తెలంగాణ

టార్గెట్ మేయర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల వేడి రాజుకుంది. మేయర్ పీఠానే్న పార్టీలన్నీ టార్గెట్ చేస్తున్నాయి. మేయర్ పదవి బీసీ జనరల్ కావడంతో డివిజన్లవారీగా అభ్యర్థుల ఎంపిక సమయంలోనే మేయర్ పదవికి ఎవరు సరైన అభ్యర్థి అనే ఆలోచన చేస్తున్నారు. మేయర్ పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాల్సి ఉన్నందున, సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకుని గెలిపించుకోవాల్సి ఉందని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అతిరథ మహారథులు దిగబోతున్నారు. గ్రేటర్ ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ధీమాతో ఉంది. అందుక్కారణం, మజ్లీస్‌తో పరోక్షంగా మిత్రత్వం ఉండటం వల్ల ఆ పార్టీపై గెలుపొందే కార్పొరేటర్లు తప్పనిసరిగా తెరాసకే మద్దతునిస్తారని ఒకటి, ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బలం ఉండటం మరొకటి, అధికారంలో ఉండీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదుకనుక మిగతా పార్టీల కంటే అధికంగా కార్పొరేటర్లను గెలిపించుకోగలమన్న ధీమా మరొకటి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమారుడు, రాష్ట్ర మంత్రి కె తారక రామారావుకు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత అప్పగించారు. కెసిఆర్ కూడా కొన్ని సభల్లో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతల్లో మాత్రం గుబులు కనిపిస్తోంది. గతంలో మజ్లీస్ పార్టీ తమతో మిత్రత్వం చేసి జిహెచ్‌ఎంసి మేయర్ స్థానాన్ని రెండేళ్ళు అనుభవించిందని, ఇప్పుడు అధికార పార్టీ వైపు మొగ్గు చూపినందున తాము ఒంటరిగా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. ఏదైనప్పటికీ ఏఐసిసి నుంచి ముఖ్య నేతలను గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించి, చివరి వరకూ ప్రయత్నించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈనెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీ అనుసరిస్తున్న విధానం, ప్రచారానికి తీసుకుంటున్న చర్యల గురించి పార్టీ ముఖ్యులతో చర్చించి, అవసరమైన మేరకు సలహాలు, సూచనలు చేయనున్నారు.
మరోవైపు తెదేపా-్భజపా రాష్ట్ర నేతలు మాత్రం మేయర్ స్థానం తమదేనన్న భావనతో ఉన్నారు. లోక్‌సభ, అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలైన తెదేపా-్భజపా మెజారిటీ స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే. టిడిపి 9, బిజెపి 5 ఎమ్మెల్యే స్థానాలు, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలు గెలుపొందారు. కాబట్టి గ్రేటర్ పరిధిలో తామే బలమైన శక్తిగా ఉన్నందున మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదన్న ధీమాతో ఆ పార్టీల నేతలు కనిపిస్తున్నారు. ఈనెల 12న నగరంలో తెదేపా-్భజపా సంయుక్తంగా నిర్వహించనున్న బహిరంగ సభకు తెదేపా జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బహిరంగ సభను దిగ్విజయం చేయడం ద్వారా రెండు పార్టీల నేతలు, శ్రేణుల్లో ‘జోష్’ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తర్వాత కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు రానున్నారు. షహర్ హమారా.. మేయర్ హమారా అనే నినాదంతో తెదేపా నేతలు ప్రచారం చేపట్టారు. సెటిలర్లు అధికంగావున్న ప్రాంతాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మజ్లీస్ పార్టీ పూర్తి ధీమాతో ఉంది. గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 43 డివిజన్లలో విజయం సాధించినందున, ఈ దఫా ఇంకా ఎక్కువే సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. పైగా తెరాసతో కలిసి ఉన్నందున మేయర్ స్థానం విషయంలోనూ గత పద్ధతినే అనుసరించవచ్చన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇలాఉండగా వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాలూ జిహెచ్‌ఎంసి బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.