రాష్ట్రీయం

సాంస్కృతిక వైభవానికి నిలయం భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: అంతర్జాతీయంగా సాంస్కృతిక వైభవానికి భారతదేశం నిలయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో (శిల్పారామం) ఆదివారం ఆయన ఆసియా- ఫసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ఎబియం) మొదటి అంతర్జాతీయ టెలివిజన్ నాట్యపండగ (డ్యాన్స్ ఫెస్టివల్) ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా ముందుకు వెళుతోందన్నారు. భారతీయ ప్రజలు మరీ ముఖ్యంగా యువత అన్నిరంగాల్లోనూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారన్నారు. సాంస్కృతిక, కళ, సాహిత్య రంగాల్లో భారత్‌కు అపూర్వ చరిత్ర ఉందని, ఈ రంగాల్లో వేల సంవత్సరాల నుండి తనదైన శైలిని ప్రదుర్శిస్తోందన్నారు. దేశంలో 64 కళల్లో ప్రసిద్ధి చెందిన మహానుభావులు ఉన్నారన్నారు. భారతీయ సాంస్కృతిక వైభవం రేడియో, టెలివిజన్ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలుస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ప్రతి దేశానికి ప్రత్యేకంగా సాంస్కృతిక రూపాలు, కళలు, సంస్కృతి ఉంటాయని, వాటిని ఆయా దేశాలు ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ నాట్యపండగలో పది దేశాలకు చెందిన 45 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. వివిధ దేశాలు తమ ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు ఈ తరహా పండగలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి దేశం కూడా వారసత్వంగా వస్తున్న కళారూపాలను కాపాడుకోవడం ద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఒకే వేదిక నుండి వివిధ దేశాల కళాకారులు తమ నాట్యాన్ని ప్రదర్శించడం, ఒకేచోట కళాకారులంతా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడంతో ఆయా దేశాల మధ్య స్నేహసంబంధాలు మెరుగుపడతాయని, అంతర్జాతీయంగా శాంతి నెలకొంటుందన్నారు. సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో మానసికోల్లాసం కలిగి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. ఎబియం బ్రాడ్‌కాస్టింగ్ వివిధ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు సాంస్కృతిక రంగాన్ని ఆయుధంగా వినియోగించడం శుభసూచకమన్నారు. హైదరాబాద్ నగరం సాంస్కృతిక, కళారూపాలకు కేంద్రంగా కొనసాగుతోందని, ఈ నగరంలో మొదటి అంతర్జాతీయ నాట్యపండగ నిర్వహించడం ఆనందం కలిగిస్తోందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ భాషలకు చెందిన ప్రజలే కాకుండా, అనేక దేశాలకు చెందిన వివిధ వర్గాలవారు జీవిస్తున్న ఈ నగరంలో నాట్యపండగ మహత్తరమైన విప్లవానికి నాంది పలుకుతుందని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తపర్చారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రసారభారతి చైర్మన్ ఎ సూర్యప్రకాశ్, ఎబియం సెక్రటరీ జనరల్ డాక్టర్ జావేద్ మొత్తగి, ప్రసారభారతి సిఇవో సురేష్‌చంద్ర పాండా, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ సుప్రియా సాహూ, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్, తదితరులు పాల్గొన్నారు. భారత్‌తో పాటు ఆప్ఘనిస్తాన్, మలేషియా, అజర్‌బైజాన్, ఫిలిప్పీన్స్, ఫిజీ, ఇండొనేషియా, మాల్దీవులు, ఉజ్బెకిస్తాన్, తదితర దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలిచ్చారు.

చిత్రం.. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం వెంకయ్య నాయుడు