రాష్ట్రీయం

అమ్మలగన్నయమ్మ... మూలపుటమ్మ (నేడు విజయదశమి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు లోగిళ్లు దసరా శోభతో కళకళలాడుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల శోభకు విజయదశమి కొత్త కళను తెచ్చింది. విజయాన్ని అందించే పండుగ దసరా. చెడును చెండాడి...జయకేతనాన్ని ఎగరవేసిన శక్తి ఈ పండుగ ప్రత్యేకత. అన్ని విజయాలకూ అమ్మవారే అసలు కారణమన్నది అందరి విశ్వాసం. ఆ అమ్మవారి దీవెనల కోసం పండువెనె్నల రోజుల్లో, నిండు మనసుతో ఆమెను ఆరాధిస్తారు. అనునిత్యం స్తుతిస్తారు.
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే
చైత్ర, ఆశ్వయుజ మాసాలను యమదంష్టల్రు అంటారు. అందుచేత ఆ నెలల్లో ప్రత్యేక పూజలు చేసి గండాల నుంచి బయటపడతారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత రాత్రులు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల యమదంష్ట్ర దోషం తొలగిపోతుంది. రోగాలు, దారిద్య్రం తొలగి సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయి. పై శ్లోకం పఠించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయి. దసరా అందరి పండుగ. దీనికి కుల, వర్గాలతో సంబంధం లేదు. ఇది ఆనందాన్నిచ్చే వేడుక. శక్తి ఆరాధనంటే అమ్మ ఆరాధనే. అమ్మ అంటే పిల్లల్ని సంరక్షించేది. ప్రజలను తమ పిల్లలుగా భావించి రక్షించే తల్లి ఆదిపరాశక్తి. ఆమెను పూజించడం అంటే అమ్మను కీర్తించడమే. పూజలు అన్నంత మాత్రాన ఇది పెద్దలకు పరిమితం కాదు. పెద్దాచిన్నా, ముసలీ ముతకా ఈ వేడుకల్లో పాల్గొంటారు.
దసరా వేడుకల వైశిష్ట్యం చెప్పుకునేందుకు ఎన్నో ఉదంతాలు పురాణేతిహాసాల్లో ఉన్నాయి. త్రేతాయుగంలో దేవీస్తుతితోనే శ్రీరామ చంద్రుడు రావణుడిపై విజయం సాధించాడని పురాణాలు చెబుతున్నాయి. కిష్కింధ సమీపంలో రామచంద్రుడు నారదుడి సారథ్యంలో, సుగ్రీవుడి సహాయంతో దేవీ నవరాత్రి పూజలు చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ఉత్సవాల వేళలోనే ఎనిమిదవ రోజు శ్రీరామ చంద్రునికి కలలో అమ్మవారు కనిపించి ఆయన కోరిన కోర్కెలు విని వరాలు ఇచ్చారని ఐతిహ్యం. దేవీవరాల ఫలితంగానే ఆయన విజయం సాధించారని విశ్వాసం. వానరుల సహాయంతో సముద్రంపై వారథి కట్టడం దగ్గరనుంచి రావణ వథ వరకు అన్ని విజయాలకు ఈ నవరాత్రి ఉత్సవాల పుణ్యఫలమే కారణమని అందరి విశ్వాసం. వాల్మీకి రామాయణంలోనూ ఈ ప్రస్తావన ఉందని ప్రతీతి.
ఇక ద్వాపరయుగంలోనూ శరన్నవరాత్రుల ప్రత్యేకతలు వెల్లడయ్యాయి. విరాటుని కొలువులో అజ్ఞాతవాసం ఉన్న పాండవులు, తమ అస్తశ్రస్త్రాలను తీసుకుని యుద్ధానికి వెళ్లి విజయం సాధించినది దశమినాడే కావడం విశేషం. చాలాకాలం పాటు వారి ఆయుధాలను రక్షించిన శమీ వృక్షం సాక్షాత్తు దేవీరూపమని విశ్వాసం. అందుకే అర్జునాదులు పూజించిన శమీవృక్షం అందరికీ అమ్మవారి ప్రతిరూపంలా కనిపిస్తుంది.
