ఆంధ్రప్రదేశ్‌

ఏడు రహదారులు ఏడు వజ్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 29: రాజధాని అమరావతి నగరంలో నిర్మించే ఏడు రహదారులు ఏడు వజ్రాలలాంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతి నగర పరిధిలోని 29 గ్రామాలను కలుపుతూ సుమారు 1050 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఏడు ప్రాధాన్యతా రహదారులకు ఉగాది పర్వదినమైన బుధవారం గుంటూరు జిల్లా మంగళగరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి ఈ సప్త రహదారులు పూర్తవుతాయని, వీటికి ఆకర్షితులై ఎంతోమంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు పరిశ్రమలు కూడా వస్తాయన్నారు. 50మీటర్ల వెడల్పుతో 66.85 కీమీ పొడవునా నిర్మించే ఈ రహదారులు కొన్ని నాలుగులేన్లు, మరికొన్ని ఆరు లేన్లు, అవసరమైతే విస్తరించేందుకు వీలుగా నిర్మిస్తామన్నారు. ఇంద్రధనుస్సులో ఉండే రంగుల మాదిరిగా అమరావతి గ్రీన్ సిటీలో ఈ ఏడు రహదారులను నిర్మిస్తామన్నారు. ఈ ఏడు రహదారులు చూశాక అమరావతి నగరం ఏ రకంగా ఉండబోతోందో ప్రజలకు ఒక అవగాహన వస్తుందన్నారు. ఈ ప్రాంతం ఎంతో చరిత్ర కలిగిందని, 2200 సంవత్సరాల కంటే ముందే గౌతమీపుత్ర శాతకర్ణి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి దేశ విదేశాలకు విస్తరింపచేశాడన్నారు. దేశంలో ఎవరికీలేని వారసత్వ సంపద తెలుగు వారి సొంతమన్నారు. రాజధాని ఇక్కడకు రావటం ఒక చరిత్రైతే అదృష్టం మీ అందరిదీ అన్నారు. విభజన జరిగాక రాజధాని ఇక్కడకు వస్తుందని మూడేళ్ల క్రితం ఎవరికీ ఆలోచనకూడా లేదని, చాలామంది వేరేప్రాంతం కావాలని రెచ్చగొట్టారని, రాజధాని ఎక్కడో చెప్పకుండా రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేసిన దుర్మార్గమన్నారు. తనకు స్వార్థం ఉండి ఉంటే చిత్తూరు జిల్లాలో 10వేల ఎకరాల భూమి ఉందని, అక్కడే రాజధాని కట్టి ఉండేవాడినన్నారు. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఉంటే ప్రజలందరికీ సమాన దూరంలో ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ప్రపంచంలోనే మొదటి పది నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతానని, ఇండియా అంటే అమరావతి గుర్తొచ్చే విధంగా అభివృద్ధి ఉంటుందని, ఈ నగరంలో 9ప్రత్యేక సిటీలు నిర్మిస్తున్నామన్నారు. ఆర్థిక, పరిపాలన, జస్టిస్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మీడియా అండ్ కల్చరల్ సిడీ, హెల్త్‌సిటీ, నాలెడ్జ్ సిటీ ఇవన్నీ అమరావతి నగరంలో ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు కావాల్సిన సకల సౌకర్యాలు ఉండే విధంగా అమరావతి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద రింగ్‌రోడ్ 182కిమీ పొడవున నిర్మిస్తున్నామని, అమరావతికి ఆరు జాతీయ రహదారులు అనుసంధానంగా ఉంటాయన్నారు. అమరావతి నుండి అనంతపురం వరకు సూపర్ హైవే తయారవుతుందన్నారు. ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక రైతులు కొందరు భూ సమీకరణకు భూములివ్వలేదని, అందరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, స్పీకర్ కోడెల, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వేదికపై రైతు మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ వెండి కిరీటంతో చంద్రబాబును సత్కరించారు. పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

చిత్రం... ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెండి కిరీటం బహూకరిస్తున్న దృశ్యం