రాష్ట్రీయం

కమ్ముకుంటున్న చీకట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 27: ఆంధ్రా -తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఒప్పందం తెగిపోవడంతో పవర్ ప్రాజెక్టుల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఇకపై అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యుత్ ప్రత్యేకంగా రూ.5.50లు యూనిట్‌కు వెచ్చించి కొనుగోలు చేసేంత కొరత లేదంటూ ఏపీ ట్రాన్స్‌కో, ఎపిఎస్‌ఎల్‌డిసీ చీఫ్ ఇంజనీర్ అత్యవసర ఆదేశాలిచ్చారు. ఎపీపీసీసీ బోర్డు సమావేశంలో ఆంధ్రలోని విద్యుత్ పవర్ ప్రాజెక్టుల నుంచి పవర్ కొనుగోలు అంశాన్ని చర్చించి, 2021 వరకూగల అగ్రిమెంట్లను పునఃసమీక్షించినంత వరకూ ‘పవర్’ అక్కర్లేదంటూ మెయిల్ ద్వారా ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రంలో 21 పవర్ ప్రాజెక్టులకు తాళాలు పడే అవకాశం ఉంది. దీంతో నెలకు రూ. 45 లక్షలు నిర్వహణ, జీతభత్యాలు, బ్యాంకు రుణాలు, వడ్డీల కింద అయ్యే ఖర్చులు భరించలేని పరిశ్రమలన్నీ మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. 432 మెగావాట్ల విద్యుత్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అమ్మకాలు చేసే పవర్ ట్రాన్స్‌మిషన్‌పై జగడం వచ్చిన విషయం తెలిసిందే. రావల్సిన రూ. 3,500 కోట్ల బకాయిలు ఆస్తులు, అప్పులకు సంబంధం లేదని ఎపీ జెన్కో సంస్థల సిఎండి కె.విజయానంద్ కరాఖండీగా చెప్పిన విషయం తెలిసిందే! చత్తీస్‌గఢ్ నుంచి పవర్ కొనుగోలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లింపులు చేసేందుకు సాకులు చెప్పడంతో ఆంధ్ర -తెలంగాణ సిఎంలు చంద్రబాబు, కెసిఆర్ మధ్య ‘పవర్’ ఆర్థిక లావాదేవీలపై తీసుకున్న నిర్ణయంతో ఎపిఎస్‌ఎల్‌డిసీ, ఏపీ ట్రాన్స్‌కో తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో గల బగస్సీ (చెరకు చెత్తతో), బయోమాస్ (వంటచెరకు, ఊక, కందికర్రలు, జొన్న కంకులు, పత్తికర్ర, జ్యూట్ వేస్టు, స్ట్రిక్), మున్సిపల్ వేస్టు (కంపోస్టు), ఇండ్రస్టీయల్ వేస్టు (కోల్, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థపదార్థాలు) ఇలా నాలుగు రకాల కేటగిరిల్లో విద్యుదుత్పాదన చేసే 39 పవర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో వరం పవర్ ప్రాజెక్టు (బయోమాస్)తోపాటు మరో 20 పవర్ ప్రాజెక్టులు తాళాలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. 2021 వరకూ ఈ పవర్ ప్రాజెక్టులతో ప్రభుత్వానికి అగ్రిమెంటు ఉన్నప్పటికీ, సుమారు 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ పరిశ్రమల నుంచి విద్యుత్ కొనుగోలు చేయబోమంటూ ఏపీ ట్రాన్స్‌కో, ఎపిఎస్‌ఎల్‌డిసీ చీఫ్ ఇంజనీర్ నుంచి ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు ముందస్తు నోటీసులు లేకుండా మెయిల్ ద్వారా ఆదేశాలిచ్చారు. దీంతో బయోమాస్ విధానంలో నడిచే 14 పవర్‌ప్రాజెక్టుల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు సిఎంని కలిసి వారి ఆర్థిక ఆందోళన, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు, నిర్వహణ ఖర్చులను వివరిస్తూ అగ్రిమెంటు కాలం వరకూ విద్యుత్ కొనుగోలు చేయాలంటూ విన్నవించుకున్నారు. కానీ, పరిశ్రమలన్నీ అప్ డేట్ కావాలంటూ వారికి సిఎం క్లాస్ తీసుకోవడం గమనార్హం. అలాగే, సౌరవిద్యుత్ టారిఫ్ భవిష్యత్తులో మరింత దిగొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుబాటు ధరల్లోనే పరికరాలు లభించడంతో పాటు రుణాల వ్యయం తగ్గడం వల్ల మరిన్ని సంస్థలు సౌరవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈసారి జరిగే వేలంలో యూనిట్ సౌరవిద్యుత్ టారిఫ్ రూ. 1.50కు పరిమితం అయ్యే వీలుందని కేంద్ర పునరుత్పాదక ఇంధనవరుల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయంటూ విద్యుత్ పరిశ్రమల యాజమాన్యాల అసోసియేషన్‌కు సిఎం వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
గంటకు 6000 యూనిట్లు, యూనిట్‌కు రూ. 5.50లు చెల్లిస్తూ ప్రభుత్వం పవర్‌ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు 2021 వరకూ అగ్రిమెంట్లు చేసుకుంది. ఇలా రాష్ట్రంలో బయోమాస్ ద్వారా విద్యుదుత్పాదన చేసే 14 పవర్ ప్రాజెక్టులతోపాటు, బగాస్సీ, మున్సిపల్ వేస్ట్, ఇండస్ట్రీయల్ వేస్ట్ జనరేషన్ పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సుమారు 39 పరిశ్రమలు 225 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం కలిగినవి గంటకు ఆరు వేల యూనిట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. యూనిట్‌కు రూ. 5.50లు సర్కార్ చెల్లిస్తుంది. ఒక్కో పరిశ్రమలో సుమారు 400 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారి జీతభత్యాలకై రూ. 22 లక్షల వరకూ ఖర్చవుతోంది. అలాగే, నిర్వహణ, బ్యాంకు రుణాలు, వడ్డీలు ఇతరత్రా వ్యయం మొత్తంగా నెలకు రూ. 45 లక్షలు వరకూ ఒక పవర్ ప్రాజెక్టు భరించాల్సివుంది. ఎటువంటి నోటీసులు లేకుండా, ఇప్పటికిప్పుడే విద్యుత్ సరఫరా నిలిపివేయమంటూ సర్కార్ ఇచ్చే ఆదేశాలతో ఉద్యోగులంతా రోడ్డునపడే ప్రమాదం ఉంది. అలాగే, నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులు పెట్టండంటూ పిలుపునిచ్చే ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని నమ్మి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇటువంటి అత్యవసర నిర్ణయాలు పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితుల్లోకి నెట్టేస్తుంటే, పారిశ్రామికాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ఏ భరోసాపై రాగలరంటూ పవర్‌ప్రాజెక్టు యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. వీటిపై సరైన నిర్ణయం తీసుకుని, అగ్రిమెంటు మేరకు విద్యుత్ కొనుగోలు చేయని పక్షంలో కొంతమంది పవర్‌ప్రాజెక్టు యాజమానాయలు న్యాయస్థానంలో ప్రభుత్వానికి సవాల్ చేస్తూ పిటిషన్ వేసేందుకు కూడా వెనుకాడమంటున్నాయి.

చిత్రం.. శ్రీకాకుళంలోని వరం పవర్ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయబోమంటూ ఈ-మెయిల్ ద్వారా ఆదేశాలిచ్చిన ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్