శమీశమయితే పాపం
శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి
రామస్య ప్రియదర్శనం
జనసామాన్యంలో కూడా శమీ వృక్షం ఆరాధనలు అందుకుంటోంది. దసరా పండుగ పూట జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీయే. సకల శుభాలను ఇవి అందిస్తాయన్నది భావన. శుభకామనలతో వాటిని అందించడం సంప్రదాయంగా వస్తోంది. దసరాకు ప్రాంతీయ భేదాలు లేవు. భారతావనిలో ఇది ఆధ్యాత్మికతతో చేసే పండుగ. ఆసేతు హిమాచలం ఇది భక్తిశ్రద్ధలతో చేసే పండుగ. దేశవిదేశాల్లోనూ అమ్మవారి ఆరాధన జరుగుతోంది.
నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేస్తారు. పదోరోజు ఉద్వాసన ఉంటుంది. దుర్గ, లక్ష్మి, సరస్వతి, కాళి, చండిక, చాముండి, లలితాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, గాయత్రి, స్వాహా, స్వథా రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. పది చేతులతో దర్శనమిచ్చే శక్తిస్వరూపిణి అయిన దుర్గ, మహిషాసుర మర్థినిగా భక్తజన కోటిని అనుగ్రహిస్తోంది. ఆమె ఆదిపరాశక్తి.
అమ్మవారికి ఎన్నిరూపాలున్నప్పటికీ ముగ్గురమ్మలను ప్రధానంగా పూజిస్తారు. నవరాత్రులలో పూజలు నిర్వహించలేనివారు సూక్ష్మంలో మోక్షంలా సప్తమి, అష్టమి, నవమి తిథులలో తప్పనిసరిగా పూజించాలి. అలాకూడా వీలుపడనివారు నవమినాడైనా భక్తిశ్రద్ధలతో ముగ్గురమ్మలను పూజిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసర్వతులు ముగ్గురమ్మలు. ఇదికూడా వీలుకాని వారు శమీపూజలు చేయడం మరో సౌకర్యం. భద్రకాళి, బ్రాహ్మిణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఇలా అన్నీ అమ్మవారి రూపాలే. భక్తులు ఎలా కొలిస్తే..తలిస్తే..ఆమె అలా కన్పించి వరాలిస్తుంది. విజయాన్నిస్తుంది. అందుకే దసరా విజయాల పండుగ. ఆ విజయాల సాధనకు కావలసిన శక్తినిస్తుంది ఆ ఆదిపరాశక్తి.
యాదేవీ సర్వభూతేషు శక్తిరూపిణీ సంస్థితా
నమస్తస్మై, నమస్తస్మై నమోనమః
ఇక శక్తిస్వరూపిణి అయిన దుర్గమ్మ మహిషాసురుడ్ని హతమార్చిన వైనం దసరాకు అసలు కారణం. సకల లోకాలను పీడించి, దేవతలను ఓడించి విర్రవీగుతున్న మహిషాసురుడి పీచమణచిన శక్తిస్వరూపిణి దుర్గాదేవి. త్రిమూర్తుల శక్తితో, దేవతల అంశలన్నీ కలసి దుర్గాదేవిగా అవతరించిన అమ్మవారు సింహవాహనంపై వచ్చి మహిషాసురిడితో యుద్ధం చేస్తుంది. తొమ్మిది రోజుల పాటు పగలూరాత్రీ యుద్ధం చేసి మహిషాసురిడిని వధిస్తుంది. రాక్షస సంహారంతో సకల లోకాలూ సంతోషిస్తాయి. దేవతలు ఆనందిస్తారు. అందరి ఆనందానికి కారణమైన అమ్మవారి విజయ సంకేతమే దసరా. అందుకే విజయ..జయజయధ్వానాలు అందుకుంది. విజయలక్ష్మి అయింది. అందుకే దసరా విజయాల వేడుక. ఆనందాల డోలిక.

-కొలనుపాక మురళీధర రావు