రాష్ట్రీయం

ఈనామ్‌తో... చిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 19: దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ మార్కెటింగ్ ఆన్‌లైన్ విధానం మిర్చి రైతులకు శాపంగా పరిణమించింది. ఈనెల ఒకటో తేదీ నుండి 25 మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే దీనివల్ల రైతులకు జరిపే చెల్లింపులలో వ్యత్యాసం ఉంటుందనే వాదనతో వ్యాపారులు గుంటూరు మిర్చి యార్డులో కొనుగోళ్లను నిలిపివేశారు. పాతపద్ధతిలోనే కొనుగోళ్లు జరుపుతామని తేల్చి చెప్పటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. గత రెండు నెలల క్రితం ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో ఒకింత ఊరట చెందారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 30 వరకు కోల్డుస్టోరేజీలలో నిల్వలను విక్రయించరాదని ఆదేశాలు జారీచేశారు. అప్పటి నుంచి కోల్డుస్టోరేజీలలో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. మధ్యలో జూలై ఒకటో తేదీ నుంచి 15 వరకు జిఎస్‌టి యాక్టుకు వ్యతిరేకంగా ఎగుమతి వ్యాపారులు బంద్ పాటించారు. ఏతావాతా జూలై 15 నుంచి ఆగస్టు 30 వరకే కోల్డుస్టోరేజీలలో వ్యాపారం జరిగింది. ఇందులో 15 రోజులు సెలవులు పోగా మిగిలిన నెల రోజుల్లో క్రయ, విక్రయాలు జరిగాయి. తిరిగి ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈనామ్‌ను వ్యాపారులు వ్యతిరేకించి కొనుగోళ్లకు భీష్మించడంతో ఎక్కడి సరకు అక్కడే నిల్వచేసుకున్నారు. 2017 సీజన్‌కు కోల్డుస్టోరేజీలలో మొత్తంగా 70లక్షల బస్తాల సరకు నిల్వలు ఉన్నాయి. కొనుగోళ్లు జరిగిన నెలరోజుల్లో సుమారు 20 లక్షల టిక్కీల వరకు విక్రయాలు జరిపారు. ప్రస్తుతం 50 లక్షల బస్తాలు కొనుగోళ్లు చేయాల్సి ఉంది. కొనుగోళ్ల నిలిపివేతతో ఐటిసిని రంగంలో దించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటిసి కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోంది. ఈ ప్రభావం రైతులతో పాటు కోల్డుస్టోరేజీల ముఠా కార్మికులపై పడుతోంది. పరిస్థితి ఇదే రకంగా ఉంటే వచ్చే మూడునెలల్లో 50లక్షల బస్తాల విక్రయం సాధ్యపడదని చెప్తున్నారు. జనవరి నుంచి కొత్త సరకు మార్కెట్ యార్డుకు తరలి వస్తుంది. దీంతో ఇప్పుడున్న మిర్చిని నాణ్యతా ప్రమాణాల సాకుతో కొనుగోలుచేసే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది జూన్ నాటికి రంగుమారి, నాణ్యత తగ్గి ధరలు మరింత పతనమయ్యే ప్రమాదం లేకపోలేదని కోల్డు స్టోరేజీల నిర్వాహకులు చెబుతున్నారు. కోల్డుస్టోరేజీలలో నిల్వచేసిన సరకుపై వివిధ బ్యాంకుల నుంచి రూ. 600 కోట్లకు పైగా రుణాలు చెల్లించాల్సి ఉంది. రుణ పరిమితి గడువు తీరితే ఎన్‌పిఎ కింద సరకును వేలంవేసి ఆస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం బ్యాంకర్లకు ఉంటుంది. గత ఏడాది 2016 సీజన్‌లో చేసిన రుణాలే ఇంకా 70 కోట్ల మేర బ్యాంకులకు బకాయిలు చెల్లించాలి. కోల్డుస్టోరేజీల నిర్వహణకు ప్రతి నెలా 7లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు వేలాది మంది వీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. గత నాలుగు నెలలుగా మిర్చి సంక్షోభం నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ముఠా కూలీలు పనులు లేక స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించాలని కోల్డుస్టోరేజీల అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావుకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..కోల్డుస్టోరేజీల వద్ద పేరుకుపోతున్న మిర్చి బస్తాలు