మానవతా హృదయంతో స్పందించాల్సి ఉంది.