రాష్ట్రీయం

ఒంటరి పోరాటమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోంది. కృష్ణా పరీవాహకంలోని నాలుగు రాష్ట్రాల మధ్య జలాల పునఃపంపిణీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత కోరుకున్నా అది సాధ్యంకాదని దాదాపు తేలిపోయింది. ఈ అంశంపై న్యాయపోరాటం చేసినా అంతగా ఉపయోగం ఉండదనే అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చినట్టు సమాచారం. విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి వాటాను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలన్న అంశంపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ, తెలంగాణ కోరుకున్నట్టు నాలుగు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ సాధ్యం కాదని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విభజన చట్టాన్ని ప్రస్తావించకుండా, తెలంగాణ కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రం కనుక, కొత్తగా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు పునఃపంపిణీ చేపట్టాలన్న అంశంపైనే సుప్రీంకోర్టులో బలంగా వాదించాలనే అభిప్రాయం ఇంజనీరింగ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
బచావత్ ట్రిబ్యునల్ కాల పరిమితి దాటిపోయాక 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్ 2013లో తీర్పు ఇచ్చింది. తీర్పును అప్పటి తెరాస, తెదేపాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన తరువాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన సమయంలో సుప్రీంకోర్టులో ఉమ్మడి ఆంధ్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు గెజిట్‌లోకి రాలేదు. ఇంకా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటి పంపిణీ జరుగుతోంది. సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల సమస్య రెండు రాష్ట్రాల మధ్యేనని బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పినందున, స్టే ఎత్తివేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని మహారాష్ట్ర, కర్నాటకలు సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉందని తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సెక్షన్ 89 అంశాన్ని పక్కనపెట్టి, తెలంగాణకు జరిగే అన్యాయంపైనే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని భావిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 350 టిఎంసి జలాలు కృష్ణా పరీవాహకంలోకి రాని ప్రాంతంలో ఆంధ్ర వాడుకుంటోంది. దీనిపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తేవాలని తెలంగాణ నిర్ణయించింది. 2130 టిఎంసి కృష్ణా జలాల్లో మహారాష్టక్రు 585 టిఎంసి, కర్నాటకు 734 టిఎంసి, ఉమ్మడి ఆంధ్రకు 811 టిఎంసి కేటాయించారు. 811 టిఎంసి జలాల్లో తెలంగాణ, ఆంధ్ర వాటాలు తేల్చుకోవాలని, ఆ అంశంతో తమకు సంబంధం లేదని కర్నాటక, మహారాష్టల్రు వాదిస్తున్నాయి. ఈ వాదనతోనే స్టే ఎత్తివేయమని కోరేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 811 టిఎంసి జలాల్లో న్యాయమైన వాటా కోసం, మరోపక్క నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ జరపాలన్న వాదనతో సుప్రీంను ఆశ్రయించేందుకు తెలంగాణ సన్నద్ధమైంది. తెలంగాణకు హక్కుగా సంక్రమించే జలాలను పూర్తిస్థాయి సాధించుకోలేకపోతే, భవిష్యత్తులో గోదావరిపైనే తెలంగాణ ఎక్కువగా ఆధార పడకతప్పని పరిస్థితి ఉండొచ్చని ఇరిగేషన్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుకంటే సుప్రీం తీర్పు అంతిమం కనుక, అనాదిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, హక్కుదారుగా కేటాయించాల్సిన వాటాలపైనే న్యాయపోరాటం చేయాలనే అభిప్రాయాన్ని తెలంగాణ ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 89కి సుప్రీంకోర్టు సైతం పరిమితమైతే, తెలంగాణ మరోసారి తీవ్ర అన్యాయానికి గురవుతుందని, ఈ పరిస్థితుల్లో పునఃపంపిణీ అంశంపైనే ఎక్కువ దృష్టిపెట్టాలని కూడా తెలంగాణ భావిస్తోంది. సున్నితమైన నీటి పంపకాల విషయంలో ఎవరూ ఏకపక్షంగా వ్యవహరించలేరని మంత్రులూ అభిప్రాయపడుతున్నారు. కావేరి జలాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరించినా తీర్పు అమలు చేయలేని పరిస్థితి కనిపించింది. సున్నితమైన జలాల పంపిణీ అంశంలో సుప్రీంకోర్టులో వాదన బలంగా వినిపించడం ద్వారా తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయాన్ని సరిచేయాలనే వాదన వినిపించాలని నిర్ణయించారు.