రాష్ట్రీయం

తెలంగాణలో కొత్తగా రెండు డిస్టిలరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో దేశీయ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్)కు డిమాండ్ పెరగడంతో డిస్టిలరీస్‌ను విస్తరించాలని, కొత్త డిస్టిలరీస్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు డిస్టిలరీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరో మూడు డిస్టిలరీలను విస్తరించేందుకు అన్ని అనుమతులు ఇచ్చారు. కొన్ని డిస్టిలరీస్‌కు అదనంగా మద్యం ఉత్పత్తిని పెంచేందుకు అనుమతులు ఇచ్చినట్లు ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలోని 18 డిస్టిలరీస్ ఉత్పత్తి కెపాసిటీ 2,019 లక్షల ప్రూఫ్ లీటర్లు. కొత్తగా ఏర్పాటయ్యే డిస్టిలరీల వల్ల 1200 ఎల్‌పిఎల్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న డిస్టిలరీస్ అదనంగా 112 ఎల్‌పిఎల్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత రెండు నెలల్లో ఎక్సైజ్ శాఖ ద్వారా అదనంగా 30 శాతం రెవెన్యూ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐఎంఎఫ్‌ఎల్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఐఎంఎఫ్‌ఎల్ మార్కెట్ తెలంగాణలో విస్తరిస్తోంది. డిమాండ్ నెలకు 16 లక్షల కేసుల నుంచి 22 లక్షలకు గత మూడు నెలల్లో పెరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నాటు సారా, గుడుంబా తయారీ తగ్గుముఖం పట్టిందని, ఎక్సైజ్ సిబ్బంది దాడుల వల్ల వీటి తయారీ గణనీయంగా తగ్గిపోయిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని ముందనుకున్న ప్రతిపాదనకు రాష్ట్రప్రభుత్వం స్వస్తి చెప్పింది.

రైళ్లలో విస్తృత తనిఖీ
హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో ఏకకాలంలో రంగంలోకి దిగిన ప్రత్యేక అధికారులు
భారీ మొత్తంలో జరిమానాలు వసూలు ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిని, రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ బోగీల్లో ఎక్కిన వారిని పట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒకే రోజు మూడు డివిజన్లలో ముప్పేట తనిఖీ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ శుక్రవారం 150 మంది తనిఖీ అధికారులు 30 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బందితో కలిసి మెరుపు తనిఖీ చేపట్టారు. పండుగ రద్దీ ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లడం ప్రారంభించారు. శని, ఆది వారాలు సెలవులు కావడంతో శుక్రవారం నుంచే రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వాళ్లు, రిజర్వేషన్ లేకున్నా రిజర్వేషన్ బోగీల్లో ఎక్కే వారిని పట్టుకునేందుకు విస్తృత తనిఖీలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, కాజిపేట, వరంగల్, ఖమ్మం, మంచిర్యాల రైల్వే స్టేషన్లలో వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టిక్కెట్ల తనిఖీ విస్తృతంగా చేశారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రవి పి.పడి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ డివిజన్‌లో 62 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 21 ప్యాసింజర్ రైళ్లు, 36 ఎంఎంటిఎస్ రైళ్లను తనిఖీ చేయగా 729 మంది టిక్కెట్ లేకుండా ప్రయాణించేవారిని, 746 మంది సక్రమంగా ప్రయాణించని వారిని, 152 లగేజీ సంబంధిత కేసులను పట్టుకున్నారు. వీరి నుంచి జరిమానా రూపంలో రూ. 8,36,210 వసూలు చేశారు.
హైదరాబాద్ డివిజన్‌లోని నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి రూ. 27,840 స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు డివిజన్‌లో చేపట్టిన తనిఖీలను తేజస్విని ఆధ్వర్యంలోని మహిళా బృందం, ఆర్‌పిఎఫ్ సిబ్బంది నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 87 కేసులను పట్టుకుని వారి నుంచి జరిమానా రూపంలో రూ. 22,995 వసూలు చేశారు. గుంతకల్లు డివిజన్‌లో డిఆర్‌ఎం బి.గోపీనాథ్ మాల్యా, సీనియర్ డిసిఎం స్వామి నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 325 కేసులు నమోదు చేశారు. వీరినుంచి రూ. 1,37,650 జరిమానా రూపంలో వసూలు చేశారు.
షాలిమార్‌కు ఆరు అదనపు సర్వీసులు
సికింద్రాబాద్- షాలిమార్ మధ్య ఆరు అదనపు సర్వీసులను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 18, 25 తేదీలలో, ఫిబ్రవరి 1న సికింద్రాబాద్ నుంచి నెం. 00849 ప్రత్యేక రైలు రాత్రి 9.40 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. షాలిమార్ నుంచి ఈ నెల 17, 24, 31 తేదీల్లో నెం. 00849 రైలు బయలుదేరుతుందని తెలిపింది. కాగా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఐదు జనసదరన్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 11న తిరుపతి నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. తర్వాత రోజు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్- సికింద్రాబాద్ మధ్య మరో రెండు సర్వీసులను ఈ నెల 12, 13 తేదీల్లో నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది. 14వ తేదీన మరో రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాకినాడ టౌన్ చేరుకుంటుంది. 14వ తేదీన మరో రైలు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి తిరుపతి వరకు నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది.