రాష్ట్రీయం

ఘాటెక్కిన మిర్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో మిర్చి పంట అన్నదాత పుట్టిముంచుతోంది. పంట బాగా పండిందనే ఆనందం రైతుల్లో క్షణమైనా కనిపించకుండా పోయింది. పంట ఎక్కువగా పండటమే పాపమైనట్టుగా ధర సగానికి సగం పడిపోవటంతో మిర్చి ఘాటు రైతుకెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంట చేతికి వచ్చిన తరువాత ధర పడిపోవడంతో మిర్చి రైతుల్లో ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. విపక్షాల నేతలు ఈ ఆందోళనలకు బాసటగా నిలుస్తున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్నా, కేంద్రానికి లేఖలు రాశామని మంత్రులు ఉద్ఘాటిస్తున్నా వాస్తవంగా మార్కెట్లలో పరిస్థితి రోజురోజుకూ కునారిల్లుతోంది. వరంగల్, మహబూబాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.
నిరుడు క్వింటాల్‌కు 12వేల రూపాయల ధర పలికిన మిర్చికి ఇప్పుడు 5వేల రూపాయలు దొరకటం కూడా గగనమైపోయింది. రాష్ట్రంలో ఈ సంవత్సరం 174588.25 మెట్రిక్ టన్నుల మిర్చి పంట పండింది. దీనికి మద్దతు ధర క్వింటాలుకు ఏడు వేల రూపాయలు ఇప్పటికే ప్రకటించారు. కానీ, కొనుగోళ్లు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మిర్చి కొనుగోలుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. త్వరలోనే కొనుగోలు ప్రారంభించనున్నట్టు కూడా మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. కానీ, రైతులకు ఈ ప్రకటనలు ఊరటనివ్వటం లేదు. కేంద్రం ఎప్పుడు స్పందిస్తుందో.. ఎప్పుడు కొనుగోళ్లు మొదలవుతాయో తెలియని పరిస్థితిలో మిర్చి రైతాంగం అల్లాడిపోతోంది.
ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్ రూరల్ పరిధిలోని నర్సంపేట, పరకాల, భూపాలపల్లి జిల్లాలోని ములుగు లో ప్రధానంగా మిర్చిపంటను వేస్తారు. నిరుడు మిర్చి పంటకు వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంచిధర లభించింది. నాణ్యమైన పంటకు 12వేల నుంచి 14వేల వరకు ధర పలికింది. దీంతో ఈసారి కనీసం 10వేల రూపాయలైనా గిట్టుబాటు లభిస్తుందనే ఆశతో అధిక విస్తీర్ణంలో మిర్చిపంటను ఎంచుకున్నారు. నూటికి నూరు శాతం అధికంగా 80నుంచి లక్ష ఎకరాల వరకు మిర్చి విస్తీర్ణం పెరిగింది.
మార్కెట్‌లో కనీస మద్దతు ధర ఏడువేల రూపాయల వరకు కొనుగోలు చేయాలని అధికారికంగా చెప్తున్నా ఆ మొత్తం రైతులకు అందటం లేదు. మార్కెట్‌కు వస్తున్న మొత్తం పంటలో 10శాతం పంటకు మాత్రమే ఐదునుంచి ఏడువేల వరకు ధర లభిస్తోందని రైతులు చెప్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-నామ్ విధానం వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డుకు వర్తింప చేసినా అది అమలు కావటం లేదు.
మార్కెట్ సెస్ కింద రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డుల వద్ద నిలువ ఉన్న వందల కోట్ల రూపాయలను తాత్కాలికంగా మార్క్‌ఫెడ్‌కు మళ్లించి రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ప్రభుత్వం చెప్తున్నట్లు మద్దతు ధరకు మిర్చిని కొనుగోలు చేసేంతవరకైనా తమ పంటను కోల్డ్‌స్టోరేజ్‌లో నిలువ చేసుకునే అవకాశమూ దక్కటం లేదు. వ్యాపారులు, దళారులే తాము కొనుగోలు చేసిన మిర్చిని రైతుల పేరుతో కోల్డ్‌స్టోరేజీని ఆక్రమించుకుని నిలువ చేసుకుంటున్నారు.
మహబూబాబాద్ మార్కెట్‌లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ఇస్తున్న ధర, ఆ మిర్చిని ఏరే కూలీలకు కూడా గిట్టుబాటు కావడం లేదు. క్వింటాల్ మిర్చి రూ.3వేల నుండి రూ.4వేల వరకే ధర పలకుతుంది. మిర్చిని ఏరినందుకు రైతులు కూలీలకు క్వింటాల్‌కు రూ.1300 నుండి రూ.1400 చెల్చించాల్సి ఉంటుంది. ఇక్కడ మార్కెట్‌లో అత్యధికంగా లెక్కలు వేసుకున్నా నాలుగు వేలు దక్కట్లేదు. అంటే రైతుకు మిగిలేది కేవలం క్వింటాల్‌కు రెండున్నర వేలన్న మాట. నిరుటితో పోలిస్తే కనీసం పదిశాతం కూడా మద్దతు ధర లేదు. ధర అమాంతం పడిపోవడంతో రైతులకు మహబూబాబాద్ మార్కెట్‌లోనూ కోల్డ్‌స్టోరేజిలు దొరకటం లేదు. గిడ్డంగి నిర్వహకులు వ్యాపారులతో కుమ్మక్కు కావడంతో ఎక్కడ కూడా శీతల గిడ్డంగులు ఖాళీ లేవని తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రంగంలోకి దిగి మిర్చి రైతులను ఆదుకోవాలి. లేకపోతే వచ్చే ఏడాది మిర్చిపంట వేసేందుకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితులు లేవు.