రాష్ట్రీయం

మంచం పట్టిన మన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/విశాఖపట్నం,జూన్ 26: మన్యం రోగాలతో అల్లాడిపోతోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల జనం వైద్యం అందక మృతి చెందుతున్నారు. తూర్పు ఏజెన్సీలో చాపరాయి గ్రామాన్ని మలేరియా మహమ్మారి చుట్టుముట్టింది. ఇప్పటికే 16మంది ప్రాణాలను కబళించగా, పదుల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు చికిత్స పొందుతున్నారు. మలేరియాలోనే ప్రాణాంతకమైన పిఎఫ్, పివి తరహా వ్యాధి సోకినందునే ఈ గ్రామంలో ఇంతటి దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఈ తరహా మలేరియా సోకిన వారు రెండు రోజుల వ్యవధిలోనే చనిపోతారని నిపుణులు పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతానికి మలేరియా కొత్త కాదు. ఏటికేడాది సీజనల్ వ్యాధుల నివారణకు ఐటిడిఎ ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు ఖర్చు చేయడమూ షరామామూలే. కానీ ఏటేటా మలేరియా మహమ్మారికి గిరిపుత్రులు బలైపోతున్నారు. మన్యంలో ఆదివాసీలు దోమల నిర్మూలనకు సహజసిద్ధ విధానాల ద్వారా పచ్చిపేడ పిడకలు, వేపరొట్ట వేసి తగులబెట్టడం ద్వారా వచ్చే దట్టమైన పొగపై ఆధారపడుతుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దోమల నిర్మూలన మందులు పిచికారీ చేయించడం, దోమతెరలు పంచడం వంటి నివారణ చర్యలు చేపడుతోంది. దీనితో తమ సాంప్రదాయ విధానాలను గిరిజనులు మర్చిపోయారు. అదే వారి కొంపముంచుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా నివారణ చర్యలు తూతూమంత్రంగానే చేపడుతుండటంతో కొండకోనల్లోని మారుమూల లోతట్టు ప్రాంతాల ఆదివాసీ గూడేలను మలేరియా దోమలు కాటువేస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 16 మంది చాపరాయి గ్రామస్థులు ప్రమాదకరమైన సెరిబ్రల్ మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇంతటి ప్రమాదకరంగా మారేంతవరకూ అధికారులకు లోతట్టు గిరిజన గ్రామాలు గుర్తుకురాకపోవడమే అసలు విషాదం. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా చాపరాయి గ్రామంలో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ గ్రామస్థులు నిల్వవున్న వాగు నీరు తాగుతున్నారు. ఈ నీరే వారి కొంప ముంచింది. ఏదో వివాహ వేడుకలో విషాహారం తినడం వల్ల అస్వస్థతకు గురై, డయేరియా ప్రబలి మృత్యువాత పడ్డారని ముందుగా అధికారులు భావించారు. కానీ కారణం అదికాదని స్పష్టమైంది. ప్రమాదకరమైన మలేరియా బారిన పడి ముగ్గురు చిన్నారులు సైతం మృతిచెందారు.మలేరియాలో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రమాదకరమైన పిఎఫ్, పివి అనే రెండు రకాల మలేరియా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాటువేసింది. సాధారణంగా పిఎఫ్ కొందరికి, పివి కొందరికి సోకుతుంటుంది. కానీ ఏకంగా ఈ రెండు మలేరియాలు ఈ గ్రామస్థులకు సోకిందని నిర్ధారణ అయింది. అందుకే జ్వరం వచ్చిన రెండు రోజులకే ప్రాణాలు గాలిలోకలిసిపోతున్నాయి. వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామం ఒక కొండపై వుంది. సుమారు 300 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇందులో దాదాపు వందమందికి జ్వరాలు సోకాయి. ఇప్పటివరకు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో 31 మంది, మారేడుమిల్లి ఆసుపత్రిలో ఎనిమిదిమంది చికిత్స పొందుతున్నారు.
