ఆంధ్రప్రదేశ్‌

వైకాపా నేత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 21 : కర్నూలు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పింది. మండల కేంద్రం క్రిష్ణగిరికి సమీపంలో ఆదివారం ప్రత్యర్థులు కాపు కాచి పత్తికొండ వైకాపా ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి(56), అతడి ప్రధాన అనుచరుడు సాంబశివుడు(48)లను అతి కిరాతకంగా నరికి చంపారు. వివరాల్లోకి వెళితే..కంగాటి లక్ష్మినారాయణరెడ్డి అలియాస్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆదివారం అనుచరులతో కలిసి తన స్వగ్రామం చెరుకులపాడు నుంచి వెల్దుర్తిలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడు.
అనంతరం క్రిష్ణగిరి సమీపంలోని రామకృష్ణాపురం గ్రామంలో మరో పెళ్లికి హాజరయ్యేందుకు బయల్దేరాడు. అయితే మార్గంమధ్యంలో నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టు వద్ద అప్పటికే సుమారు 15 మంది దుండగులు వీరిని హత మార్చేందుకు పథకం ప్రకారం సిమెంటు పైపుల్లో దాక్కున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక ట్రాక్టర్ క్రిష్ణగిరి వైపు నుంచి నారాయణరెడ్డి వాహనానికి ఎదురు రాగా మరో ట్రాక్టర్ వీరి వాహనాన్ని కొద్ది దూరం నుంచి అనుసరిస్తూ వచ్చినట్లు సమాచారం. నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కల్వర్టు నిర్మాణ ప్రాంతంలో పొలంలోకి తిరగగానే ప్రత్యర్థులు పెద్దఎత్తున కంకర రాళ్లు రువ్వారు. దీంతో దిక్కుతోచని నారాయణరెడ్డి కొద్దిసేపు వాహనంలోనే ఉన్నాడు. ఆ తర్వాత వాహనం దిగగా ట్రాక్టర్లలో ఉన్న దుండగులు పెద్దఎత్తున రాళ్లు రువ్వడంతో తలకు రాయి తగిలి నారాయణరెడ్డి కింద పడిపోయాడు. దీంతో ప్రత్యర్థులు అతడి వద్దకు వచ్చి కళ్లల్లోకి కారం కొట్టి వేట కొడవళ్లతో తలపై అతి కిరాతకంగా నరకడంతో పాటు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. ఇదే సమయంలో అనుచరుడు సాంబశివుడు వాహనం దిగి పారిపోయే ప్రయత్నం చేయగా గుర్తించిన దుండగులు ఆయన వెంట పడి వేటకొడవళ్లతో నరికి చంపారు. నారాయణరెడ్డికి భార్య శ్రీదేవి, ఒక కుమార్తె ఉన్నారు. ఈ హత్యలు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలో జరగడం గమనార్హం.
కాగా చెరుకులపాడు నారాయణరెడ్డి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయనపై గతంలో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసు కూడా నమోదైంది. అయితే ఆ కేసు విచారణ అనంతరం హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తరువాత ఆయన పత్తికొండ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా రాష్ట్రంలో అత్యధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే ఎన్నికల అనంతరం నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరారు. నియోజకర్గంలో చురుగ్గా పని చేస్తున్న ఆయనను హత మార్చడానికి గత కొంత కాలంగా ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నట్లు ఆయనకు సైతం సమాచారం ఉంది. అయితే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. నారాయణరెడ్డిని హత్య చేసిన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రవికృష్ణ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నా జంట హత్యలు జరగడం విచారకరమన్నారు. హత్య కేసులో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.