రాష్ట్రీయం

పర్మిట్ల రద్దు ప్రకటన అవగాహన రాహిత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: సంక్రాంతి పర్వదినాన మూడు రోజుల పాటు తమ తమ స్వస్థలాల్లో గడపటానికి హైదరాబాద్, అలాగే చెన్నై, బెంగళూరు, ఇతర నగరాల నుంచి తరలివస్తున్న వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడుతోంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులుగా ముందు నుంచే దాదాపు 750 ప్రత్యేక బస్సులను ఆయా ప్రాంతాలకు పంపించడం జరిగింది. వెళ్లేటప్పుడు నామమాత్రపు ప్రయాణికులతో నష్టాలలో వెళ్లనప్పటికీ తిరిగి వచ్చే సమయంలో కిటకిటలాడుతూ వస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ఏ ఒక్కరూ ప్రైవేటు బస్సులపై ఆధారపడకుండా తగినన్ని ఆర్టీసీ బస్సులను నడపటానికి ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు ప్రణాళికాబద్ధంగా తీసుకున్న చర్యలన్నీ ఫలిస్తున్నాయి. ఇక రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైల్లన్నీ కూడా ఈ నెల 13 నుంచి 17 వరకు హౌస్‌ఫుల్ అయ్యాయి. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ కావటంతో ఆ రోజు ఏ ఒక్కరూ కూడా ప్రయాణాలు చేయరు. ఇక ఆదివారం సాయంత్రం రైల్వే, బస్‌స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా ఉండబోతోంది. ఇదిలా ఉండగా ఏడాది పొడవునా చట్ట విరుద్ధంగానే ఆర్టీసీకి దీటుగా స్టేజి క్యారియర్‌లుగా వివిధ ప్రాంతాలకు ప్రైవేటు బస్సులను బాహాటంగా నడిపే ట్రావెల్స్ యజమానులు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని అసలు ముందస్తు రిజర్వేషన్లు కూడా లేకుండానే రెట్టింపు రేటుకి టిక్కెట్లను విక్రయించుకోటం ప్రారంభించారు. ఎవరైనా గట్టిగా అడిగితే సీట్లు లేవనే సమాధానం వస్తోంది. ఇదిలా ఉంటే సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు టికెట్ ఛార్జీలను పెంచితే ఏకంగా పర్మిట్లను రద్దు చేస్తానంటూ చేసిన ప్రకటన ఆశ్చర్యం గొల్పుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులను స్టేజి క్యారియర్లుగా నడిచేందుకు అనుమతిచ్చినట్లే ఆయన ప్రకటన చూస్తే అర్థమవుతుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ అసలు రవాణా శాఖ అనుమతి లేకుండా బుకింగ్ కౌంటర్లను ప్రారంభించరాదు. ప్రధానంగా కాంట్రాక్ట్ క్యారియర్‌గానే అంటే ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ వరకు మాత్రమే నడపాలి. విడివిడిగా టిక్కెట్లను విక్రయించరాదు. ప్రయాణికుల జాబితాను సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఎప్పటికపుడు అందజేస్తుండాలి. అయితే దీనికి భిన్నంగా ఊరూవాడా కౌంటర్లు తెరచి... ఇదివరకు ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్ల విక్రయం జరిగేది. పైగా బస్సులపై నాలుగైదు అడుగుల ఎత్తున పార్శిల్స్‌ను రవాణా చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఏదైనా భారీ ప్రమాదాలు జరిగినపుడు మాత్రం రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తుండటంతో ఆ సమయాల్లో బస్సులు ఆగిపోతున్నాయంటే అనునిత్యం చట్ట విరుద్ధంగా ఎలా తిరుగుతున్నాయో అర్థమవుతోంది. ఒక్క విజయవాడ నుంచి హైదరాబాద్, ఇతర నగరాలకు నిత్యం 300 ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ క్యారియర్లుగా తిరిగే బస్సులకు రవాణా ఛార్జీలను నిర్దేశించే అధికారం ఎటూ ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారియర్‌గా నడుస్తూనే ఆర్టీసీ చార్జీకి రెండు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఇక ఆర్టీసీ పరంగా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి నిత్యం హైదరాబాద్‌కు 200 షటిల్స్ ఉంటే సంక్రాంతి సందర్భంగా 17న మరో 200 ప్రత్యేక బస్సులను ప్రకటిస్తే వీటిలో ఛార్జీ 50 శాతం అదనం అయినప్పటికీ దాదాపు రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. అయినప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను కరెంట్ బుకింగ్ ప్రాతిపదికన ఎన్ని బస్సులను అయినా నడుపగలమని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పివి రామారావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ప్రత్యేక బస్సులు వెళ్లేటపుడు లేదా వచ్చేటపుడు ఏదో ఒక షెడ్యూల్‌లో ఖాళీగానే రావాల్సి వస్తాయని, పైగా కండక్టర్ డ్రైవర్లకు ఓటిలు ఇవ్వాల్సి ఉన్నందున అదనపు ఛార్జీని వసూలు చేయాల్సి వస్తుందని దీనిపై విమర్శలు తగవన్నారు.