రాష్ట్రీయం

శానిటరీకి చెదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 28: కిశోర బాలికలు నెలసరి రుతుక్రమ సమయంలో వినియోగించే లక్షలాది శానిటరీ నేప్‌కిన్లు అధికారులను ఇరకాటంలో పడేస్తున్నాయి. అమ్మమంటే అడవి.. కొనమంటే కొరివి అన్న చందంగా మార్గదర్శకాలు ఉన్నాయని అధికార్లు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు ఏడాదిగా ఈ ‘శానిటరీ’ స్టోరీ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రీయ కిశోర్ స్వచ్ఛ కార్యక్రమం కింద కిశోర బాలికల కోసం కేంద్రం లక్షలాది శానిటరీ నేప్‌కిన్లను రాష్ట్రాలకు పంపించింది. కేంద్రం నుంచి అందిన నేప్‌కిన్లను పేద యువతులకు ఉచితంగా ఇవ్వాలో? విక్రయించాలో? అర్థంగాక వైద్య ఆరోగ్య శాఖ వాటిని చాలాకాలం మూలన పడేసింది. ఒక్క విశాఖ జిల్లాలోనే దాదాపు పది లక్షల శానిటరీ నేప్‌కిన్లు పిహెచ్‌సి, జిల్లా కేంద్రాల్లోని వైద్య ఆరోగ్యశాఖ గోదాముల్లో వృధాగా పడివున్నాయి. అంటే రాష్టవ్య్రాప్తంగా ఎన్ని నేప్‌కిన్లు గోదాముల్లో మూలుగుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. అసలు విషయానికొస్తే.. ఆర్‌కెఎస్‌కె పథకం కింద కిశోర బాలికలు రుతుక్రమ సమయంలో వినియోగించే శానిటరీ నేప్‌కిన్లను నేషనల్ హెల్త్ మిషన్ పంపిణీ చేసింది. గత ఏడాది జూన్‌లో వీటిని రాష్ట్రాలకు పంపించారు. ఒక్కో ప్యాకెట్‌లో ఎనిమిది శానిటరీ నేప్‌కిన్లు ఉన్నాయి. ఇలాంటి ప్యాకెట్‌లు విశాఖ జిల్లాకు దఫదఫాలుగా 12 లక్షల వరకూ అందాయి. వీటిలో ఏడు లక్షల ప్యాకెట్లను ఆయా పిహెచ్‌సిలకు పంపించారు. ప్యాకెట్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- నాట్ ఫర్ సేల్ అని రాసి ఉంది. అంటే కేంద్రం పంపిన ప్యాకెట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర వేసుకుందా? లేక కేంద్రమే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ప్యాకెట్లపై ఇలా ముద్ర వేసిందో అధికారులకు అర్థం కాలేదు.
ప్యాకెట్లను జిల్లా కేంద్రాలకు సరఫరా చేసిన చాలారోజుల తరువాత, ఒక్కో ప్యాకెట్‌ను ఎనిమిది రూపాయలకు విక్రయించాలంటూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటికే కొన్ని ప్యాకెట్లను అమ్మాయిలకు ఉచితంగా అందించేశారు. ఆ తరువాత కేంద్రం మార్గదర్శకాలను చూసి నాలుక కరచుకున్న అధికార్లు, ఒక్కో ప్యాకెట్‌ను రూ.8కి విక్రయించాలంటూ పిహెచ్‌సిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్యాకెట్‌పై నాట్‌ఫర్ సేల్ అని ఉన్నప్పుడు నగదుకు ఎలా విక్రయిస్తారంటూ ప్రశ్నించడం మొదలెట్టారు. విశాఖ జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో చౌకగా వస్తున్నాయి కదా అని కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. జిల్లాకు 12 లక్షలు వస్తే, అందులో ఇప్పటి వరకూ రెండు మూడు లక్షలకు మించి పంపిణీ జరగలేదు.
ఇదిలావుంటే, గిరిజన ప్రాంతాల్లోని హాస్టల్ విద్యార్థినులకైనా వీటిని ఏదోవిధంగా అంటగట్టేందుకు ప్రయత్నిస్తే, వాళ్లూ ససేమిరా అన్నారు. ఈ విషయాన్ని ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ దృష్టికి చాలాకాలం కిందటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకెళ్లారు. విశాఖ ఏజెన్సీలో 60 వేలమంది హాస్టల్ విద్యార్థినులు ఉన్నారు. వీరిలో సుమారు 10 వేలమంది మాత్రమే ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు ఉంటారు. వారికి నెలకు 10 వేల నేప్‌కిన్ ప్యాకెట్‌లు కొనుగోలు చేసి ఇచ్చినా, ఐటిడిఏకు 80 వేలకు మించి ఖర్చు కాదు. అయినా ఐటిడిఏ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని అక్కడి అధికారులు చెప్పడంతో, ఈ విషయం కాస్తా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అక్కడి నుంచి కూడా సమాధానం రాకపోవడంతో గోదాముల్లో పడివున్న లక్షల నేప్‌కిన్లను ఏంచేయాలో అర్థంకాక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

చిత్రం.. కేంద్రం మంజూరు చేసిన శానిటరీ నేప్‌కిన్స్