తెలంగాణ

వారసులు వస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: కుటుంబ రాజకీయాలు కేవలం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాదు. మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ నాయకుల కుటుంబ సభ్యులు టిక్కెట్ల కోసం పోటీలు పడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ 17వ తేదీతో ముగుస్తుంది. జిహెచ్‌ఎంసిలో 50 శాతం డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో ఇంతకాలం పోటీ చేస్తామనుకున్న మగవాళ్లు నిరాశకు లోనయ్యారు. దీంతో తెలివిగా తమ మహిళా కుటుంబ సభ్యులను రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని పార్టీల కార్యాలయాల్లో కోడలు, భార్య, కుమార్తెలను వెంటబెట్టుకుని టిక్కెట్ల కోసం ప్రయత్నించే ఆశావహుల సంఖ్య పెరిగింది. మల్కాజిగిరి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సి కనకా రెడ్డి తన కోడలు, మరో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ కోడలు వేరువేరు డివిజన్లలో టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. అల్వాల్ 134 వార్డులో ఎమ్మెల్యే కనకా రెడ్డి కోడలు విజయ శాంతి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె బిఎస్‌సి గ్రాడ్యుయేట్. ఈ సీటు మహిళ జనరల్‌కు రిజర్వు కావడంతో పోటీ నెలకొంది. బన్సీలాల్‌పేట 137 వార్డు కోసం మాజీ కౌన్సిలర్ జె వెంకటేశం కోడలు జె చాయ పోటీ పడుతున్నారు. గతంలో ఈ సీటు ఎస్సీ రిజర్వుడుగా ఉండేది. కాగా టిఆర్‌ఎస్ ఎంపి, కెసిఆర్ సన్నిహితులు కె కేశవరావు కుటుంబం నుంచి గద్వాల విజయ లక్ష్మి కూడా సురక్షితమైన వార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్‌లో టిఆర్‌ఎస్ నేత కెఎం ప్రతాప్ సతీమణి కెపి పద్మ టిఆర్‌ఎస్ తరఫున టిక్కెట్‌కు, కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ప్రతాప్ సోదరుడు మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీశ్ సతీమణి కె పారిజాత టిడిపి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు.
వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయి కిరణ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సురక్షిత స్థానం కోసం వేట మొదలు పెట్టినట్లు సమాచారం. సనత్‌నగర్, సికింద్రాబాద్‌లలో సీట్లు రిజర్వు కావడంతో కొత్త సీటు కోసం అనే్వషిస్తున్నారు. మరో మంత్రి పద్మారావు సికింద్రాబాద్ మోండా మార్కెట్ వార్డులో గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పుడు తన కుమారుడి కోసం వేరే నియోజకవర్గాలో సురక్షితమైన సీటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంకా మంత్రి నాయిని నరసింహారెడ్డి, టిఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న, దివంగత ఎమ్మెల్యే పిజెఆర్ కుటుంబం నుంచి ఒకరు కూడా టిఆర్‌ఎస్ టిక్కెట్, సురక్షిత స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.