తెలంగాణ

రెచ్చిపోతున్న రెబెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయ. రాజకీయ పార్టీల్లో రెబెల్స్ సంఖ్య పెరుగుతోంది. బలం లేదని టికెట్ ఇవ్వనన్నారు.. స్వతంత్రంగా మా బలమేంటో చూపిస్తామంటూ రంగంలోకి దిగుతున్న రెబెల్స్ బెడద అన్ని పార్టీలనూ పీడిస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరిరోజు కావడంతో శనివారం ఒక్కరోజే వెయ్యి నామినేషన్లు దాఖలయ్యాయ. ఒక్కో వార్డులో సగటున ఇప్పటికే ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం మరింతగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. 80మందితో తెరాస తొలి జాబితా ప్రకటించగా, కాంగ్రెస్ 40 మందితో ప్రకటించింది. ఇక తెదేపాతో పొత్తులో తమకన్నీ పాతనగరం డివిజనే్ల కేటాయించారని భాజపా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని వార్డులనైనా మార్చాలని కోరుతూ భాజపా నేతలు తెదేపాను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కుద్బుల్లాపూర్‌లో తెదేపాకే బలం ఉందని, అసలు ఉనికేలేని భాజపాకు టికెట్లు ఎలా ఇస్తారని కుద్బుల్లాపూర్ తెదేపా నాయకులు భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సహజంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌లోనే ఆగ్రహావేశాలు, కార్యకర్తల అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ చిత్రంగా ఈసారి కాంగ్రెస్‌లో అలాంటి వైఖరి కనిపించడం లేదు. 50శాతం వార్డులు మహిళలకు రిజర్వ్ అయనా నాయకుల కుటుంబీకులకే టికెట్లు దక్కాయి. రాజ్యసభ సభ్యులు కేశవరావు కుమార్తె, పి జనార్దన్‌రెడ్డి కుమార్తెలకు తెరాస టికెట్లు దక్కాయి. ఆయా వార్డుల్లో ప్రధాన రాజకీయ పక్షాల కుటుంబీకులకే మహిళలకు రిజర్వ్ చేసిన వార్డుల్లో టికెట్లు దక్కాయి. ఆదివారం ఒక్కరోజే నామినేషన్లకు గడువున్నందున

అన్ని పార్టీల్లోనూ తిరుగుబాటు రాజకీయాలు ఆదివారం ఊపందుకునే అవకాశం ఉంది.
ప్రధాన రాజకీయ పక్షాలన్నీంటికీ రెబెల్స్ బెడద తప్పడం లేదు. ఎంతోకాలం నుంచి గ్రేటర్‌లో పోటీ కోసం ఎదురు చూస్తున్న నాయకులు.. టికెట్లు దక్కక పోవడంతో రెబెల్‌గా బరిలోకి దిగుతున్నారు. తెరాస ఒంటరిగా 150 వార్డుల్లో పోటీ చేస్తున్నా, ప్రతి వార్డులోనూ ఒకరికి మించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక తెదేపా, భాజపాల పొత్తుతో పోటీకి అవకాశం లేకపోవడంతో రెండు పార్టీల నుంచి టికెట్ ఆశించినవారు రెబెల్స్‌గా రంగంలో నిలిచారు. టిడిపి 90 వార్డుల్లో, బిజెపి 60 వార్డుల్లో పోటీ చేస్తోంది. తమకు కేటాయించిన వార్డులపై బిజెపి అసంతృప్తితో ఉంది. ఎక్కువగా పాతనగరంలోని వార్డులను కేటాయించడం వల్ల ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో మార్పుల కోసం భాజపా నాయకులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెదేపా నాయకులు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కలిశారు. తెదేపాకు కేటాయించిన వార్డులపై భాజపా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, భాజపాకు దక్కిన వార్డులపై కొందరు తెదేపా నేతలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 150 డివిజన్లు ఉంటే ఈ ఒక్కరోజే తెరాస తరఫున 277 మంది, కాంగ్రెస్ తరఫున 200 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పొత్తులో టిడిపి 90 వార్డుల్లో పోటీ చేయాల్సి ఉండగా, మొత్తం 150 వార్డుల్లోనూ ఆ పార్టీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఒక్కరోజు 181 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బిజెపి 60 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 93 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికి మొత్తం 1097 మంది నామినేషన్లు దాఖలయ్యాయ. ఈ ఒక్కరోజు నామినేషన్లు దాఖలు చేసిన వారు 997 మంది. రెబెల్స్ నామినేషన్లు ఉప సంహరించుకుంటారనే నమ్మకంతో ఆయా పార్టీల నాయకత్వం ఉండగా, అభ్యర్థులు మాత్రం తప్పుకునేది లేదంటున్నారు. నామినేషన్లు దాఖలు చేసేప్పుడు ఏ పార్టీ పేరయినా దరఖాస్తులో పేర్కొనవచ్చునని, అయితే వారికి ఆ పార్టీ నుంచి బి ఫారం ఇస్తేనే పార్టీ అభ్యర్థిగా గుర్తిస్తామని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటారని అధికారులు తెలిపారు. తెరాస, కాంగ్రెస్, తెదేపా- భాజపా, లోక్‌సత్తా- సిపిఐ, సిపిఎం, ఎంఐఎంలతో పెద్ద సంఖ్యలో స్వతంత్రులు పోటీలో ఉండడం వల్ల బహుముఖ పోటీలో ఫలితం ఎలాగైనా ఉండవచ్చనే ఆశతో ఎవరికి వారు తిరుగుబాటు అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఆవేశంతో నామినేషన్లు దాఖలు చేసినా అధికార పక్షం కాబట్టి మా వాళ్లు ఉప సంహరించుకుంటారని తెరాస నేతలు చెబుతున్నారు. పార్టీలో ఇతర అవకాశాలు ఉంటాయని బుజ్జగిస్తున్నారు. విపక్షాలకు ఈ అవకాశం లేదు కాబట్టి తిరుగుబాటు దారుల వల్ల అధికార పక్షం కన్నా విపక్షాలకే ఎక్కువ సమస్యని తెరాస అంటోంది.
ఎవరికివారే మేయర్?
తెరాసలో ఎవరికి వారు తామే మేయర్ అని ప్రచారం చేసుకుంటున్నారు. కె కేశవరావు కుమార్తె కాబోయే మేయర్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ముఠాగోపాల్ కాబోయే మేయర్ అనే ప్రచారం సాగుతోంది. జిహెచ్‌ఎంసి మేయర్ పదవి బీసీలకు రిజర్వ్ చేశారు. బీసీ అభ్యర్థులంతా మేయర్ పదవి తమకేనని ప్రచారం చేసుకుంటున్నారు.