రాష్ట్రీయం

పల్లెకు నల్ల సిరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: నీలి విప్లవం, హరిత విప్లవాలకు దీటుగా తెలంగాణలో నలుపు విప్లవం పురుడు పోసుకుంటోంది. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయనున్న ఈ నల్ల విప్లవానికి ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కోటి పాతిక లక్షల గొర్రెలకు అదనంగా ఈ ఏడాది 40 లక్షలు, వచ్చే ఏడాది మరో 40 లక్షలు మొత్తంగా రాష్ట్రంలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా కొనుగోలు చేసి ఇవ్వనున్న గొర్రెలను కలిపితే వచ్చే రెండేళ్లలో వీటి జనాభా 2 కోట్లకు పెరిగితే, వీటి సంతానంతో మూడేళ్లలో రాష్ట్రంలో నాలుగు కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో మనుషుల జనాభాకంటే గొర్రెల జనాభా మించిపోతుందన్నది మరో అంచన. నాలుగు కోట్ల గొర్రెల విలువ 20 వేల కోట్ల సంపదను సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ సంపద తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేసి మరింత పరిపుష్టి కావడానికి దోహదం చేస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు కలిపి 80 లక్షల గొర్రెలు కొనుగోలు చేయడానికి రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంత పెద్దమొత్తంలో నిధులను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (నేషనల్ కోఆపరేటివ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్) నుంచి రుణంగా సమీకరించుకోవాలని నిర్ణయించింది. గొర్రెల పెంపకం కోసం రూ.5 వేల కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జంతు జాతి జనాభా లెక్కలు 2012 ప్రకారం రాష్ట్రంలో కోటి 28 లక్షల గొర్రెలు ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో గొల్ల, కుర్మల జనాభా 25 నుంచి 30 లక్షల వరకు ఉంటుందని అంచన. వీరిలో 6,24,764 మందికి గొర్రెలు, మేకల పెంపకంపై జీవనాధారంగా ఉన్నట్టు సమగ్ర సర్వేలో తేలింది. రాష్ట్రంలో ఇప్పటికే 4,161 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం గత నెల 10 నుంచి 20 వరకు గ్రామ సభలు నిర్వహించి కొత్తగా చేరిన సభ్యులతో మరో 3,351 సంఘాలను ఏర్పాటు చేసింది. కొత్త, పాత సంఘాలు కలిపి ప్రస్తుతం వీటి సంఖ్య 7,512 చేరుకోగా ఇందులో సుమారు ఏడు లక్షల మంది సభ్యత్వం పొందారు. వీరిలో సగం 3.5 లక్షల మందికి ఈ ఏడాది, వచ్చే ఏడాది మరో 3.5 లక్షల మందికి గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఇవ్వబోయే వారిని గ్రామ సభలలో లాటరీ తీసి ఎంపిక చేసింది. ఏడు లక్షల మందికి (7 లక్షల యూనిట్లు) 20 గొర్రెలు, ఒక పొట్టెలు (20+1) చొప్పున ఇవ్వడానికి రూ. లక్ష 25 వేల యూనిట్ వ్యయంగా ఖరారు చేసింది. ఇందులో ప్రభుత్వం రూ.93,750 భరించనుండగా రూ.31,250 సభ్యుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల నుంచి గొర్రెలు పంపిణీ చేయడానికి జిల్లాల వారీగా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌కు వెళ్లి గొర్రెల కొనుగోలుపై ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రం నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ గొర్రెలు కొనుగోలు చేయరాదనే నిబంధన విధించింది. ఇక్కడే కొనుగోలుకు అవకాశం కల్పిస్తే తమ వద్ద ఉన్న వాటినే కొనుగోలు చేసినట్టు చూపే అవకాశం ఉంటుందని ఈ నిబంధన పెట్టింది. ఎలాగు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఏదంటే అది కొనుగోలు చేయకుండా కట్టిన (గర్భంతో) ఉన్న వాటిని, కట్టుదారు (గర్భం ధరించడానికి సిద్ధంగా) ఉన్నవాటినే కొనుగోలు చేయాలని మరో నిబంధన పెట్టినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్ ఈ ప్రతినిధికి చెప్పారు. వీటిని నిర్ధారించడానికి వెటనరీ వైద్యున్ని కొనుగోలు బృందంలో సభ్యునిగా చేర్చామన్నారు. ఈ నెల 20 నుంచి అన్ని గ్రామాలలోనూ గొర్రెలు పంపిణీ చేపట్టి ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి ఈ ప్రతినిధికి చెప్పారు. తొలకరి జల్లులు ఇప్పటికే కురవడం, ఈ నెలాఖరు వరకు రుతు పవనాలు తాకితే జూలై మొదటి వారానికల్లా రాష్టవ్య్రాప్తంగా పచ్చగడ్డి మొలిస్తే అప్పుడిక వీటికి మేత సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు.