రాష్ట్రీయం

సభలో రెయిన్..గన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 20: శాసనసభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు రెయిన్‌గన్స్‌ను ఆరోపణాస్త్రంగా సంధించారు. రాయలసీమ ప్రాంతంలో కరవును అధిగమించేందుకు ప్రభుత్వం నిరుడు రెయిన్‌గన్స్‌ను ప్రవేశపెట్టింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం దీనిపై వివరణ ఇచ్చారు. అయితే కరవు పేరుతో ఇందులో అవినీతి జరిగిందనే అనుమానాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి 20న రెయిన్‌గన్స్ ఆపరేషన్స్, నిర్వహణ ఖర్చుల కింద 123కోట్ల రూపాయలు 103కోట్ల నిధుల విడుదలకు జీవో విడుదల చేసిందని, అయితే కేవలం 12కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, దీనిపై సిఎం వివరణ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ ప్రతిపక్ష నేత ఆరోపణలు నిజం కాకపోతే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. నిజం ఉంటే మీరు చెప్పిన పనిచేస్తానని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జీవోలో తప్పుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. కాగా, అది ఆమోదం కోసం జారీ చేసిన జీవో అని, అందులో తప్పులుంటే ఏ సవాల్‌కైనా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ సభను పక్కదారి పట్టించే అలవాటు బాబుకే ఉందన్నారు. గతంలో వైఎస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి చర్చించినప్పుడు తప్పుడు లెక్కలు మాకు అలవాటే అని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించి జారీచేసిన జీవోలో కూడా 620 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి 472.94 కోట్లు ఖర్చు చేసిందని, బిసి సంక్షేమ శాఖ బడ్జెట్‌లో 4066 కోట్లకు గాను 2843 కోట్లు ఖర్చయ్యాయని, అదేమంటే సవరించిన అంచనాలని దాటవేస్తున్నారని జగన్ విమర్శించారు. దీనిపై మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఆర్థిక మంత్రి యనమల తీవ్రంగా స్పందించారు.
* సభను పక్కదారి పట్టిస్తున్నారు:మంత్రి పల్లె
అవగాహనా రాహిత్యంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభను పక్కదారి పట్టిస్తున్నారని మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. వైఎస్ హయాంలో 38కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం 718 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇది ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువని చెప్పారు.
* బిసిల సంక్షేమాన్ని వైఎస్ నిర్వీర్యం చేశారు:మంత్రి కొల్లు
వైఎస్ హయాంలో బలహీనవర్గాల సంక్షేమాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అప్పట్లో 70 కోట్లు ఖర్చుపెడితే తమ ప్రభుత్వం 750 కోట్లు ఖర్చుచేసిందని తెలిపారు. సబ్‌ప్లాన్ కింద 2014-15కు 6400 కోట్లు, గత ఏడాది 8322 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 10వేల కోట్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. స్కాలర్‌షిప్‌ల బకాయిల చెల్లింపు వల్ల ఖర్చులో వ్యత్యాసం సహజమన్నారు.
* అవగాహనా రాహిత్యం: మంత్రి యనమల
ప్రభుత్వానికి సంబంధించి బడ్జెటరీ మేనేజిమెంట్ సిస్టం ఉంటుందని, దీనిపై ప్రతినెలా మూడు నెలలకోసారి సమీక్ష ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రతిపక్ష నేత ఏదీ తెలుసుకోకుండా సభకు వచ్చి బురదజల్లే కార్యక్రమానికి స్వస్తిచెప్పాలన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లెక్కలు తెలీటంలేదని యనమల చురకలంటించారు. మొదట అంచనాలు రూపొందిస్తారని, ఆపై సవరణలు, ఖర్చులు ఉంటాయని వివరించారు. ఆర్ ఇ అంటే రీఎస్టిమేషన్స్ తప్ప రీఎక్స్‌పెండిచర్ కాదనేది జగన్ గుర్తించాలన్నారు.
కాగా, కాపు కార్పొరేషన్ లెక్కలు తీస్తున్న జగన్ వైఎస్ హయాంలో కాపులను బిసిలలో చేర్పించేందుకు అవసరమైన సర్వే నిర్వహించటానికి 45 లక్షలు ఎందుకు కేటాయించలేదో వివరించాలని డిప్యూటీ సిఎం చినరాజప్ప సవాల్ విసిరారు.
* ఆయనవన్నీ తప్పుడులెక్కలే:మంత్రి ప్రత్తిపాటి
రెయిన్ గన్స్ జీవోలపై అవగాహన రాహిత్యంతో తప్పుడు లెక్కలతో సభను జగన్ పక్కదారి పట్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మంత్రుల కౌంటర్ కారణంగా జగన్‌కు మైకు ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష వైసిపి సభ్యులు అసహనంతో స్పీకర్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.