రాష్ట్రీయం

చిన్న పరిశ్రమలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: రాష్ట్రంలో 100 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అమరావతిలో 15 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఇ భవనాన్ని నిర్మించనున్నామని, అమరావతిలో కన్‌స్ట్రక్షన్ సిటీని కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎంఎస్‌ఎంఇ డే సందర్భంగా విజయవాడలో మంగళవారం నిర్వహించిన వర్క్‌షాపులో సిఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎపిఎంఎస్‌ఎంఇ అభివృద్ధి సంస్థ లోగో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తక్కువ పెట్టుబడులతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సంస్థ వివిధ పరిశ్రమల ఉత్తత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, తదితర అంశాలపై సహకరిస్తుందన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఇ భవన్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఇందులో ఎంఎస్‌ఎంఇలకు సంబంధించి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సూచనలు వంటివి ఇస్తామన్నారు. అమరావతిలో 20 నుంచి 30 ఎకరాల్లో కన్‌స్ట్రక్షన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సిటీలో భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని వస్తువులు, సామగ్రి లభిస్తాయన్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 100 నుంచి 200 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఇ పార్క్‌లను నిర్మిస్తామన్నారు. పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వడంలో ఎంఎస్‌ఎంఇ యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. గడచిన మూడేళ్లలో 20,448 ఎంఎస్‌ఎంఇ యూనిట్లు ఏర్పాటయ్యాయని, 9418 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారని, 2.5 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ఎవరు పడితే వారు తనిఖీ చేసేందుకు ఇకపై వీలు లేదని, అన్ని శాఖలు కలిసి ఒకేసారి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాల్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఆటోనగర్‌లు, పారిశ్రామిక పార్క్‌లను కలుపుతూ ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి గవర్నింగ్ బాడీ ఉంటుందని, ఎంఎస్‌ఎంఇల ప్రగతిపై సమీక్ష చేసే అధికారం కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు.
కాగా రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. చిన్న పరిశ్రమలు నష్టాల బాటలో ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 160 కోట్లతో పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎంఎస్‌ఎంఈ రంగంలో ప్రతిభ కనబరిచిన పారిశ్రామికవేత్తలకు అవార్డులను సిఎం అందచేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోఖ్యరాజ్, ఎమ్మెల్యేలు బొండా ఉమ, బోడే ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎంఎస్‌ఎంఇ అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు 100 కోట్ల రూపాయల చెక్కు అందిస్తున్న సిఎం చంద్రబాబు