రాష్ట్రీయం

తెగని పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా జరగాల్సిన పంపకాలపై రాజ్‌భవన్‌లో ఆదివారం సమావేశమైన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఈ దఫా కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతూండటంతో విభజన సమస్యలపై దృష్టి సారించలేకపోయినట్టు మంత్రులు గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. శాసనసభ సమావేశాలు ముగిశాక వచ్చే నెల 17న సమావేశమై కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటామని వారు గవర్నర్‌కు హామీ ఇచ్చారు. కాగా ఆదివారం జరిగిన భేటీలో విద్యుత్ శాఖ ఉద్యోగుల పంపిణీ, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కార్యాలయాల అప్పగింత అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. విద్యుత్ శాఖలో ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన ఉద్యోగులు 1290 మంది ఉండగా, వీరిని ఆ రాష్ట్రానికే కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తమను ఏపీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో ఉండటంతో మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. వచ్చే 17న జరిగే సమావేశానికల్లా కోర్టు కేసు ముగిసే అవకాశం ఉండటంతో ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకుందామని మంత్రుల కమిటీ నిర్ణయించింది. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కార్యాలయాలతోపాటు ఆ రాష్ట్ర శాసనసభ అమరావతికి తరలిపోవడంతో వాటిని తమ ప్రభుత్వానికి అప్పగిస్తే వినియోగించుకుంటామని తెలంగాణ మంత్రుల కమిటీ గవర్నర్‌కు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై మంత్రుల కమిటీ చేసిన ప్రతిపాదనపై తాము చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని, తమ ముఖ్యమంత్రితో చర్చించి వచ్చే సమావేశానికల్లా నిర్ణయం ప్రకటిస్తామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన కార్యాలయాలను ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసిందని, అయితే వాటిని శుభ్రపరిచే సిబ్బంది లేక పాడుబడి పోతున్నాయని, వినియోగించుకోకపోయినా పన్ను, విద్యుత్, నీటి బిల్లులను చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని తెలంగాణ మంత్రుల కమిటీ వివరించింది. ఈ అంశంపై చర్చిస్తున్నామని, వచ్చే సమావేశానికల్లా అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఎపి మంత్రుల కమిటీ వెల్లడించింది. ఇప్పటివరకు మూడుసార్లు ఇరు రాష్ట్రాల విభజన కమిటీ సమావేశమై ప్రధాన సమస్యలపై ప్రాథమికంగా చర్చించామని, వచ్చే సమావేశానికల్లా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ కమిటీ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు వివేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ సమక్షంలో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల శాసనసభ సమావేశాలు కొనసాగుతుండటంతో అవి ముగిసిన తర్వాత తిరిగి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.