రాష్ట్రీయం

అందరికీ నీటిభద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రాబోయే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అందరికీ నీటి భద్రత కల్పిస్తే ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం కల్పించడం పెద్ద కష్టం కాదన్నారు. విజయవాడ ఉండవల్లిలో తన నివాసం నుంచి సోమవారం నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరే కీలకం అంటూ, అందుకే నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రతి ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.40 వేల కోట్లతో పోలవరం, రూ.30వేల కోట్లతో నదుల అనుసంధానం చేస్తూనే నీరు-ప్రగతి కింద అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం గుర్తుచేశారు. పంట సంజీవని కింద ఏప్రిల్ నెలాఖరుకు రాష్ట్రంలో 4 లక్షల పంట కుంటల తవ్వకం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు 2,40,444 పంట కుంటల తవ్వకం పూర్తయిందని అధికారులు వివరించగా, ఫిబ్రవరి నెలాఖరుకు 2.50 లక్షల పంట కుంటల తవ్వకం పూర్తికాగానే పెద్ద ఉత్సవం జరపాలన్నారు. ఒక రాష్ట్రంలో 4 లక్షల పంట కుంటల తవ్వకం దేశంలోనే రికార్డుగా పేర్కొంటూ దీన్ని వేడుకగా జరపడం ద్వారా ప్రజల్లో నీటి విలువను తెలియజెప్పాలన్నారు.
అన్ని గ్రామాలను ఆకర్షణీయంగా రూపొందించాలని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సిమెంటు రోడ్లు, డ్రెయిన్లు, వర్మీకంపోస్టు పిట్లు, స్మశానాలు, ఆట స్థలాల అభివృద్ధి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మార్చి నెలాఖరుకల్లా పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణాజిల్లాలను బహిరంగ విసర్జన రహిత (ఓడిఎఫ్) జిల్లాలుగా ప్రకటించాలన్నారు. పంట కుంటల వేడుకలతోపాటు 3 జిల్లాల ఓడిఎఫ్ ఉత్సవాన్ని కూడా నిర్వహించాలన్నారు. ఘన వ్యర్ధాల తొలగింపు, వర్మీకంపోస్టు తయారీలో గ్రామస్థులను చైతన్యపరచాలని, మార్క్‌ఫెడ్‌ను భాగస్వామిగా చేసి కేంద్రం అందించే సబ్సిడీని అన్ని గ్రామాలు వినియోగించుకోవాలని సూచించారు. టన్నుకు రూ.1500 సబ్సిడీ అందిస్తున్న విషయం గుర్తుచేశారు. అంతర్గత రోడ్లతోపాటు ఆయా గ్రామాలను కలిపే కనెక్టింగ్ రోడ్లు కూడా సిమెంటు రహదారులుగా నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారు. గ్రామాల నుంచి అప్రోచ్ రోడ్లకు దారితీసే రహదారులను సిమెంట్ కాంక్రీట్ రోడ్లుగా నిర్మించాలని చెప్పారు. సిసి రోడ్ల నిర్మాణం 4,200 కిమీ పూర్తయిందని, మిగిలిన లక్ష్యం 800 కిమీ వెంటనే పూర్తిచేయాలని కోరారు. నరేగా నిధులు రూ.5,700 కోట్లు పూర్తిగా ఖర్చుచేయాలని, రానున్న 5 వారాల్లో మిగిలిన రూ.1300 కోట్లు కూడా వ్యయం చేయాలని చెప్పారు. వచ్చే ఏడాది మన రాష్ట్రానికి మంజూరయ్యే రూ.7వేల కోట్లు నరేగా నిధులను కూడా సకాలంలో ఖర్చుపెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో రోజుకు 50వేల మంది పైగా నరేగా పనుల్లో ప్రజలు ఉపాధి పొందుతున్న విషయం ప్రస్తావించి గుంటూరు జిల్లా ఇందులో వెనుకబడి ఉండటం సరికాదన్నారు. నిధుల సమీకరణపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు.