రాష్ట్రీయం

ఇద్దరు సిఎంలకు నోట్ల సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: కేంద్రంలో చక్రం తిప్పిన నాయకుడిగా చంద్రబాబుకు పేరు ఉంది. కెసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేత. కానీ నోట్ల రద్దు వ్యహారం తరువాత తలెత్తిన సంక్షోభంపై ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ సిఎం కెసిఆర్‌ను పిలిపించుకుని మాట్లాడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నోట్ల రద్దు తరువాత బిజిపియేతర పార్టీలకు చెందిన నేతల్లో మోదీని కలిసిన తొలినేత కెసిఆర్ కాగా, నోట్లరద్దు ప్రభావంపై మోదీ ఫోన్‌లో మాట్లాడిన ఏకైక సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబే.
ఎన్‌డిఏ భాగస్వామి కాకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పలు అంశాలపై తరుచు మాట్లాడుకుంటున్నారు.
నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించగానే మరుసటి రోజు నుంచే కెసిఆర్ ఆర్థిక రంగ నిపుణులతో, ఆర్థిక శాఖ అధికారులతో వివిధ వర్గాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందని అనే అంశంపై మంతనాలు సాగించారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా పని చేసిన వేణుగోపాల్‌రెడ్డి మొదలుకొని ఆర్థిక రంగం నిపుణులే కాకుండా గ్రామీణ ప్రాంతాల జీవితంపై అవగాహన ఉన్న వివిధ వర్గాల వారితో, పరిశ్రమ వారితో కెసిఆర్ చర్చించారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. సిఎం పేషీలో పని చేసే సాధారణ అటెండర్‌ను కూడా నువ్వేమనుకుంటున్నావ్ అంటూ నోట్ల రద్దు ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పౌల్ట్రీ ఫాంల సంఘానికి ఫోన్ చేసి స్వయంగా ముఖ్యమంత్రే మీ పరిశ్రమ మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని అడిగారు. రియల్ ఎస్టేట్‌తో పాటు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, గ్రామీణ వృత్తుల వారిపై ఏ విధంగా ప్రభావం పడబోతుందో ఒక అవగాహనకు రావడమే కాకుండా ఆయా వర్గాలపై పడే ప్రభావం గురించి ఒక నివేదిక రూపొందించి ప్రధానమంత్రికి అందజేశారు.
ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పక్షాలు రాజకీయంగా స్పందిస్తే కెసిఆర్ మాత్రం నల్లధనం నిర్మూలించే చర్యలను అభినందిస్తూనే పొరపాట్లను ఎత్తి చూపించారు. వివిధ వర్గాలపై పడే తీవ్ర ప్రభావం గురించి వివరించారు. రైతులను, వృత్తి పని వారిని తీవ్రంగా ఇక్కట్ల పాలు చేసిందని వివరించారు. కెసిఆర్ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తుండడంతో పాటు నల్లధన నిర్మూలనకు అనుసరించాల్సిన విధానం గురించి చర్చిస్తుండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కెసిఆర్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు.
ప్రధానితో జరిగిన భేటీలో ఇదే విషయం చెప్పారు. గతంలో ఇచ్చిన అవకాశాన్ని నల్లధన కుబేరులు ఉపయోగించుకోలేదు. నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. మాట వినలేదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం కన్నా నల్లధనం మొత్తం మార్కెట్‌లోకి వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అని కెసిఆర్ అభిప్రాయపడుతున్నారు. నలభై శాతం పన్ను విధించి మిగిలిన సొమ్మును వైట్‌గా మార్చుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశం ఉపయోగించుకోలేదు. నోట్ల రద్దు ప్రకటన చేశాక, దానిని 50 శాతానికి పెంచడం వల్ల ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మరోవైపు నల్ల ధనం లేకుండా పోతుందనే అభిప్రాయం కెసిఆర్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. మార్కెట్‌లో కరెన్సీ అందుబాటులో ఉండే విధంగా చూస్తూ నల్లధనం పట్ల కఠినంగా వ్యవహరిస్తే బాగుండేదని కానీ దీనికి భిన్నంగా వ్యవహరించడం వల్ల నల్లధన కుబేరుల కన్నా సామాన్యులపైనే ఎక్కువ ప్రభావం పడింది. వీటిని కెసిఆర్ ప్రధానమంత్రికి వివరించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత నోట్ల రద్దు సలహా నాదే అని ప్రకటించారు. ప్రజల ఇబ్బందులను గమనించిన తరువాత స్వరం మార్చారు. ఒకవైపు కెసిఆర్‌ను పిలిచి, బాబును పిలవక పోవడం పట్ల టిడిపి వర్గీయులు ఆశ్చర్యపోతున్నారు. 12 రోజుల తరువాత కూడా సమస్య పరిష్కారం కాక పోవడం తాను మొదటి సారి చూస్తున్నాను అని ఈ సంక్షోభంపై చంద్రబాబు విమర్శించారు.