రాష్ట్రీయం

పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ పంట పండింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆరు రోజుల పర్యటనకు స్విట్జర్లాండ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివిధ సంస్థలతో పదికి పైగా ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా దేశానికే తలమానికంగా నిలిచే హైస్పీడ్ రైలింజన్, బోగీల తయారీ కర్మాగారాన్ని విశాఖపట్నంలో నెలకొల్పేందుకు సాడ్లర్ రైల్వే మేనేజిమెంట్ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్ వెళ్లే దారిలో జ్యూరిచ్‌లో ఆగిన బాబు బృందం స్టాడ్లర్ రైల్ మేనేజిమెంట్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. స్టాడ్లర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టన్ బిజినెస్ డెవలప్‌మెంట్ అనలిస్టు స్ట్ఫీన్ రుతిషాసర్, ప్రాజెక్టు మేనేజిమెంట్ ప్రతినిధి థామస్ జ్విఫెల్‌లతో సిఎం చర్చలు జరిపారు. తమ కంపెనీకి పోలండ్, జర్మనీ, హంగేరి, స్విట్జర్లాండ్, బెలారస్, స్పెయిన్ తదితర దేశాల్లో ఉత్పాదక సంస్థలున్నాయని పీటర్ సిఎంకు వివరించారు. తూర్పు స్విట్జర్లాండ్‌లో బుస్‌నాంగ్ ప్రాంతంలో ఉన్న స్టాడ్లర్ కంపెనీని సందర్శించాలని చంద్రబాబును కోరగా అందుకు ఆయన అంగీకరించారు. స్టాడ్లర్ రైల్ మేనేజిమెంట్ ఫ్యాక్టరీని వైజాగ్‌లో నెలకొల్పేందుకు ప్రాథమికంగా అంగీకారం కుదిరింది. వైజాగ్‌లో ఈ సంస్థ ఏర్పాటుతో కనీసం మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని సిఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బృందం స్టాడ్లర్ మేనేజిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించనుంది. భారత్‌లో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేలా హైస్పీడ్ బోగీలను అందించగలమని తెలిపారు. భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే చూడటం లేదని, వేలాది మందికి ఉపాధి కల్పించాలని యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. రైలింజన్లు, బోగీల తయారీలో ఆగ్నేయాసియాకు భారత్‌ను హబ్‌గా రూపొందించాలనేది తమ లక్ష్యమని, అల్యూమినియంతో రైలు బోగీలను తయారుచేయడం తమ ప్రత్యేకతగా చెప్పారు. విశాఖలో విడిభాగాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. సముద్రానికి దగ్గరగా ఉండటం, భూమి లభ్యత, మానవ వనరులు వంటివి అనుకూలంగా ఉన్నచోట యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాము కావలసిన వౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యుత్, నీరు, లోతైన సముద్రం వద్ద నిర్మించిన ఓడరేవులు, సుదీర్ఘ సముద్ర తీరం తమకు ఉన్నాయని చెప్పారు. తమ రాష్ట్రం దేశానికి గుండెకాయలా ఉందన్నారు. ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూలతలపై ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో తాము నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. తొలి అర్ధ సంవత్సరంలో వృద్ధిరేటు 12 శాతం సాధించామన్నారు. తగినంత భూమి బ్యాంక్ ఉందని కూడా చంద్రబాబు వివరించారు.
అనంతరం చంద్రబాబు యురోపియన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి కౌన్సిల్ అధికారులతో సమావేశం అయ్యారు. జర్మనీకి చెందిన ఈ సంస్థను విజయవాడకు చెందిన వంగపండు వెంకటనాగరాజు స్థాపించారు. విద్య, సౌర విద్యుత్, నిర్మాణ రంగాలకు సంబంధించి ఈ సంస్థతో ఒప్పందం కుదిరింది. శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా యూనివర్శిటీ, నాగార్జున వర్శిటీలతో కలిసి పనిచేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది.
వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనం తయారుచేయడంలో ముందున్న జర్మనీ కంపెనీ బామ్ గరేట్ కంపెనీ బాయిలర్లను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో ఖ్యాతిగడించింది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.
అనంతరం సిఎం బృందం ట్రిటెక్ ప్రతినిధులతో సమావేశం అయ్యింది. దోమల తెరలు తయారు చేయడంలో ముందున్న తాము ఆంధ్రాలో కంపెనీని స్థాపించి అక్కడి నుండి పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు ఎగుమతులు చేసే యోచనలో ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ట్రిటెక్ కంపెనీ 5వేల చదరపుఅడుగుల భూమిని ఇస్తే తమ ఉత్పాదక సంస్థను నెలకోల్పుతామని పేర్కొంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభిస్తుంది.
ఇంటర్నేషనల్ మేనేజిమెంట్ సంస్థ, బికెడబ్ల్యు ఎనర్జీ, కెమ్‌జినీరింగ్ గ్రూప్, రాతకొండ ఎనర్జీ సిస్టమ్స్, డ్యూర్ టెక్నాలజీ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ గాలన్ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి సమన్వయంగా పనిచేయడానికి ముందుకు వచ్చిందని. ఈ విశ్వవిద్యాలయం టెక్నాలజీ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు దోహదపడుతుంది. మరో పక్క స్విట్జర్లాండ్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగే ఏరోస్పేస్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని సిఎంకు ఆహ్వానం అందింది. బికెడబ్ల్యు గ్రూప్ ప్రతినిధులు జలవిద్యుత్ ఉత్పాదక సాంకేతిక పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. గెర్జి కార్పొరేషన్ ప్రతినిధులు రెండు వేల కోట్ల మేర పెట్టుబడులకు ఆసక్తిని కనబరిచారు. మరో పక్క రాతకొండ ఎనర్జీ సిస్టిమ్స్ సంస్థ 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో సాడ్లర్ రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని సందర్శించిన బాబు బృందం