రాష్ట్రీయం

విదేశీ పెట్టుబడులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 27: మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం రక్షణ రంగం సహా, ఇతర తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు పెద్దపీట వేస్తోందని ఐసిఎఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ఉపాధ్యక్షుడు మానస్ కుమార్ ఠాకూర్ చెప్పారు. శుక్రవారం ఐసిఎఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి (ఎస్‌ఐఆర్‌సి), విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ‘దేశంలో స్థిరమైన వృద్ధి-సహజ వనరుల వినియోగం’ అంశంపై విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ వనరులను ఎలా వినియోగించుకుంటున్నారనే అంశంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. సహజ వనరులను సక్రమమైన పద్ధతిలో వినియోగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆర్‌ఐఎన్‌ఎల్ డైరెక్టర్ టివిఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ సహజ వనరుల ప్రభావం తయారీ రంగంపై ఉంటుందన్నారు. దేశంలో స్థిరమైన వృద్ధి సాధించేందుకు కాస్ట్ అకౌంటెంట్‌ల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా ఆయన సావనీర్‌ను విడుదల చేశారు. విశాఖ చాప్టర్ ఛైర్మన్ పివిఎన్ మాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల త్వరితగతిన పారిశ్రామికాభివృద్ధి సాధించగలమన్నారు. దేశంలో తొలిసారిగా రక్షణ రంగంలో సైతం విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
అలాగే న్యూస్ ప్రింట్ విభాగంలోను, సింగిల్ బ్రాండెడ్ రిటైల్ రంగంలో వందశాతం, మల్టీ బ్రాండెడ్, హోల్‌సేల్ రంగంలో 50 శాతం, సిమెంట్ ఫ్యాక్టరీలలో 50 శాతం, విద్యుత్ ఉత్పత్తిలో 50 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించిందన్నారు. ఈ సదస్సులో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఎపి నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.