తెలంగాణ

రిజర్వేషన్లపై మజ్లిస్ అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పాతబస్తీలో అధిక శాతం డివిజన్లు రిజర్వ్ కావడంతో విజయంపై ఆలిండియా మజ్లిస్ ఇఫ్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తర్జన భర్జన పడుతోంది. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న తరుణంలో మజ్లిస్‌కు సొంత గడ్డపై ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహంతో మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 44 డివిజన్లలో 36 డివిజన్లు రిజర్వ్‌డ్ కేటగిరీలోకి మారాయి. కేవలం ఎనిమిది డివిజన్లు మాత్రమే జనరల్‌గా మిగిలాయి. కాగా తమకు గట్టి పట్టున్న పాతబస్తీలో ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఎంఐఎం వ్యూహాలు రచిస్తోంది. పార్టీకి కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో రెండు, మూడు రోజులుగా పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక నేత అయిన అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి, హసన్ జాఫ్రి తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ విజయాలపై చర్చిస్తున్నారు. ఇదిలావుండగా డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు వెనుకనున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి వ్యూహాన్ని తిప్పికొట్టి, వాటిని చేజారకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరించాలని పార్టీ అధినేత యోచిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇప్పటికే మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సుమారు 2,300 మంది అభ్యర్థులు తమకు మజ్లిస్ పార్టీ నుంచి టికెట్ కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. నామినేషన్ల తుది గడువు నాటికి ఈ దరఖాస్తులు మూడు వేలకు చేరవచ్చని పార్టీ నాయకులు భావిస్తున్నారు. మజ్లిస్ పాత బస్తీతోపాటు నగర శివారు ప్రాంతాలపై కూడా దృష్టి సారించింది. ముస్లింల కంటే హిందువులే అధికంగా టికెట్‌ను ఆశిస్తున్నవారిలో ఉన్నట్టు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుల్లో దళితులు, బిసిలకు పెద్దపీట వేస్తున్నట్టు ఎంఐఎం పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అనే నినాదంతో ప్రచారానికి దిగుతోంది. దీంతో ముస్లిమేతరులు సైతం పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా బిసి, ఎస్సీ, ఎస్టీలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గెలుపు గుర్రాలతో పాటు వారి ఆర్థిక వనరుల స్థితిగతులపై పరిస్థితిని తెలుసుకునేందుకు ఎంఐఎం సర్వే చేసినట్టు సమాచారం. అదేవిధంగా నగరంలోని ప్రధాన డివిజన్లలోనూ పాగా వేయాలని మజ్లిస్ నిశ్చయించుకొని ఆ దిశగానే పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన జూబ్లీహిల్స్, ముషీరాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్, సికిందరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో బలమైన అభ్యర్థులను దింపేందుకు పార్టీ వ్యూహ రచన చేస్తోంది. అవసరమైతే రాజకీయ పరిణామాలను బట్టి కలిసి వచ్చే పార్టీలతో కొన్ని డివిజన్లలో స్నేహపూర్వకంగా పోటీకి దిగాలని పార్టీ అగ్ర నేతలు భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన డివిజన్లను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా చూసేందుకు పార్టీ అగ్ర నాయకత్వం వ్యూహ రచనలో మునిగింది.