మొత్తం 39 మంది వ్యాధిగ్రస్థుల్లో 26 మంది వరకు మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఇందులో 15 మంది వరకు చిన్నారులున్నారు. రంపచోడవరం ఏరియా ఆసత్రిలో పిఎఫ్ పాజిటివ్ 14 మంది, పివి పాజిటివ్ 2, నెగటివ్ 6 మొత్తం 30 మంది తీవ్ర జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ల కచ్చర బుజ్జిరెడ్డి, నాలుగేళ్ల వయసు కలిగిన పల్లాల ఫణిరెడ్డి పరిస్థితి పరిశీలిస్తే ఈ చిన్నారులు తీవ్ర రక్తహీనతతో మలేరియా వ్యాధి బారిన పడ్డారు. వాస్తవానికి 8 నుంచి 12 మధ్య వయసువారికి హిమోగ్లోబిన్ సరిపడేంతగా ఉంటుంది. కానీ ఈ ఆదివాసీ చిన్నారులిద్దరికీ కేవలం 2.3 హెచ్‌బి వుందంటే ఏజెన్సీలో రక్తహీనత ఏంత భయంకరమైన స్థితిలో వుందో అర్ధం చేసుకోవొచ్చు. రక్తహీనతతో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో మలేరియా వీరికి త్వరితగతిన సోకుతోంది. దీంతో జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మృత్యువాత పడుతున్న పరిస్థితి. గతంలో కాళ్ల వాపు కూడా రక్తహీనత కారణంగానే సోకింది. చాపరాయి గ్రామానికి ప్రస్తుతం విద్యుత్ సరఫరా లేదు. రెండు బోర్లు వున్నాయి. ఈ బోర్ల నీరు తాజాగా వుంటుంది.. కానీ ఈ నీటిని తాగడం వారికి ఇష్టం వుండదు. కాటంరాజు కొండ వాగుకు చెందిన నిల్వ నీరు తాగడమే వారికి అలవాటు. ఏదేమైనప్పటికీ రక్తహీనత, ప్రాణాంతక మలేరియా బారిన పడకుండా పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సి వుంది.
సిఎం ఆదేశించినా స్పందించని యంత్రాంగం
విశాఖ మన్యంలో మలేరియా విజృంభిస్తోంది. అధికారికంగా కేసుల నమోదు తక్కువగా చూపిస్తున్నప్పటికీ జ్వరాల బారిన పడి అమాయక గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం మళ్లీ మొదలైంది. ప్రతి యేటా సీజన్‌లో మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా తదితర వ్యాధులు విజృంభించడం, ప్రభుత్వం, అధికారులు హడావుడి చేయడం సాధారణమైపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. ప్రతి యేటా మలేరియా కేసులు తగ్గుతున్నట్టు వైద్యఆరోగ్య శాఖ లెక్కలు చూపుతున్నారు.
అయితే వాస్తవానికి ఏజెన్సీలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా ఏజెన్సీలో మలేరియా కారణంగా ఒక్క మరణమూ సంభవించలేదని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే 2016 సంవత్సరానికి సంబంధించి 7,94,988 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 6,479 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక 2017లో మే నెలాఖరు వరకూ 2,63,438 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 1,874 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. నమోదైన కేసుల్లో అత్యధికం ఏజెన్సీ ప్రాంతాలు కావడం గమనార్హం. గతేడాది ఏజెన్సీ మండలాల్లో 4,16,377 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, 4,502 మందికి మలేరియా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఏజెన్సీలో కొన్ని ప్రాంతాల్లోనే రక్త పరీక్షలు నిర్వహించగా, ఒక శాతం గిరిజనులకు మలేరియా నిర్ధారణైంది. గతంలో ఒక సారి విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు వెలుగుచూడటంతో కలకలం రేగింది. తాజాగా మరోసారి విశాఖ పాడేరు సమీపంలో కోడిపుంజు వలస గ్రామంలో మరోసారి ఆంత్రాక్స్ లక్షణాలతో పలువురు గిరిజనులు ఆసుపత్రిలో చేరారు.
ఐదుగురు వ్యక్తులను విశాఖ కెజిహెచ్‌కు తరలించి ఆంత్రాక్స్ చికిత్స అందిస్తున్నారు. 2015లో 44 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాగా ముగ్గురు మరణించారు. 2016లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు పేర్కొంటున్నప్పటికీ పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 2017లో ఇప్పటి వరకూ 51 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలను గుర్తించగా, ముగ్గురు మరణించారు. ఇదిలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఏజెన్సీలో అంటువ్యాధుల నియంత్రణకు పరిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఎప్పటిలాగే జిల్లా యంత్రాంగం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. ఏజెన్సీ ప్రాంతంలో సరైన వైద్య సహకారం అందకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయన్నది వాస్తవం.

చిత్రం.. రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు బుజ్జిరెడ్డి