రాష్ట్రీయం

ప్రతి పేదకూ సొంతిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంతిల్లు కల నెరవేర్చి తద్వారా శాశ్వత చిరునామా కల్పిస్తానని సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. గడచిన పదేళ్లలో కాంగ్రెస్ పాలకులు పేదల ఇళ్ల నిర్మాణం పేరిట దాదాపు నాలుగు వేల కోట్లు దిగమింగారని నిప్పులు చెరిగారు. సకల సౌకర్యాలతో పేదలకు ఇళ్లు అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. అంతర్గత రహదారులు, డ్రైనేజి, మంచినీరు, వీధి దీపాలు, కమ్యూనిటీ హాలు, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్ వంటి వౌలిక సదుపాయాలతో నాణ్యమైన ఇళ్లు అందిస్తామన్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో పర్యటించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణాలు జరిపే ఐదు ప్రఖ్యాత కంపెనీలతో ఎంవోయు కుదుర్చుకున్నట్టు చెప్పుకొచ్చారు. పట్టణ ప్రాంత పేదల కోసం కేంద్రం మంజూరు చేసిన లక్షా 93 వేల ఇళ్ల నిర్మాణానికి నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సిఎం చంద్రబాబు రిమోట్ కంట్రోలు ద్వారా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 38 పట్టణాల్లో మూడంతస్తుల్లో ఇళ్లను నిర్మించనున్నారు. ఇదే సందర్భంలో ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయిన కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచే వీడియో లింక్ ద్వారా అధికారులు, లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. సిఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన ఈ గృహ నిర్మాణాల కోసం కేంద్రం లక్షా 50 వేలు, రాష్ట్రం మరో 50 వేలు సబ్సిడీ రూపంలో అందచేస్తుందన్నారు. ఇంకా అవసరమైతే బ్యాంకు రుణం ద్వారా వాయిదాల పద్ధతిలో చెల్లించేలా లబ్ధిదారుకు సహకరిస్తామన్నారు. ప్రాజెక్టుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన- ఎన్టీఆర్ నగర్‌గా నామకరణం చేసిన చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 వేల 400 కోట్లతో పాటు, వౌలిక సదుపాయాల కోసం మరో రూ.1180 కోట్లు వెచ్చిస్తుందన్నారు.
ఈ పథకం కింద మూడు స్థాయిల్లో గృహ నిర్మాణం చేపడతామన్నారు. 300 చ.అడుగులు, 365 చ.అడుగులు, 430 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతారు. అయితే తొలిదశకు 5 లక్షల 85వేలు వరకు, రెండో దశలో రూ.6లక్షల 90వేలు వరకు, మూడో దశలో రూ.7లక్షల 90వేలు వరకు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. గత కాంగ్రెస్ పాలకులు కమీషన్లు దండుకుని నివాసానికి యోగ్యతలేని ఇళ్లను నిర్మిస్తే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులతో పునర్నిర్మాణాలు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, మెట్రోవంటి మహా ప్రాజెక్టులను చేపట్టిన ఎల్ అండ్ టి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించిన ఎన్‌సిసి సంస్థ వంటి మొత్తం ఐదు పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకు గృహ నిర్మాణాల బాధ్యత అప్పగించామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడబోనని చెబుతూ, ప్రతి బుధవారం పథకంపై సమీక్ష జరుపటమే కాదు తరచూ ఆకస్మిక తనిఖీలు జరుపుతానన్నారు. అలాగే లబ్దిదారులు కూడా తరచూ రేపు తాము నివసించబోయే ఈ గృహాల నిర్మాణాలను పరిశీలిస్తూ ఎక్కడైనా లోపం కనిపిస్తే తనకు ఫిర్యాదు చేయాలని, అలాంటి పరిస్థితుల్లో వారిపై ముందూ వెనుకా ఆలోచించకుండా కఠిన చర్యలు తీసుకోగలనంటూ కాంట్రాక్ట్ సంస్థలను సభాముఖంగా హెచ్చరించారు. అలాగే కాలనీల్లో క్రీడాస్థలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాలు, షాపింగ్ కోసం వెలుపలి ప్రాంతాలకు వెళ్లకుండా వాణిజ్య జోన్‌లు ఏర్పాటు చేసి స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిత్రం.. ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు