తెలంగాణ

ఏసిబికి పట్టుబడి.. అంతలోనే ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 21: బిల్లులు మంజూరు చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ను డబ్బులు డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నిజామాబాద్ నగర పాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు (56), అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎసిబి కస్టడీలో ఉన్న సమయంలోనే, తదుపరి విచారణ కోసం అతని నివాస గృహానికి తీసుకెళ్లినప్పుడు ఐదంతస్తుల భవనం పైనుండి కిందకు దూకి బలవన్మరణం చెందాడు. ఎంఇ వెంకటేశ్వర్లు మృతికి ఎసిబి డిఎస్పీ, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మున్సిపల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
నగర పాలక సంస్థ పరిధిలోని ఆయా డివిజన్లలో కోటి 20 లక్షల రూపాయలతో డ్రైనేజీల నిర్మాణాల కోసం ఇటీవల టెండర్లు పిలవగా, నర్సింగ్‌పల్లికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ రాములు టెండర్‌ను దక్కించుకున్నాడు. నిర్దేశించిన పనిలో మొదటి విడతగా 20 లక్షల రూపాయల విలువ చేసే పనులను పూర్తి చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలంటే తనకు 25 వేల రూపాయల ముడుపులు ముట్టజెప్పాలని ఎం.ఇ వెంకటేశ్వర్లు తనను డిమాండ్ చేస్తున్నారంటూ కాంట్రాక్టర్ రాములు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. చివరకు 20 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడని వారి దృష్టికి తెచ్చాడు. దీంతో ఎం.ఇ అవినీతిని బట్టబయలు చేసేందుకు ఎసిబి అధికారులు వ్యూహం రూపొందించారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం కాంట్రాక్టర్ రాములు నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో గల సత్యం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఎం.ఇ వద్దకు వెళ్లి 20 వేల రూపాయలను అందజేశాడు. ఆ మొత్తాన్ని ఎంఇ బీరువాలో దాచిన వెంటనే, అక్కడే కాపుకాసి ఉన్న ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డి తన సిబ్బందితో మెరుపుదాడి చేశారు. బీరువాలో దాచిన లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని ఎంఇ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అతనిని నగర పాలక సంస్థ కార్యాలయానికి తీసుకువచ్చి, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఎంఇని అతను నివాసం ఉంటున్న సత్యం అపార్ట్‌మెంట్ వద్దకు తీసుకెళ్లారు.
ఆ సమయంలో ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డి వెంట వెళ్లకుండా, ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే పంపించినట్టు తెలిసింది. ఎం.ఇ వెంకటేశ్వర్లు ఏడాదిన్నర క్రితం నిజామాబాద్‌కు బదిలీపై రాగా, ఆయన కుటుంబీకులు మాత్రం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోనే నివాసం ఉంటున్నారు. ఎంఇ వెంకటేశ్వర్లు నిజామాబాద్‌లో ఒంటరిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంఇ నివాసం ఉంటున్న ఐదవ అంతస్తులోకి అతనిని తీసుకుని వెళ్లిన కొద్దిసేపటికే, వెంట వచ్చిన ఎసిబి సిబ్బందిని ఏమార్చి తన బెడ్‌రూమ్‌లో గల బాల్కనీ నుండి కిందకు దూకేశాడు. దీంతో తలకు, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలు తగిలి వెంకటేశ్వర్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఊహించని రీతిలో చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న సిబ్బంది కొద్దిసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఈ సమాచారం తెలుసుకున్న మున్సిపల్ ఉద్యోగులు, పలువురు కార్పొరేటర్లు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ఎసిబి కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై కావాలనే కుట్రపూరితంగా ఎంఇని కేసులో ఇరికించారని, ఈ అవమానాన్ని భరించలేక సదరు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యుడిగా పరిగణిస్తూ ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, అతనిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాత్రి 8 గంటల వరకు కూడా ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిజామాబాద్ ఎసిపి ఆనంద్‌కుమార్ పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో జిల్లా ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు.
chitram...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్
ఇంజనీర్ గురించి వివరాలు వెల్లడిస్తున్న
ఏసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డి