రాష్ట్రీయం

నీటి బొట్టు ప్రగతికి మెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇందుకోసం నీటికుంటల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతపురం జిల్లా పామిడిలో గురువారం నిర్వహించిన ‘నీరు-ప్రగతి ఉద్యమం’ బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటి సంరక్షణ చేపట్టాలని, అందరూ సంకల్పిస్తే నీటిసంరక్షణ కష్టం కాదన్నారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భూగర్భంలో ఒక మీటరు నీరు పెంచుకుంటే 90 టిఎంసిల నీరు ఆదా అవుతుందన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలు మమేకం కావాలని, ఇందుకోసం 90 రోజుల గడువు నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇలా ముందుకు వెళితే రెండు, మూడేళ్లలో పూర్తిగా నీటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతామని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీరందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ వెడల్పు పనులు చేపడుతామన్నారు. 1272.41 కోట్ల వ్యయమయ్యే పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామన్నారు. మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వీరపాండ్యన్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌లను ఆదేశించారు. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా పంటకుంటల నిర్మాణంలో ముందున్నామని, జిల్లాలో లక్ష ఫారంపాండ్లు నిర్మించడమే లక్ష్యమన్నారు. ప్రతి రైతు ఒక పంటకుంట తవ్వుకుని తనకు జన్మదిన కానుకగా అందించాలని సిఎం కోరారు.
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యంగా పేర్కొన్న ముఖ్యమంత్రి హంద్రీనీవాకు ఇప్పటి వరకు 2050 క్యూసెక్కుల నీటిని తెచ్చామని, కాలువ వెడల్పు ద్వారా 3,800 క్యూసెక్కులు తీసుకురావచ్చన్నారు. లైనింగ్ పూర్తిచేసి 5 వేల క్యూసెక్కుల నీటిని అందిస్తామని దీనివల్ల అనంతపురం, చిత్తూరు, కడప, రాయచోటికి నీరందించడం సాధ్యమన్నారు. అనంతపురంలోని చెరువులు, కుంటలన్నింటినీ హంద్రీనీవా నీటితో నింపుతామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది అన్ని చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 వేల చెక్‌డ్యామ్‌లు పూర్తయ్యాయని, వాటిలో పాడైన వాటిని బాగు చేయడానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. మరో 20 వేల చెక్‌డ్యామ్‌లను జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్నారు.
పనిచేసి పెట్టేందుకు ఎవరైనా డబ్బు అడిగితే తనకు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. 750 మంది సిబ్బందితో కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.తన వాయిస్‌తో ఫోన్‌కాల్ వస్తుందని, పెన్షన్, ఎఫ్‌పి షాపు, చంద్రన్న బీమా, స్కాలర్‌షిప్‌లు తదితరాలపై సమాచారం అడుగుతారన్నారు. ఈ వివరాలనీ అధికారులను పంపి తక్షణం పరిష్కార చర్యలు చేపడుతానన్నారు. రాజకీయ నాయకులు తప్పు చేసినా తెలపాలని, సరిదిద్దుకుంటామని అన్నారు. అలాగే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సేవాభావం అలవర్చుకుని ప్రజలకు దగ్గరవ్వాలన్నారు. అప్పుడే ప్రజలు పార్టీని గెలిపిస్తారని సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచామని, పిఆర్‌సి ఇచ్చామన్నారు. కాబట్టి వారంతా అవినీతి రహిత, సమర్థవంతమైన పాలన అందించాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, విద్యార్థులతో నిర్వహించిన ‘నీరు-ప్రగతి ఉద్యమం’ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జల వనరుల సంరక్షణ, నీటి భద్రత, పంటకుంటల ఆవశ్యకతను వివరించారు. జల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

చిత్రం..జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న చంద్రబాబు