రాష్ట్రీయం

త్వరలో ఎంబిసిడిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీసీ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే విడిగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంబిసిడిసి) ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎంబిసిల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ప్రగతి భవన్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కుల సంఘాల ప్రతినిధులతో సిఎం చర్చించారు. స్వాతంత్రం వచ్చి ఇనే్నళ్లయినా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసినప్పటికీ వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయని, ఈ కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర బీసీ కులాల అభివృద్ధికి కార్యక్రమాలు అమలు చేస్తూనే, ఎంబిసిల కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని వెల్లడించారు.
‘ఎంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉద్యమ సమయంలో చెప్పినట్టు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది. సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవించాలి. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ సాయం లేక కుల వృత్తులు క్షీణించి, కొన్ని కులాలు కుటుంబాలు చితికిపోయాయి. వారికి ఆర్థికంగా, రాజకీయంగా చేయూత అందక చీకట్లో మగ్గుతున్నారు. బీసీల్లో భాగంగానే ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన కులాలను ఎవరు పట్టించుకోలేదు. అలాంటి కులాలను గుర్తించి ప్రతీ కుటుంబ ఆర్థిక అవసరాల మేరకు ప్రభుత్వం చేయూత అందించడం కోసమే ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం’ అని సిఎం అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో ప్రతీ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేయడానికి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే గురుకుల విద్యాసంస్థలలో తమ పిల్లలను చేర్పించాలని సిఎం సూచించారు.
మాలో ఆత్మ విశ్వాసం పెరిగింది
అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని ఎంబిసి జాతీయ అధ్యక్షుడు కాళప్ప, ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు అన్నారు. ప్రభుత్వం అందించబోయే చేయూతతో ఎంబిసిల తలరాత మారబోతుందన్నారు. ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేసి, ఆయనతోనే సమస్యలు చెప్పుకోవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. ఇంకా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సగర సంఘం బంగారు నర్సింగ సాగర్, వడ్డెర సంఘం అధ్యక్షుడు ఎత్తడి అంతయ్య, వంశరాజు (పిచ్చకుంట్ల) సంఘం అధ్యక్షుడు సత్యం, ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రవిశంకర్, కుమ్మరి సంఘం అధ్యక్షుడు శంకర్, జల్ల మార్కెండేయులు తదితరులతో ఆరున్నర గంటలపాటు చర్చించారు.