ఆంధ్రప్రదేశ్‌

అగ్నివర్షమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడురోజుల ఎండలపై హెచ్చరికలు
భయపడుతున్న కోస్తా జిల్లాల జనం
అల్లాడిపోతున్న తెలంగాణ

హైదరాబాద్/ కాకినాడ, మే 20: ఒకవైపు నైరుతీ రుతుపవనాలు పరుగులు తీస్తుంటే, మరొకవైపు ఎండలు భగ్గుమంటున్నాయి. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు 46.6 డిగ్రీల సెల్సియస్. కోస్తా జిల్లాలో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో 50 నుండి 52 డిగ్రీల సెల్సియస్‌కు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయతే భారత వాతావరణ శాఖ (ఐఎండి) చేసిన హెచ్చరికల ప్రకారం వచ్చే మూడురోజుల్లో తీవ్రమైన ఎండలు, వాడగాడ్పులు ఉంటాయి. ఎన్ని డిగ్రీల వరకు నమోదవుతాయన్న అంశంపై ఐఎండి స్పష్టంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. శనివారం నమోదైన అత్యధిక ఉష్ణోత్రలు 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. తెలంగాణలోని రామగుండం, నల్లగొండ, ఏపీలోని ఒంగోలు, బాపట్లలో 46 డిగ్రీలు నమోదైంది. అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్ పట్టణాలతో పాటు ఏపీలోని కావలి, నందిగామ, జంగమేశ్వరపురంలలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వేడిగాడ్పులు వీస్తున్నాయని, ఇవి మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి హెచ్చరించారు.
తూర్పు గోదావరి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు, ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), డిజాస్టర్ మేనేజిమెంట్ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యవసర ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి 14 మండలాలకు తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే 50 మండలాలకు ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ, సముద్ర తీరం ఉన్నందున గాలిలో అధిక తేమ కారణంగా 51 నుండి 52 డిగ్రీల స్థాయి తాపంలా అనిపించి, ప్రజలకు తీవ్రమైన ఉక్కపోత, అసౌకర్యాలు కలిగే ప్రమాదం ఉన్నట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. ఈమేరకు ఆయన జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ రానున్న 7 రోజులపాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొననున్నాయని ఇస్రో, డిజాస్టర్ మేనేజిమెంట్‌లు హెచ్చరించాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని దక్షిణాన ఉన్న తీర మండలాల్లో ప్రజలు రానున్న మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో హీట్‌వేవ్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిన టాప్-10 మండలాల్లో తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలం ఉంది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజిమెంట్ కమిషనరేట్ ప్రతి అరగంటకు ఒకసారి వాతావరణ హెచ్చరికలు జారీచేస్తోందని, అందుకనుగుణంగా అవసరమైన రక్షణ చర్యలను తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
వడగాడ్పులకు 171 మంది మృతి
తెలంగాణలో ఈ ఏడాది వడగాడ్పుల వల్ల దాదాపు 171 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర విపత్తు నిర్వహణకు సమాచారం అందింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో మృతులు ఉన్నారు. కాగా వడగాడ్పుల వల్ల మృతి చెందినట్లు నిర్ధారించేందుకు ప్రభుత్వం ఇదివరకే ముగ్గురు సభ్యులతోకూడిన కమిటీని ప్రతి మండలంలో నియమించింది. వైద్య శాఖాధికారి, ఎస్సై, రెవెన్యూ అధికారి ఈ కమిటీలో ఉన్నారు. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా వడగాడ్పుల వల్లనే మృతి చెందినట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వం ఆపద్బంధు కింద రూ. 50 వేల నష్టపరిహారం చెల్లిస్తుంది. కాగా వచ్చే వారం రోజుల పాటు తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుంది. భానుడి భగభగలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉదయం 9 గంటల నుంచే వడగాడ్పుల తీవ్రత వల్ల ప్రజా జీవనం అతలాకుతలమవుతోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, మెదక్, కొత్త గూడెం తదితర ప్రాంతాల్లో గరిష్ట స్ధాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల పశువులు, పక్షులు కూడా మృత్యువాత పడుతున్నాయి.