రాష్ట్రీయం

క్రేన్ సంస్థల అధినేత గ్రంధి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 24: ‘ఆరామ్ హరామ్ హై, పహలే కామ్ బాద్ మే ఆరామ్, కరో పహలే కహో పీచే’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను తన జీవితానికి ఆలంబనంగా చేసుకుని తనకోసం కాకుండా చుట్టూ ఉన్న సమాజం కోసం ఎంతో కొంత మేలు చేయాలనే తపన, ఆరాటంతో క్రేన్ సంస్థను స్థాపించి, వక్క పలుకులతో గుంటూరు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింపజేసిన క్రేన్ సంస్థల అధినేత గ్రంధి సుబ్బారావు(86) అస్తమించారు. శుక్రవారం తెలతెలవారుతుండగా సుబ్బారావు తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సుబ్బారావుకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. ఇంతకాలం, తమకింత అన్నంపెట్టి, ఉపాధి కల్పించి, తమ కుటుంబాల్లో వెలుగులు ప్రసరింపజేసిన తమ ఆరాధ్యదైవం, యజమాని ఇకలేడన్న వాస్తవాన్ని వందలాది మంది క్రేన్ ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి బోరున విలపించారు. 1931 ఫిబ్రవరి 14వ తేదీన గుంటూరుకు 10 మైళ్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం కొర్నెపాడులో గ్రంథి లక్ష్మీకాంతం, రంగనాయకమ్మల రెండవ సంతానంగా జన్మించిన గ్రంధి సుబ్బారావు స్వయంకృషి, పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో వక్క పలుకులను ఇంట్లోనే తయారు చేసుకుని భుజాన ఆ సంచులను వేసుకుంటూ మంగళగిరి తదితర ప్రాంతాల్లో అమ్మేవారు.
వక్క పలుకుల రుచిని అందరి ఇంట అందించాలనే లక్ష్యంతో గుంటూరు నగరంలోని సంపత్‌నగర్ ప్రాంతంలో క్రేన్ సంస్థను ఆయన స్థాపించారు. సంస్థ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు వక్క పలుకుల తయారీలోనూ, ఎగుమతుల్లోనూ ఈ సంస్థదే అగ్రస్థానం. తన ఆరాధ్యదైవమైన తిరుపతి వేంకటేశ్వర స్వామిని అవకాశం వచ్చినప్పుడుల్లా సందర్శించుకునే సుబ్బారావు దేశంలోని అనేక సత్రాలు, ఆశ్రమాలు, ఆధ్యాత్మికమఠాలు..కేంద్రాలకు, అనేక విద్యాసంస్థలకు భూరి విరాళాలను అందజేశారు. అయ్యప్పలకు అన్నదానం చేయడంలో ఆయనదే పైచేయి.
కృష్ణా, గోదావరి పుష్కరాల్లో లక్షలాది మందికి ఆయన అన్నదానం చేశారు. సంపత్‌నగర్‌లోని క్రేన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో శుక్రవారం ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పలువురు పుష్పమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఆయన కుమారుడు ప్రస్తుతం క్రేన్ సంస్థల అధినేత అయిన గ్రంధి లక్ష్మీకాంతారావును, కుటుంబ సభ్యులను ప్రముఖులంతా పరామర్శించి ప్రగాడ సానుభూతిని తెలిపారు. అపరదారకర్ణుడని సుబ్బారావును కొనియాడారు. సుబ్బారావు తన ధర్మపత్ని అయిన దివంగత లక్ష్మీనరసమ్మ పేరిట ఎన్నో ఆలయాలకు, ధార్మిక సంస్థలకు లెక్కకు మిక్కిలిగా దానధర్మాలు చేశారని, అలాంటి వ్యక్తి ఆరుదుగా మనకు కనిపిస్తారని ప్రముఖులు అంజలి ఘటించారు.
నేడు అంత్యక్రియలు...
తొలి నుంచి శ్రీమన్నారాయణుడి పట్ల భక్తివిశ్వాసాలు కనబర్చే గ్రంధి సుబ్బారావు వైష్ణవ ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించేవారు. తానే కాకుండా కుటుంబ సభ్యులందరి చేత నిత్యం లక్ష్మీనారాయణ కైంకర్యం చేయించేవారు. ఆయన మనోభీష్టానికి అనుగుణంగా శనివారం ఉదయం 8 గంటలకు సుబ్బారావు పార్థివ దేహాన్ని రామనామక్షేత్రానికి సమీపంలో ఉన్న స్వగృహానికి తరలించి, జీయర్ సంప్రదాయానికి అనుగుణంగా ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారని, అనంతరం ఊరేగింపుగా శ్రీనివాసరావుపేట శ్మశానవాటికకు తరలించి సరిగ్గా 12.30 గంటలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు శుక్రవారం విలేఖర్లకు తెలిపారు.
సిఎం చంద్రబాబు విచారం
విజయవాడ: గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, క్రేన్ సంస్థ అధినేత గ్రంధి సుబ్బారావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గ్రంథి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. సుగంధ పరిమళాలతో కూడిన వక్కపొడిని తెలుగిళ్లకు ఆత్మీయంగా మార్చి ఖండాంతరాలకు వ్యాపింపచేసిన గ్రంథి వర్తక, వాణిజ్య వ్యాపారులకు స్ఫూర్తిదాయకమని సిఎం నివాళి అర్పించారు.