రాష్ట్రీయం

పోషణ భారమై.. ఆడశిశువు విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, అక్టోబర్ 27: నాలుగో కాన్పు కూడా ఆడపిల్ల కావడం, తల్లి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోషణ భారమై పుట్టిన పాపను 20 వేల రూపాయలకు విక్రయించిన సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని జంగాలకాలనీలో గురువారం చోటుచేసుకుంది. కల్లెం సైదులు, భాగ్యమ్మలకు ఇదివరకే ముగ్గురు ఆడపిల్లలు స్వప్న, సరిత, సరోజ ఉన్నారు. భాగ్యమ్మకు 15 రోజుల క్రితం నాల్గవ కాన్పులో మరో ఆడశిశువు జన్మించింది. మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో భాగ్యమ్మకు ప్రసవం నిమిత్తం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అందుకు సుమారు 10వేల రూపాయలు ఆసుపత్రిలో చెల్లించాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన అనంతరం భాగ్యమ్మ ఆరోగ్యం చెడిపోవడంతో వైద్య ఖర్చులు, పిల్లల పోషణ ఆర్థిక భారంగా మారాయి. దీంతో తల్లిదండ్రులు సైదులు, భాగ్యమ్మలు తమ నాల్గవ సంతానంగా జన్మించిన ఆడ శిశువును విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారం గ్రామానికి చెందిన బొల్లం ఉమా కృష్ణారెడ్డి దంపతులకు సంతానం లేకపోవడంతో గతంలో ఒక పాపను తీసుకుని సాదుకున్నారు. అయితే ఆ పాప కూడా అనారోగ్యానికి గురై మరణించింది. దాంతో వేములపల్లికి చెందిన సైదులుభాగ్యమ్మ దంపతుల నాల్గవ పాపను 15 రోజుల క్రితం ఉమాకృష్ణారెడ్డి దంపతులు రూ.20 వేలకు కొనుగోలు చేశారు.
ప్రస్తుతం వారు సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. శిశు విక్రయం విషయం సమాచారం మిర్యాలగూడ ఐసిడిఎస్ సిడిపివో బుచ్చమ్మకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి వేములపల్లి మండలం జంగాలకాలనీకి చేరుకుంది. అక్కడ విచారించేందుకు సైదులు, భాగ్యమ్మలు లేకపోవడంతో శిశువును కొనుగోలు చేసిన ఉమ తల్లిగారి ఊరైన మాడ్గులపల్లి మండలం పాములపహాడ్‌కు వెళ్లి అక్కడ పాప గురించి ఆరాతీశారు. అలాగే జంగాల కాలనీలో ఇంట్లో ఉన్న శిశువు అక్క స్వప్నను విచారించగా తన చెల్లెలును విక్రయించినట్లుగా తెలిపింది. శిశు విక్రయంపై సిడిపివో బుచ్చమ్మ వేములపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాపను త్వరలో స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులు అంగీకరిస్తే వారికి అప్పగిస్తామని, లేదంటే శిశుగృహకు తరలిస్తామని ఆమె తెలిపారు.

చిత్రం.. జంగాల కాలనీలో సైదులు ఇంటివద్ద అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్న సిడిపిఓ బుచ్చమ్మ