రాష్ట్రీయం

ఉద్యోగుల విభజనకు ప్రత్యేక కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీని (చైర్మన్ అడ్వయిజరీ కమిటీ, ఎపి) కేంద్రం నియమించిన విషయం గమనార్హం. అదే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అక్టోబర్ 11 న (దసరా) సందర్భంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాత్కాలిక అవసరాల కోసం ఉద్యోగలను కొత్త జిల్లాల్లో ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికన నియమిస్తున్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మల ఆదేశాల మేరకు ఆ యా శాఖల మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ (హెచ్‌ఓడి)లు కలిసి ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు చేశారు. అయితే ఉద్యోగుల విభజన శాశ్వతంగా చేసే విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక జిల్లాను రెండు లేదా మూడు జిల్లాలను విభజిస్తున్నారు. అదే జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని మరొక కొత్త జిల్లాలో కలిపివేస్తున్నారు.
ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తున్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూలు, వనపర్తి కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న షాద్‌నగర్ శాసనసభా నియోజకవర్గాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపివేయాలని నిర్ణయించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను అదే జిల్లాలో నియమించాల్సి ఉంటుంది. ఒక జిల్లా పరిధిలో ఎక్కువ మంది ఉద్యోగులు, మరొక జిల్లా పరిధిలో తక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఏం చేయాలన్న అంశం సమస్యగా మారింది. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వస్తే వారిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురావాలా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలో సొంత గ్రామంగా ఉండే ఒక వ్యక్తి మహబూబ్‌నగర్‌లో చదివితే అతను మహబూబ్‌నగర్ జిల్లాకు ‘స్థానికుడు’ అవుతాడు. ఇలాంటి కేసులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాల్సిన అవసరం ఉందని సీనియర్ రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. కమిటీని నియమిస్తేనే ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వీలవుతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. శివశంకర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఉద్యోగుల విభజన చట్టప్రకారం జరగాలంటే ప్రత్యేక కమిటీని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే న్యాయపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా ఆయన వివరించారు. న్యాయ నిపుణుల సలహా కూడా ఇందుకోసం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.